- Home
- Telangana
- Hyderabad: హైడ్రా వాళ్లు మీ ఇంటిని కూల్చేస్తారని అనుమానంగా ఉందా? ఇది తెలుసుకుంటే పూర్తి క్లారిటీ
Hyderabad: హైడ్రా వాళ్లు మీ ఇంటిని కూల్చేస్తారని అనుమానంగా ఉందా? ఇది తెలుసుకుంటే పూర్తి క్లారిటీ
Hyderabad: అక్రమ నిర్మాణాలను కూల్చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఇళ్ల కూల్చివేతతో మరోసారి హైడ్రా గురించి చర్చ మొదలైంది.

ఇల్లు కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి
హైదరాబాద్‌లో స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేయడం అనేది చాలా మందికి జీవితంలో పెద్ద కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు చాలామంది తమ పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడంతో పాటు బ్యాంకుల నుంచి భారీ లోన్లు కూడా తీసుకుంటారు. ప్రతి నెలా ఆదాయంలో ఎక్కువ భాగం ఈఎంఐలకు వెచ్చించాల్సి వస్తుంది. ఇలా ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన ఇంటిని అధికారులు అక్రమ నిర్మాణమని కూల్చేస్తే ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సొంతింటిని లేదా భూమిని కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.
చెరువులో నిర్మాణాలు
ప్రస్తుతం హైదరాబాద్‌లో చెరువులు, కాలువలు, డ్రైనేజీ కెనాల్స్‌ను ఆక్రమించి లేఔట్లు వేస్తున్న రియల్టర్లు పెరిగిపోయారు. ఈ ప్రాంతాలకు ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL), బఫర్ జోన్ అనే పరిమితులు ఉంటాయి. కానీ వాటిని పట్టించుకోకుండా గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఇలాంటి ప్రాపర్టీలు కొనుగోలు చేసినవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
HMDA కొత్త పరిష్కారం
ఈ సమస్యను తగ్గించడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఒక పరిష్కారాన్ని చూపించింది. నగరంలోని చెరువుల వివరాలను సేకరించి వాటి బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిమితులను ఖరారు చేసింది. ఈ సమాచారాన్ని అందరికీ సులభంగా అందించేందుకు https://lakes.hmda.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
కొనుగోలు ముందు తప్పనిసరిగా చెక్ చేయాలి
మీరు కొనబోతున్న స్థలం లేదా ఇల్లు ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లోకి వస్తుందా లేదా అని ఈ వెబ్‌సైట్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ అది నిషేధిత పరిధిలోకి వస్తే, ఆ ప్రాపర్టీ నివాసయోగ్యం కాదని వెంటనే గ్రహించి మీ నిర్ణయం మార్చుకోవచ్చు. ఈ విధానం ద్వారా మీరు పెట్టుబడి రక్షించుకోవడమే కాక, భవిష్యత్తులో సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో వివరాలు తెలుసుకునే విధానం
* ముందుగా HMDA అధికారిక వెబ్‌సైట్ https://lakes.hmda.gov.in/ ఓపెన్ చేయాలి.
* అక్కడ జిల్లా, మండలం, గ్రామం, లేక్/చెరువు పేరు లేదా ఐడి నెంబర్ వంటి ఆప్షన్లు వస్తాయి.
* మీ జిల్లా ఎంచుకున్న తర్వాత మిగతా వివరాలను సెలెక్ట్ చేయాలి.
* సంబంధిత చెరువు పేరు లేదా ఐడి నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే కుడివైపు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వివరాలు కనిపిస్తాయి.
* వాటిపై క్లిక్ చేసి మీ ప్లాట్ సురక్షితమా కాదా తెలుసుకోవచ్చు.