- Home
- Telangana
- IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
IMD Cold Wave Alert : తెలంగాణలో ప్రస్తుతం సాధారణ చలి కాదు రాకాసి చలిగాలులు వీస్తున్నాయి. ఈ మూడురోజులు అయితే చలి పీక్స్ కు చేరుకుంటుందని… ఓ 11 జిల్లాల్లో అయితే అల్లకల్లోలం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

గజగజా వణికిస్తున్న చలి
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కుప్పకూలుతున్నాయి... చలి చంపేస్తోంది. తెల్లవారుజామున అయితే దట్టమైన పొగమంచు కురుస్తూ చలి గజగజలాడిస్తోంది... ఆ సమయంలో బయటకు వస్తే అంతే సంగతి... శరీరం గడ్డకట్టినట్లు మొద్దుబారిపోతోంది. డిసెంబర్ లోనే ఈ స్థాయి చలి ఉంటే ఇక జనవరిలో ఇంకెలా ఉంటుందోనని ప్రజలు కంగారుపడుతున్నారు.
ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే...
ఈ శీతాకాలంలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఇవాళ (డిసెంబర్ 20, శనివారం) తెల్లవారుజామున నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ లో అత్యల్పంగా 4.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కొమ్రంభీం జిల్లా సిర్పూర్ లో 4.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 5.1, వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో 5.8, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 5.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ప్రకటించింది.
తెలంగాణపై చలి పంజా విసురుతోంది
తెలంగాణవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేవలం ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట నాలుగు జిల్లాల్లోనే 10 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నాయి. ఇక్కడ కూడా 12 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హైదరాబాద్ లో లోయెస్ట్ టెంపరేచర్స్
హైదరాబాద్ లో అత్యల్పంగా శేరిలింగంపల్లి పరిధిలోని HCU ప్రాంతంలో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక రాజేంద్ర నగర్ లో 7.4, మౌలాలిలో 7.5, గచ్చిబౌలిలో 8.4, శివరాంపల్లిలో 8.4. ఈఎస్ఎస్ మచ్చబొల్లారంలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో కూడా ఇదేస్థాయికి టెంపరేచర్స్ పడిపోయి అత్యధిక చలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త...
తెలంగాణలో ఈ మూడ్రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని... ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు పీక్స్ కు చేరకుంటాయి... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. డిసెంబర్ 20, 21, 22 (శని, ఆది, సోమ) మూడ్రోజులు తెలంగాణలో అత్యంత శీతల పరిస్థితులు కొనసాగుతాయని... చాలాచోట్ల లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది..
చలి నుండి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీవ్రమైన చలి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి.
దుస్తులు: ఒకే మందపాటి దుస్తువు కంటే పలుచని పొరలుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల శరీర వేడి బయటకు పోకుండా ఉంటుంది. తల, చెవులను కప్పి ఉంచేలా మఫ్లర్లు లేదా టోపీలు ధరించండి.
ఆహారం ఆండ్ పానీయాలు: తగినంత పోషకాహారం తీసుకోండి. విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, వేడి పానీయాలు (గోరువెచ్చని నీరు, సూప్‌లు) తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రాత్రి ప్రయాణాలు: రాత్రి వేళల్లో, తెల్లవారుజామున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం: చలి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. వారిని సాధ్యమైనంత వరకు ఇంటి లోపలే ఉంచండి, వెచ్చగా ఉండేలా చూసుకోండి.
చలిమంటలతో జాగ్రత్త : గదుల లోపల బొగ్గు మంటలు వేసుకున్నప్పుడు గాలి ఆడేలా (Ventilation) చూసుకోండి. లేదంటే కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువుల వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

