హైదరాబాద్ టూ గోవా విమానంలో వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది.? సూపర్ ప్యాకేజీ
Goa Tour: ప్రముఖ పర్యాటక ప్రదేశం గోవాను సందర్శించేందుకు అంతా ఆసక్తి చూపిస్తుంటారు. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక విమాన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

గోవా డిలైట్ ప్యాకేజీ ప్రత్యేకతలు
IRCTC ప్రవేశపెట్టిన "గోవా డిలైట్" ప్యాకేజీ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టూర్ సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతుంది. విమాన ప్రయాణం, హోటల్ బస, భోజన సదుపాయాలు, స్థానిక రవాణా వంటి సేవలు ప్యాకేజీలోనే ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో ఉదయం బయల్దేరి మధ్యాహ్నానికి గోవా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. తిరుగు ప్రయాణం కూడా అదే విధంగా విమాన మార్గంలో ఉంటుంది.
ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయి?
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని IRCTC వివిధ కేటగిరీల్లో ధరలను నిర్ణయించింది. సింగిల్ ఆక్యుపెన్సీ రూ.24,640, డబుల్ షేరింగ్ రూ.19,200 (ఒక్కో వ్యక్తికి), ట్రిపుల్ షేరింగ్ రూ.18,680 (ఒక్కో వ్యక్తికి), 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు: రూ.15,520, 2 నుంచి 4 ఏళ్ల పిల్లలకు: రూ.9,130గా నిర్ణయించారు. ఈ ధరల్లో విమాన టిక్కెట్లు, హోటల్ వసతి, భోజనం, స్థానిక ప్రయాణ ఖర్చులు కూడా కవర్ అయ్యాయి.
సౌత్ గోవాలో ఏయే ప్రదేశాలు చూపిస్తారు?
గోవా చేరుకున్న మొదటి రోజు హోటల్‌లో చెక్-ఇన్ చేసిన తర్వాత స్థానిక మార్కెట్లను సందర్శించే అవకాశం ఉంటుంది. సాయంత్రం విశ్రాంతి తీసుకుని హోటల్‌లోనే రాత్రి బస ఉంటుంది. రెండో రోజు సౌత్ గోవా పర్యటనలో భాగంగా పర్యాటకులను పలు ప్రముఖ ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఓల్డ్ గోవాలోని చారిత్రక చర్చిలు, మ్యూజియంలు, ప్రసిద్ధ శ్రీ మంగేషి ఆలయం, మిరామార్ బీచ్ వంటి ప్రదేశాలు ఇందులో ఉంటాయి. సాయంత్రం మండోవీ నదిపై బోట్ క్రూయిజ్ ప్రయాణం కూడా ఏర్పాటు చేశారు. గోవా అందాలను నీటి మార్గంలో ఆస్వాదించే అవకాశం ఇది.
నార్త్ గోవా టూర్‌లో ఆకర్షణలు
మూడో రోజు నార్త్ గోవా సందర్శన ఉంటుంది. గోవాలో అత్యంత ప్రసిద్ధి చెందిన బీచ్‌లలో కొన్ని ఈ పర్యటనలో భాగం.
అగువాడా ప్రాంతం, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్, అంజునా బీచ్, వగాటర్ బీచ్‌లను సందర్శించవచ్చు. అడ్వెంచర్ ప్రియుల కోసం వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలు కూడా అందుబాటులో ఉంటాయి. అదనంగా చారిత్రక ప్రాధాన్యం కలిగిన చాపోరా కోటను కూడా వీక్షించే అవకాశం కల్పిస్తారు.
ప్యాకేజీలో లభించే సదుపాయాలు
ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు అనేక సౌకర్యాలు అందిస్తారు.
* హైదరాబాద్-గోవా-హైదరాబాద్ విమాన టిక్కెట్లు
* ఏసీ హోటల్ వసతి
* మూడు రోజుల అల్పాహారం
* మూడు రోజుల డిన్నర్
* గోవాలో ఇంటర్నల్ ఏసీ వాహన రవాణా
* నిర్ణీత పర్యాటక ప్రాంతాల సందర్శన
టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ సమాచారం కోసం సికింద్రాబాద్‌లోని IRCTC జోనల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే 040-27702407, 9701360701 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం పొందవచ్చు.
అలాంటి వారికి ఇది మంచి అవకాశం
విమాన ప్రయాణం, వసతి, భోజనం, పర్యాటక ప్రదేశాల సందర్శన అన్నీ ఒకే ప్యాకేజీలో లభిస్తుండటంతో కుటుంబాలు, స్నేహితుల బృందాలు, జంటలకు ఈ టూర్ అనుకూలంగా ఉంటుంది. గోవా ట్రిప్‌ను సులభంగా ప్లాన్ చేయాలనుకునే వారికి IRCTC ఈ ప్యాకేజీ ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుంది.

