మొంథా తుపాను ఎఫెక్ట్ : ఈ ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలు బంద్.. హై అలర్ట్
Cyclone Montha : మొంథా తుపాను ప్రభావంతో ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాల నిలిపివేతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచించింది.

మొంథా తుపాను: వాహనాల నిలిపివేతకు ఆదేశాలు
మొంథా తుపాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసింది. రాష్ట్రంలోని కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (RTGS) తెలిపింది.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ నిలిపేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచనలు జారీ చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం ప్రయాణించేవారికి మాత్రమే మినహాయింపు ఇవ్వాలని స్పష్టం చేసింది.
మొంథా తుపాను బీభత్సం.. ప్రజలు ఇండ్లలోనే ఉండాలి
తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఊహిస్తున్న అధికార యంత్రాంగం ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ఆప్ డేట్లు, అధికారిక హెచ్చరికలు మాత్రమే పాటించాలనే విజ్ఞప్తి చేసింది.
తూర్పు తీరానికి చేరువలో మొంథా తుపాను
అమరావతి వాతావరణ శాఖ (ఐఎండీ) సమాచారం ప్రకారం, కోస్తాంధ్ర తీరం వైపు మొంథా తుపాను వేగంగా దూసుకొస్తోంది. కాకినాడకు దక్షిణంగా ఇవాళ రాత్రికే భూభాగాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తుపాను అలర్ట్: రాష్ట్రవ్యాప్తంగా భారీ సన్నాహాలు
తుపాను నిర్వహణ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది..
• రాష్ట్రవ్యాప్తంగా 403 మండలాల్లో ప్రభావం ఉండే అవకాశం
• 488 కంట్రోల్ రూంలు ఏర్పాటు
• మొత్తం 1,204 పునరావాస కేంద్రాల ఏర్పాటు
• 75,802 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
• 219 మెడికల్ క్యాంపులకు ఏర్పాట్లు
• అత్యవసర సమాచార నిమిత్తం 81 వైర్‌లెస్ టవర్లు సిద్ధం
• భారీ సైజు 21 ఆస్కా ల్యాంపులు సిద్ధంగా ఉంచారు
• 1,447 యంత్రాలు (జేసీబీలు, ప్రోక్లెయినర్లు, క్రేన్లు) సిద్ధం
• చెట్లు తొలగించేందుకు 1,040 రంపాలు సిద్ధం
• 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ
వర్ష ప్రభావంతో 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని నిల్వ ఉంచినట్టు అధికారులు తెలిపారు.
భారీ వర్షపాతం నమోదు.. తీవ్రంగా పంట నష్టం
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం 4 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు గమనిస్తే నెల్లూరు జిల్లా ఉలవపాడు అత్యధికంగా 12.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.
• సింగరాయకొండ: 10.5 సెం.మీ
• కావలి: 12.2 సెం.మీ
• దగదర్తి: 12 సెం.మీ
• బి.కోడూరు: 6 సెం.మీ
• కళింగపట్నం: 7 సెం.మీ
• విశాఖ: 2 సెం.మీ
• తుని: 2 సెం.మీ
ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్ల పంట నష్టం జరిగింది. 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా ప్రభావితమయ్యాయి.