- Home
- Telangana
- Hyderabad: హైదరాబాద్‌లో అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు.. వెయ్యి మంది బందోబస్తుతో రెండేళ్ల పాటు
Hyderabad: హైదరాబాద్‌లో అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు.. వెయ్యి మంది బందోబస్తుతో రెండేళ్ల పాటు
Hyderabad: జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ విధానంలో కీలక మార్పులు నేటి (మంగళవారం) నుంచి అమల్లోకి వచ్చాయి. పలు నిర్మాణం పనులు జరగనున్పన నేపథ్యంలో వన్‌వేను అమలు చేస్తున్నారు.

రూ.1,090 కోట్ల హెచ్-సిటీ ప్రాజెక్టు..
కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడం కోసం హెచ్-సిటీ ప్రాజెక్టు కింద పలు కీలక మౌలిక వసతుల పనులు చేపడుతున్నారు. దాదాపు రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఏడు మల్టీ లెవల్ స్టీల్ ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఇప్పటికే కొన్ని పిల్లర్ల పనులు ప్రారంభమయ్యాయి. ఒకేసారి మరిన్ని పిల్లర్లకు ఫౌండేషన్ పనులు చేపట్టేందుకు రహదారులపై అవసరమైన స్థలం కల్పించాల్సి ఉండటంతో వన్‌వే విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఏప్రిల్ 5, జూన్ 21 తేదీల్లో ట్రయల్ రన్‌లు నిర్వహించారు. వాటి అనుభవాలను పరిశీలించిన తర్వాత ప్రస్తుత విధానాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్ వెళ్లేవారికి కొత్త మార్గాలు
పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ లేదా ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనదారులు ఇకపై పాత రూట్‌ను పూర్తిగా ఉపయోగించలేరు. రోడ్ నంబర్ 10, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మీదుగా నిర్దేశించిన వన్‌వే మార్గంలో ప్రయాణించి రోడ్ నంబర్ 45కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, ఐటీ కారిడార్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద ఎడమవైపు మళ్లి బసవతారకం, అగ్రసేన్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మీదుగా కూడా రోడ్ నంబర్ 45కు చేరుకోవచ్చు. రోడ్ నంబర్ 45, జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి వచ్చే వాహనాలు BVB జంక్షన్ దాటి చెక్‌పోస్ట్ వైపు వెళ్లవచ్చు. వెంకటగిరి, ఇందిరానగర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు వెంకటగిరి రోడ్డు ప్రధాన మార్గంగా ఉంటుంది.
#HYDTPinfo
🚦 KBR PARK ONE-WAY TRAFFIC SYSTEM IS NOW LIVE! 🚦
The One-Way Traffic System around KBR Park is now operational.
📍 Google Maps have been updated with the new routes for the convenience of commuters.
🪧 Proper signage boards and necessary traffic equipment have… pic.twitter.com/AYxDVuiBkj— Hyderabad Traffic Police (@HYDTP) August 18, 2026
ఎన్టీఆర్ భవన్, ఫిలింనగర్, అన్నపూర్ణ వైపు వెళ్లేవారు ఇలా వెళ్లాలి
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి ఎన్టీఆర్ భవన్ లేదా అన్నపూర్ణ స్టూడియో ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు కూడా మార్పులు చేశారు. గతంలో మహారాజా అగ్రసేన్ ఐలాండ్ వద్ద కుడివైపు మలుపు తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ మలుపును మూసివేశారు. ఇక వాహనదారులు ఐలాండ్ వద్ద ఎడమవైపు మళ్లి జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా ముందుకు వెళ్లాలి. క్రీమ్ స్టోన్ సమీపంలోని లేన్ ఛేంజర్ నంబర్ 10 ద్వారా ఎన్టీఆర్ భవన్ లేదా అన్నపూర్ణ బైలేన్ వైపు చేరుకోవచ్చు. ఎన్టీఆర్ భవన్, అన్నపూర్ణ స్టూడియో వైపు నుంచి వచ్చే వాహనాలు రోడ్ నంబర్ 2 మీదుగా ప్రయాణించి E11, E12 ఎగ్జిట్ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. అక్కడి నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ రోడ్డుకు చేరుకునేలా మార్గాలను ఏర్పాటు చేశారు. ఇందిరానగర్, వెంకటగిరి నుంచి ఫిలింనగర్ వెళ్లేవారు కూడా చెక్‌పోస్ట్ వద్ద నేరుగా వెళ్లే బదులు నిర్దేశించిన మళ్లింపు మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. చెక్‌పోస్ట్ నుంచి ఎడమవైపు తిరిగి ఎన్టీఆర్ భవన్, క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్ మీదుగా ఫిలింనగర్ చేరుకోవాలి.
