Cyclone Arnab: తెలంగాణలో అర్నబ్ తుపాను ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Cyclone Arnab: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారనుంది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముండగా, బుధవారం కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. బుధవారం వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. తుపాను ప్రయాణ దిశలో మార్పులు చోటుచేసుకుంటే తెలంగాణలో వర్షాల తీవ్రత, ప్రభావిత ప్రాంతాలు కూడా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతంలో తుపాను కదలికలు.. తీరం దాటే ప్రాంతంపై ఉత్కంఠ
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అర్నబ్ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.
బుధవారం ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, తుపాను కదలికలు, మేఘాల విస్తరణను బట్టి దాని దిశలో మార్పులు రావచ్చని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఒకవేళ ప్రయాణ మార్గం మారితే నెల్లూరు నుంచి మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాన్ని కూడా కొందరు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. తీర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాల రూపంలో కనిపించే అవకాశం ఉండటంతో అధికారులు వాతావరణ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు.
జలాశయాల్లో నీటి నిల్వలపై ఆశలు.. రైతులకు ఊరట లభించేనా?
తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అర్నబ్ తుపాను కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, సాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి రాష్ట్రంలోని జలాశయాల్లో 400 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 200 టీఎంసీల నీరే అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే జలాశయాల్లోకి నీరు చేరే అవకాశం ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. అయితే, వర్షాలు కురిసినంత మాత్రాన జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరుతుందని చెప్పలేం. వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, నదులు, వాగుల ప్రవాహం, భూమిలోకి ఇంకే నీటి పరిమాణం వంటి అంశాలపై నీటి చేరిక ఆధారపడి ఉంటుంది. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రతను బట్టి సాగునీటి అవసరాలకు ఎంతవరకు ఉపశమనం లభిస్తుందో స్పష్టత రానుంది.
ఏపీ విద్యుత్ శాఖ అప్రమత్తం.. 6 వేల మంది సిబ్బంది సిద్ధం
అర్నబ్ తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించేందుకు సుమారు 6 వేల మంది అనుభవజ్ఞులైన అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
మంగళవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి.. తుపాను సన్నద్ధత, విద్యుత్ సరఫరా, అత్యవసర సేవల ఏర్పాట్లను సమీక్షించారు. అవసరమైన సిబ్బంది సెలవులను రద్దు చేసి తుపాను ప్రభావిత ప్రాంతాలకు పంపినట్లు వెల్లడించారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ డైరెక్టర్లు స్వయంగా పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగలు, కూలిన స్తంభాలు, దెబ్బతిన్న కండక్టర్ల మరమ్మతులతోపాటు సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద పునరుద్ధరణ పనులకు సిబ్బందిని సిద్ధం చేశారు. అవసరమైన విద్యుత్ పరికరాలు, మరమ్మతు సామగ్రిని డివిజనల్ కార్యాలయాలు, మండల కేంద్రాల్లో ముందుగానే అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్న మంత్రి.. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఒకేసారి 30 వేల కాల్స్ స్వీకరణ..
తుపాను సమయంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా 1912 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒకేసారి 30 వేల కాల్స్‌ను స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, స్తంభాలు కూలినా, తీగలు తెగిపడినా ప్రజలు 1912కు సమాచారం అందించాలని సూచించారు.
సహాయక చర్యలు ఆలస్యం కాకుండా విద్యుత్ శాఖ ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం పెంచింది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, కలెక్టరేట్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో నిరంతరం సమాచార మార్పిడి జరిగేలా ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యకు సంబంధించి ఏ శాఖకు సమాచారం అందినా వెంటనే సంబంధిత సిబ్బందికి చేరేలా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు, తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు విద్యుత్ భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. తెగిపడిన విద్యుత్ తీగలను చేతితో తాకడం, వాటికి సమీపంగా వెళ్లడం ప్రమాదకరం అని తెలిపారు. రహదారులపై పడిన విద్యుత్ స్తంభాలు, ఇతర పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు లేదా 1912 కాల్‌సెంటర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

