డబ్బులుంటే ఇప్పుడే కొనేయండి.. త్వరలోనే ఈ ప్రాంతం మరో గచ్చిబౌలి కావడం ఖాయం
Hyderabad: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అంటే కొన్నేళ్లుగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి ప్రాంతాలే గుర్తొచ్చేవి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో శంషాబాద్ పేరు చేరుతోంది. దీనికి కారణాలు ఏంటంటే.?

గచ్చిబౌలికి ఉన్నట్టే శంషాబాద్‌కు అద్భుతమైన కనెక్టివిటీ
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా కావాల్సింది మంచి రవాణా సదుపాయం. ఈ విషయంలో శంషాబాద్‌కు పెద్ద ప్రయోజనం ఉంది. హైదరాబాద్‌లోని వెస్ట్ జోన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా శంషాబాద్‌ను సుమారు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. బెంగళూరు హైవే కూడా ఈ ప్రాంతం మీదుగా వెళ్తుంది. మరోవైపు సుమారు 15 నిమిషాల్లో శ్రీశైలం రోడ్డుకు చేరుకునే అవకాశం ఉంది.
అన్నింటికంటే ముఖ్యంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉండటం శంషాబాద్ పెద్ద ప్లస్ పాయింట్. విమానాశ్రయం చుట్టూ సాధారణంగా హోటళ్లు, కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి కూడా మెరుగైన కనెక్టివిటీ, ఉద్యోగ అవకాశాల కారణంగానే భారీ రియల్ ఎస్టేట్ హబ్‌గా ఎదిగింది. ఇప్పుడు అదే తరహా పరిస్థితులు శంషాబాద్ చుట్టూ కనిపిస్తున్నాయి.
ఫ్యూచర్ సిటీతో శంషాబాద్‌కు మరింత ఊపు
శంషాబాద్‌కు సమీపంలో ఏర్పడుతున్న ఫ్యూచర్ సిటీ ఈ ప్రాంత భవిష్యత్తును మార్చే ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఫ్యూచర్ సిటీ చుట్టూ భారీ మౌలిక వసతులు, కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగే కొద్దీ ఉద్యోగాల కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీసీఎస్ ఇప్పటికే ఆదిబట్లలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఏరోస్పేస్ కేంద్రాలు, ఫ్యాబ్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్ వంటి ప్రాంతాలు కూడా శంషాబాద్‌కు సమీపంలోనే ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రావడంతో ఈ ప్రాంతంలో ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు తమ కార్యాలయాలకు దగ్గరగా ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తే శంషాబాద్ ఒక ముఖ్యమైన ఎంపికగా మారే అవకాశం ఉంది. ఇదే విధంగా గతంలో గచ్చిబౌలి చుట్టూ ఉద్యోగాలు పెరగడంతో నివాస ప్రాంతాలు వేగంగా విస్తరించాయి.
గచ్చిబౌలితో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ ఇళ్ల ధరలు తక్కువ
శంషాబాద్‌కు ప్రస్తుతం మరో ముఖ్యమైన ఆకర్షణ అందుబాటులో ఉన్న ధరలు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో ఇల్లు కొనాలంటే రూ.1.5 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో శంషాబాద్ ప్రాంతంలో సుమారు రూ.60 లక్షల పరిధిలో 2BHK ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చెబుతున్నారు. శంషాబాద్‌కు కొంత దూరంలో ఉన్న కొత్తూరు ప్రాంతంలో ఇదే తరహా అపార్ట్‌మెంట్లు సుమారు రూ.45 లక్షల నుంచి లభిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇల్లు కొనుగోలు చేసేందుకు ఈ ప్రాంతాల వైపు చూస్తున్నారు. ఫ్లాట్లతో పాటు ప్లాట్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ప్రాంతం, ప్రాజెక్ట్, రోడ్డు కనెక్టివిటీని బట్టి ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం రూ.35 వేల నుంచి రూ.90 వేల వరకు ధరలు కనిపిస్తున్నాయి. ఈ ధరలు గచ్చిబౌలి స్థాయికి చేరుకోకముందే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి శంషాబాద్ ఆసక్తికరమైన ప్రాంతంగా మారుతోంది.
ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లతో వేగంగా పెరుగుతున్న నిర్మాణాలు
శంషాబాద్ నుంచి సాతంరాయి, మామిడిపల్లి వైపు ఇప్పటికే అనేక అపార్ట్‌మెంట్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ పరిసరాల్లో సుమారు 25 ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు సుమారు రూ.4,000 నుంచి రూ.6,000 మధ్య ఉన్నాయి. విల్లాల ధరలు ప్రాజెక్ట్, ప్రాంతాన్ని బట్టి సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉన్నాయి. మరోవైపు భవిష్యత్‌లో సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
మరో గచ్చిబౌలిగా మారే అవకాశం ఎందుకు కనిపిస్తోంది?
శంషాబాద్‌కు ఉన్న అతిపెద్ద బలం ఒక్క అంశం కాదు. విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, బెంగళూరు హైవే, ఐటీ ఉద్యోగ కేంద్రాలు, ఏరోస్పేస్ పరిశ్రమలు, ఫ్యూచర్ సిటీ, ఫార్మా సంబంధిత అభివృద్ధి.. ఇవన్నీ ఒకే ప్రాంతం చుట్టూ కలుస్తున్నాయి. భవిష్యత్‌లో మెట్రో విస్తరణ, బుల్లెట్ ట్రైన్ హబ్, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, అంతర్గత రేడియల్ రోడ్లు వంటి మౌలిక వసతులు మెరుగుపడితే శంషాబాద్ కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు పెరిగితే వాటికి అనుగుణంగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, షాపింగ్ ప్రాంతాలు, కార్యాలయాలు కూడా పెరుగుతాయి.
గచ్చిబౌలి అభివృద్ధిలో కూడా ఇలాంటి అంశాలే కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం గచ్చిబౌలితో పోలిస్తే శంషాబాద్‌లో ఆస్తుల ధరలు తక్కువగా ఉండటం కూడా ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకతగా మారింది. అందుకే రాబోయే ఐదేళ్లలో శంషాబాద్ ఎలా మారుతుంది? అనే ప్రశ్నకు సమాధానం వెతికితే.. మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు, నివాస డిమాండ్, విమానాశ్రయం చుట్టూ పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు కీలకంగా కనిపిస్తున్నాయి.
గమనిక: ఏ ప్రాంతంలోనైనా రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం ఖాయం అని చెప్పలేం. ప్రాజెక్ట్ అనుమతులు, రోడ్డు సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు, మార్కెట్ పరిస్థితులు వంటి అనేక అంశాలపై భవిష్యత్ ధరలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల ప్లాట్ లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు సంబంధిత పత్రాలు, అనుమతులు, జోన్ వివరాలు, రోడ్డు కనెక్టివిటీ వంటి అంశాలను పరిశీలించడం ముఖ్యం.