#HYDTPinfo
🚨 కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం 🚨
హైదరాబాద్ నగరంలో చేపడుతున్న H-CITI ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే (ఏకదిశా) ట్రాఫిక్ విధానం అమలు చేయబడుతోంది.
📅 అమలు తేదీ: 18.08.2026
⏰ సమయం: ఉదయం… pic.twitter.com/m423DUu37v— Hyderabad Traffic Police (@HYDTP) August 17, 2026
లేన్ ఛేంజర్లు, సైన్ బోర్డులు.. పోలీసులు ప్రత్యేక నిఘా
వాహనదారులకు కొత్త మార్గాలు అర్థమయ్యేలా కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రత్యేక సైన్ బోర్డులు, లేన్ మార్కింగ్‌లు ఏర్పాటు చేశారు. రెండు ప్రధాన జంక్షన్ల మధ్య ఒక లేన్ ఛేంజర్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. జూబ్లీ చెక్‌పోస్ట్ ప్రాంతంలో LC-6, LC-7 వంటి లేన్ ఛేంజ్ పాయింట్లు వాహనదారులకు మార్గం మార్చుకోవడంలో ఉపయోగపడతాయి. రోడ్ నంబర్ 65 యూ-టర్న్, క్రీమ్ స్టోన్ ప్రాంతాలు కూడా కీలక మార్పిడి పాయింట్లుగా ఉంటాయి. కొత్త ట్రాఫిక్ విధానాన్ని పర్యవేక్షించేందుకు పోలీసులు నాలుగు షిఫ్టుల్లో సిబ్బందిని మోహరిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా వెయ్యి మంది సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రియల్ టైమ్ ట్రాఫిక్ పరిస్థితిని తెలుసుకునేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం, ట్రాఫిక్ సూచనలను పట్టించుకోకపోవడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాకర్లు తమ వాహనాలను రోడ్డుపై కాకుండా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో లేదా మల్టీ లెవల్ పార్కింగ్‌లోనే పార్క్ చేయాలని సూచించారు.
భారీ ట్రాఫిక్ రద్దీ.. వాహనదారుల ఆందోళన
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఇప్పటికే వాహనాల రద్దీ అధికంగా ఉంది. పీక్ అవర్స్‌లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద గంటకు సుమారు 15,321 ప్యాసింజర్ కార్ యూనిట్ల (PCU) ట్రాఫిక్ నమోదవుతోంది. కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద 13,516 PCUలు, మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద 10,356 PCUలు, రోడ్ నంబర్ 45 జంక్షన్ వద్ద 9,966 PCUల వరకు వాహన రద్దీ ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్త వన్‌వే విధానం మొదలైన తొలి రోజుల్లో కొందరు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా కొన్ని నిమిషాల్లో చేరుకునే ప్రాంతాలకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సమయం పెరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రూట్లపై అవగాహన లేకపోవడంతో కొందరు వాహనదారులు మార్గం తప్పి తిరిగి అదే ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
అయితే నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఎదురయ్యే ఇబ్బందులను భరించాలని అధికారులు కోరుతున్నారు. వన్‌వే విధానం ద్వారా నిర్మాణ పనులకు అవసరమైన స్థలం అందుబాటులోకి రావడంతో ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తవుతాయని చెబుతున్నారు. భవిష్యత్తులో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వస్తే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వాహనదారులు ప్రయాణానికి ముందే తమ గమ్యస్థానానికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాన్ని తెలుసుకోవడం, రోడ్డుపై ఏర్పాటు చేసిన లేన్-1, లేన్-2 సూచనలను పాటించడం అత్యంత ముఖ్యమని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ప్రజలు సహకరిస్తే నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

