తెలంగాణపై మొంథా తుపాను దాడి.. 3 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Montha Cyclone Telangana : తెలంగాణలో మోంథా తుపాన్ ప్రభావంతో మూడు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీచేసింది.

తీరం తాకిన మొంథా తుఫాను.. తెలంగాణ పై తీవ్ర ప్రభావం
మొంథా తుపాను తీరం తాకింది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిందనీ, రాబోయే కొన్ని గంటల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
పూర్తిగా తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని స్పష్టం చేసింది. తీరప్రాంతాలకు సమీప జిల్లాలపై ప్రభావం క్రమంగా పెరుగుతుందని వివరించింది. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీచేసింది. ఉరుములు, మెరుపులు, గాలివానలు సంభవించే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
15 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కొమరం భీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న మూడు రోజులు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలపై ప్రభావం ఉంటుందని తెలిపారు.
17 జిల్లాలకు ఎల్లో అలర్ట్
బుధవారం నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం, గురువారం కూడా వర్షాలు వుంటాయని ఐఎండీ తెలిపింది.
పంటలకు నష్టం, రైతుల ఆందోళన
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటనష్టం జరుగుతోంది. తుపాను ప్రభావం పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షాలతో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయింది. కొంగోడు, నాయిని జలాల్ పూర్ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి దెబ్బతిన్నట్లు తెలిపారు. టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంతో నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ఎటువంటి తరుగు లేకుండా ప్రభుత్వ నిర్దేశిత ధరకు కొనుగోలు చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో పలు గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పొలాల్లో నిల్వ నీరు చేరి పంట దెబ్బతిన్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.