- Home
- Telangana
- Bathukamma Celebrations : గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు.. ప్లాన్ ఇదే..: కల్వకుంట్ల కవిత
Bathukamma Celebrations : గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు.. ప్లాన్ ఇదే..: కల్వకుంట్ల కవిత
ఇప్పటికే తెలంగాణ ప్రజల పూలపండగ బతుకమ్మ పలు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. అయితే కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థ మరో గిన్నిస్ రికార్డు సాధించేందుకు సిద్దమవుతోంది.

బతుకమ్మ వేడుకలతో వరల్డ్ రికార్డులు..
Bathukamma Festival : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది ఏకంగా రెండున్నర లక్షల మందితో బతుకమ్మ సంబరాలు నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన పార్టీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ భారీ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు.
2.5 లక్షల మందితో బతుకమ్మ వేడుకలు
వచ్చే ఏడాది (2027లో) రెండున్నర లక్షల మంది పాల్గొనేలా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. ఇందుకోసం తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల్లో బతుకమ్మ, కోలాటం కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ముందస్తు ప్రణాళిక, సమన్వయం అవసరం... అందుకే ఈ ఏడాది నుంచే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు మొదలు పెట్టనున్నట్లు ఆమె వివరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా నిర్వహించబోయే కార్యక్రమం ద్వారా బతుకమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటాలనేది తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
గతంలోనూ బతుకమ్మ వేడుకలకు గిన్నిస్ రికార్డు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు... ఈ క్రమంలోనే గతేడాది రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. 2025 సెప్టెంబర్ 29న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక, పర్యాటక సంస్థలు 63 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటుచేశారు... ఇది అతిపెద్ద బతుకమ్మగా గిన్నిస్ రికార్డు సాధించింది. అదే సందర్భంలో 1,314 మందితో తెలంగాణ జానపద నృత్యానికి సంబంధించిన మరో గిన్నిస్ రికార్డు నమోదైంది. ఇలా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి.
ఈ ఏడాది 33 జిల్లాల్లో బతుకమ్మ సంబరాలు
ఈ ఏడాది కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలతో పాటు విదేశాల్లోనూ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణలోని మహిళలంతా ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, మహిళల భాగస్వామ్యం, జానపద సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో గతంలోనూ తెలంగాణ జాగృతి కార్యక్రమాలు నిర్వహించినట్లు కవిత తెలిపారు.
బతుకమ్మ పాటల సీడీ, పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌తో పాటు తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల సీడీని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. సాంప్రదాయ బతుకమ్మ పాటలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో చప్పట్ల పాటలతో ఈ సీడీని రూపొందించినట్లు ఆమె తెలిపారు. పాత జానపద గీతాలు, బతుకమ్మ పాటలు క్రమంగా మరుగున పడకుండా వాటిని భద్రపరచి కొత్త తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
తెలంగాణ సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు లక్ష్యం
బతుకమ్మ పండుగకు తెలంగాణలో ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది. మహిళలు పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.
ఇప్పటికే బతుకమ్మకు సంబంధించిన గిన్నిస్ రికార్డులు నమోదైన నేపథ్యంలో, వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో నిర్వహించనున్న కార్యక్రమం ద్వారా మరో ప్రపంచ రికార్డును లక్ష్యంగా చేసుకోవాలని తెలంగాణ జాగృతి భావిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామని కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

