Railway: ఈ దేశాల్లో ఒక్క రైలు కనిపించదు.. అసలు కారణం ఏంటో తెలుసా.?
Railway: కువైట్, ఖతార్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి భారీ భవనాలు, విశాలమైన రహదారులు, ఖరీదైన కార్లు, అత్యాధునిక సౌకర్యాలు. కానీ ఇంత అభివృద్ధి చెందిన దేశాల్లో రైళ్లు మాత్రం ఎందుకు కనిపించవు? ఎందుకో తెలుసా?

చిన్న దేశాలు.. తక్కువ దూరాల ప్రయాణం
కువైట్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలు భౌగోళికంగా చాలా చిన్నవి. జనాభా కూడా ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే తక్కువే. దీంతో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. తక్కువ దూరాల ప్రయాణాలకు రైలు కంటే కార్లు, బస్సులు ఉపయోగించడం అక్కడి ప్రజలకు సౌకర్యంగా మారింది. దీనికి తోడు ఈ దేశాలు చమురు సంపదతో భారీగా ఆదాయం పొందడంతో అత్యాధునిక రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించాయి. ఫలితంగా వ్యక్తిగత కార్లే ప్రధాన రవాణా సాధనంగా మారాయి.
రైళ్లు లేకపోయినా మెట్రోలు ఉన్నాయి
ఈ దేశాల్లో రైలు వ్యవస్థ పూర్తిగా లేదని అనుకోవడం కూడా సరికాదు. సుదూర ప్రయాణాల కోసం జాతీయ రైల్వే నెట్‌వర్క్‌లు పెద్దగా లేకపోయినా, నగరాల్లో ప్రజా రవాణాను సులభతరం చేసేందుకు మెట్రో వ్యవస్థలను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఖతార్‌లోని దోహా మెట్రో అత్యాధునిక రవాణా వ్యవస్థగా అందుబాటులో ఉంది. అంటే రైలు అవసరం లేదని కాదు.. చిన్న దేశాల పరిస్థితులకు అనుగుణంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేశారన్నమాట.
ఆరు గల్ఫ్ దేశాలను కలపనున్న రైల్వే
ఇప్పటివరకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రైల్వే వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మిగిలిన గల్ఫ్ దేశాలను కూడా రైల్వే మార్గాలతో కలపడానికి GCC రైల్వే ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్ దేశాలు ఒకే రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయి. మొత్తం మార్గం సుమారు 2,117 కిలోమీటర్ల మేర ఉండనుంది.
2030 నాటికి రైలు ప్రయాణానికి అవకాశం
GCC రైల్వే ప్రాజెక్ట్‌ను 2030 నాటికి పూర్తి చేయాలని ప్రణాళికలు ఉన్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే గల్ఫ్ దేశాల మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రస్తుతం కార్లు, బస్సులు లేదా విమానాలపై ఆధారపడుతున్న ప్రయాణికులకు రైలు మరో ప్రత్యామ్నాయంగా మారుతుంది. ముఖ్యంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే ప్రయాణాల్లో ఈ రైల్వే వ్యవస్థ ఉపయోగపడనుంది.
సముద్రంపై వంతెనలు.. గల్ఫ్ దేశాల మధ్య రైలు ప్రయాణం
ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం గల్ఫ్ దేశాలను ఒకే రైల్వే నెట్‌వర్క్‌లో కలపడం. బహ్రెయిన్, ఖతార్ వంటి ప్రాంతాలను అనుసంధానించేందుకు సముద్రంపై నిర్మించే వంతెనలు, ఇతర ప్రత్యేక మౌలిక వసతులు కూడా ప్రణాళికలో ఉన్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే ఇప్పటివరకు రైల్వే నెట్‌వర్క్ లేని కొన్ని గల్ఫ్ దేశాల్లో కూడా అంతర్జాతీయ రైలు ప్రయాణానికి మార్గం ఏర్పడుతుంది. అంటే ఇంతకాలం రైళ్లు పెద్దగా కనిపించని ఈ దేశాల్లో రాబోయే సంవత్సరాల్లో రైళ్లు పరుగులు పెట్టనున్నాయన్నమాట.

