- Home
- Telangana
- హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం త్వరలోనే మరో మియాపూర్ కావడం ఖాయం.. ఇప్పుడు కొన్నవాళ్లు అదృష్టవంతులు
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం త్వరలోనే మరో మియాపూర్ కావడం ఖాయం.. ఇప్పుడు కొన్నవాళ్లు అదృష్టవంతులు
Hyderabad Real Estate: హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ నగర శివారు ప్రాంతాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కొత్త గమ్యస్థానాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న శామీర్‌పేట సమీపంలోని అలియాబాద్ ఇప్పుడు అదే జాబితాలో చేరింది.

ఒక చిన్న గ్రామం నుంచి రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా అలియాబాద్
కొన్ని సంవత్సరాల క్రితం వరకు అలియాబాద్ పేరు చాలా మందికి తెలియదు. కేవలం ఇక్కడ రత్నాలయం ఉందని మాత్రమే తెలుసుకు కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శామీర్‌పేటకు సమీపంలో ఉండటంతో పాటు సికింద్రాబాద్–కరీంనగర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన బలంగా మారింది. రహదారి కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ప్రముఖ రెస్టారెంట్లు, రోజువారీ అవసరాలకు కావాల్సిన వాణిజ్య సదుపాయాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో కుటుంబాలతో నివసించేందుకు అనువైన ప్రాంతంగా అలియాబాద్ ఎదుగుతోంది.
జీనోమ్ వ్యాలీ, విద్యాసంస్థల ప్రభావంతో పెరుగుతున్న డిమాండ్
అలియాబాద్‌కు అత్యంత పెద్ద బలం జీనోమ్ వ్యాలీకి దగ్గరగా ఉండటమే. బయోటెక్, ఫార్మా రంగాల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఈ ప్రాంతంలో నివాసాల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో అద్దె ఇళ్లకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. మరోవైపు నల్సార్ లా యూనివర్సిటీ, బిట్స్ క్యాంపస్ తో పాటు అనేక ప్రముఖ బిజినెస్ స్కూల్స్, ఇంజినీరింగ్ కళాశాలలు సమీపంలో ఉండటంతో విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల రాకపోకలు పెరుగుతున్నాయి. ఈ కారణంగా ప్లాట్లు మాత్రమే కాదు, ఇండిపెండెంట్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లకు కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
భారీ మౌలిక సదుపాయాలతో మారనున్న అలియాబాద్ భవిష్యత్తు
రియల్ ఎస్టేట్ విలువ పెరగడానికి మౌలిక సదుపాయాలే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఆ విషయంలో అలియాబాద్‌కు భారీ ప్రయోజనం కనిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలకు వేగంగా చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) కూడా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. మరోవైపు ప్రతిపాదిత కండ్లకోయ ఐటీ పార్క్ అలియాబాద్‌కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఈ ప్రాంత భవిష్యత్తుకు మరింత బలాన్ని ఇస్తోంది. ఐటీ, బయోటెక్ రంగాల విస్తరణతో ఇక్కడ నివాసాల అవసరం మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎలివేటెడ్ కారిడార్, మెట్రో ప్రణాళికలతో మరింత వేగం
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంతో అలియాబాద్ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. భవిష్యత్తులో మెట్రో రైలు మార్గాన్ని కూడా ఈ ప్రాంతం వైపు విస్తరించే అవకాశాలపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు అమల్లోకి వస్తే అలియాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మియాపూర్, కొంపల్లి, లింగంపల్లి వంటి ప్రాంతాలు మౌలిక సదుపాయాల కారణంగానే వేగంగా ఎదిగినట్లే, అలియాబాద్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చు.
ఇప్పుడు పెట్టుబడి పెడితే భారీ లాభాలు..
రియల్ ఎస్టేట్‌లో సరైన ప్రాంతాన్ని సరైన సమయంలో ఎంపిక చేసుకోవడమే విజయానికి కీలకం. ప్రస్తుతం అలియాబాద్‌లో కనిపిస్తున్న అభివృద్ధి, భవిష్యత్తులో రానున్న రహదారి ప్రాజెక్టులు, ఐటీ పార్క్, విద్యాసంస్థలు, జీనోమ్ వ్యాలీ సమీపం, పెరుగుతున్న రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వంటి అంశాలు ఈ ప్రాంతాన్ని దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా మారుస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలన్నీ పూర్తయితే అలియాబాద్ కూడా ఒకప్పుడు మియాపూర్ ఎలా అభివృద్ధి చెందిందో అదే తరహాలో హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా మారే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి గురించి ఆలోచిస్తున్న వారికి అలియాబాద్ ప్రస్తుతం పరిశీలించదగ్గ ప్రాంతంగా మారుతోంది.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సూచనలు పాటించడం ఉత్తమం.

