Railway : తెలంగాణలో అత్యంత వేగంగా నడిచే రైలు ఏది? దీని స్పీడ్ ఎంతో తెలుసా?
Fastest Train in Telangana : వందే భారత్ కాకుండా తెలంగాణలో అత్యధిక వేగంతో దూసుకెళ్లే రైలు ఏదో తెలుసా? ఇది ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తుందో తెలుసా?

ఫాస్టెస్ట్ రైళ్లు
ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏది అనగానే టక్కున వందేభారత్ పేరు వినిపిస్తుంది. ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగుతీయగలదు... కానీ ఆపరేషనల్ స్పీడ్ మాత్రం 100 నుండి 130 కి.మీ మాత్రమే. ఇదే ప్రశ్నకు సమీప భవిష్యత్ లో సమాధానం మారనుంది... బుల్లెట్ ట్రైన్ పాస్టెస్ట్ ట్రైన్ గా గుర్తింపు పొందనుంది. ఇది గంటకు 320 కి.మీ దూసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగివుంటుంది... కానీ ఆపరేషనల్ స్పీడ్ 250 km/h కి అటుఇటుగా ఉండే అవకాశాలున్నాయి.
ప్రెజెంట్, ఫ్యూచర్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ సరే... వీటికంటే ముందు అంటే గతంలో అత్యంత వేగంగా నడిచే రైళ్లేవి? ఈ ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియకపోవచ్చు. కాబట్టి వందేభారత్ కంటే ముందు తెలంగాణలో అత్యంత వేగంగా నడిచే ట్రైన్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
KNOW
తెలంగాణలో అత్యంత వేగంగా నడిచే రైలు ఇదే...
తెలంగాణలో ఇండియన్ రైల్వే నెట్ వర్క్ బాగా విస్తరించి ఉంది... దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా సికింద్రబాద్ కొనసాగుతోంది. అంతేకాదు హైదరాబాద్ లోని నాంపల్లి, కాచిగూడతో పాటు ఇటీవల నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్లు తెలుగు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ స్టేషన్ల నుండి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలకే కాదు దేశవ్యాప్తంగా రైళ్లు నడుస్తాయి. ఇలా తెలంగాణ రాజధాని నుండి దేశ రాజధాని డిల్లీకి నడుస్తుంది తెలంగాణ ఎక్స్ ప్రెస్ (12723/12724). ఇదే తెలంగాణలో అత్యంత వేగంగా నడిచే రైలు.
హైదరాబాద్ - న్యూడిల్లీ మధ్య రైల్వే దూరం 1,677 కిలోమీటర్లు. ఇంత దూరాన్ని తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఒక్కరోజులో (25-26 గంటల్లో) పూర్తిచేస్తుంది. అంటే గంటకు సుమారు 65 నుండి 70 కి.మీ వేగంతో దూసుకెళుతుంది. ఇది హైదరాబాద్-డిల్లీ మధ్య ప్రతిరోజు ప్రయాణం సాగిస్తుంటుంది.
కేవలం తెలంగాణలోనే నడిచే ఫాస్టెస్ట్ ట్రైన్ ఏది?
తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు నడిచే వేగవంతమైన రైలు తెలంగాణ ఎక్స్ ప్రెస్. మరి తెలంగాణలోనే ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వేగంగా దూసుకెళ్లే రైలు ఏదో తెలుసా? సికింద్రాబాద్-మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.
హైదరాబాద్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు 330 కి. మీ దూరం ఉంటుంది. ఈ దూరాన్ని కేవలం ఆరు గంటల్లోనే పూర్తిచేస్తుంది ఈ రైలు... అంటే గంటకు 50 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ఈ సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్ ప్రెస్ దూసుకెళుతుంది.
హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్
ఆంధ్ర ప్రదేశ్ ను హైదరాబాద్ తో కనెక్ట్ చేసే ఓ రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖపట్నం నుండి శంషాబాద్ కు సెమి హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు రైల్వే శాఖ సిద్దమయ్యింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏకంగా గంటకు 220 కి.మీ వేగంతో రైలు ప్రయాణం సాగుతుంది.
హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య 600 కి.మీ పైగా దూరం ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య జర్నీకి 10-12 గంటల సమయం పడుతుంది. అయితే విశాఖ-శంషాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే ఈ నగరాల మధ్య ప్రయాణం మూడు నాలుగు గంటల్లోనే పూర్తవుతుంది... ప్రయాణ సమయం చాలా ఆదా అవుతుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఫాస్టెస్ట్ రైలు ఇదే
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం చాలారైళ్లు నడుస్తున్నాయి... వీటిలో హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ రైలు ఒకటి. ఇది ఇరురాష్ట్రాల మధ్య నడిచే ఫాస్టెస్ట్ ట్రైన్.
వందేభారత్ రైలు గంటకు 180 కి.మీ పైగా వేగంతో దూసుకెళ్లే సామర్థ్యమున్నా కేవలం 130 కి.మీ గరిష్ట వేగంతో నడుపుతోంది ఇండియన్ రైల్వే. ఇక విశాఖ-హైదరాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ 600 కి.మీ పైగా దూరం 8 నుండి 8.30 గంటల్లో ప్రయాణిస్తుంది... అంటే గంటకు 82 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందన్నమాట. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఫాస్టెస్ట్ రైలు ఇదే.
ఇక వందేభారత్ కాకుండా దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు గతిమాన్ ఎక్స్ ప్రెస్. ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ, దేశ రాజధాని న్యూడిల్లీ మధ్య నడుస్తుంది. ఈ రైలు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. తర్వాత బోపాల్ శతాబ్ది, రాజధాని, దురంతో ఎక్స్ ప్రెస్ లు అత్యధిక వేగంతో ప్రయాణిస్తాయి. వీటన్నింటి స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు పైనే ఉంటుంది.