Stray Dogs: రెండోసారి కరిస్తే కుక్కలకు జీవిత ఖైదు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.
Stray Dogs: వీధి కుక్కల వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశం సుప్రీం వరకు చేరింది. కాగా తాజాగా యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

వీధి కుక్కల కోసం ప్రత్యేక చట్టం
ఉత్తరప్రదేశ్‌లో వీధి కుక్కల కోసం కొత్త చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం, వీధి కుక్క ఎవరినైనా కరిస్తే, స్థానిక మున్సిపాలిటీ దాన్ని పట్టుకొని జంతు జనన నియంత్రణ కేంద్రంలో (Animal Birth Control Center) 10 రోజుల పాటు ఉంచుతుంది. కరిచిన వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య ధృవీకరణ పత్రం అందించాలి.
కుక్కలకు జీవిత ఖైదు
ఒక కుక్క మళ్లీ ఎవరినైనా కరిస్తే దానిని “సాధారణ నేరస్థుడిగా” పరిగణిస్తారు. అలాంటి కుక్కను జీవితాంతం జంతు కేంద్రంలోనే బంధిస్తారు. ఈ కేంద్రం చిన్న జైలును పోలి ఉంటుంది, ఇక్కడ బ్యారక్‌లు, ఐసోలేషన్ గదులు ఉంటాయి. కేవలం దత్తతకు సిద్ధమైన వ్యక్తి మాత్రమే ఆ కుక్కను తీసుకుపోవచ్చు.
ట్రాకింగ్, మైక్రో చిప్ ఏర్పాటు
కుక్కలను విడుదల చేసిన తర్వాత వాటిని ట్రాక్ చేయడానికి మైక్రోచిప్‌ను ఏర్పాటు చేస్తారు. శునకం ఒకవేళ మళ్లీ కరిస్తే వెంటనే గుర్తించడానికి, ప్రజల భద్రత కోసం ఉపయోగపడుతుంది.
విదేశాల్లో ఎలాంటి విధానాలు ఉన్నాయి.?
ప్రపంచంలోని కొన్ని దేశాలు వీధి కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక పద్ధతులు ఉపయోగిస్తున్నాయి.
నెదర్లాండ్స్: క్యాచ్, న్యూటర్, టీకా, రిటర్న్ (CNVR) కార్యక్రమాలు అమలు చేయడం, ప్రజలను ఆశ్రయాల నుంచి కుక్కలను దత్తత తీసుకోవడానికి ప్రోత్సహించడం.
టర్కీ: మున్సిపాలిటీ వీధి కుక్కలకు గృహాలను అందిస్తున్నాయి.
సింగపూర్: కుక్కలకు టీకాలు వేయడం, మైక్రోచిప్ ద్వారా ట్రాక్ చేయడం. మళ్లీ కరిస్తే, కుక్కను ఆశ్రయానికి తీసుకెళ్లడం.
కుక్కల యజమానులు కూడా బాధ్యులు
ప్రపంచంలో చాలా దేశాలు కుక్కల యజమానులను కూడా బాధ్యులుగా చేస్తున్నాయి.
ఫ్రాన్స్: పెంపుడు కుక్క ఎవరినైనా కరిస్తే, యజమానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.
ఇంగ్లాండ్: పెంపుడు జంతువుల యజమానులపై కుక్క దాడులకు జైలు శిక్షలు.
US రాష్ట్రాలు (జార్జియా, మిచిగాన్, వర్జీనియా): కుక్క దాడులకు సంబంధించి కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు.