MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?
Telangana Graduate MLC Elections: తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త ఓటర్ల నమోదు సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమైంది. గతంలో ఓటరుగా నమోదైన వారైనా లేదా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారైనా తప్పనిసరిగా ఫారమ్-18 ద్వారా అప్లై చేయాలి.

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి: ఓటరుగా ఎలా నమోదుచేసుకోవాలి?
డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నారా లేదా జాబ్ లో సెటిల్ అయ్యారా? అయితే మీకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. తెలంగాణలోని రెండు ప్రధాన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కొత్త ఓటర్ల జాబితా సేకరణను ఎన్నికల కమిషన్ అధికారికంగా స్టార్ట్ చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ తో పాటు వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గ్రాడ్యుయేట్లు వెంటనే తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నమోదు ప్రక్రియకు సంబంధించి ముఖ్యమైన రూల్స్, అర్హతలు, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటరుగా నమోదుకు అర్హతలు ఏంటి?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్‌గా మారాలంటే క్రింది కనీస నిబంధనలు పాటించాలి..
• డిగ్రీ విద్యార్హత: భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదేనీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
• 3 ఏళ్ల గడువు: 2026 నవంబర్ 1ని కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు. అంటే, 2023 నవంబర్ 1 లేదా అంతకంటే ముందే డిగ్రీ పాస్ అయి ఉండాలి.
• స్థానిక నివాసం: దరఖాస్తు చేసే నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసిగా నివసిస్తూ ఉండాలి. అంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మీరు ఉదాహరణకు హైదరాబాద్ లేదా ఖమ్మం పరిధిలో నివాసం ఉండాలి.
• పౌరసత్వం: భారతీయ పౌరుడై ఉండాలి.
పాత ఓటు ఉంటే సరిపోతుందా? మళ్లీ అప్లై చేయాలా?
అవును, కచ్చితంగా మళ్లీ అప్లై చేయాల్సిందే. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ, ప్రతిసారీ కొత్తగా ఫ్రెష్ ఎలక్టోరల్ రోల్ తయారు చేస్తారు. కాబట్టి పాత ఓటర్లు సైతం మళ్లీ Form-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. అలాగే, సాధారణ అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల ఓటరు కార్డు వేరు, ఎమ్మెల్సీ ఓటరు కార్డ్ వేరు. అసెంబ్లీ ఓటు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్సీ ఓటు ఆటోమేటిక్‌గా రాదు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు నమోదుకు కావాల్సిన కీలక పత్రాలు ఇవే
దరఖాస్తు ఫారంతో పాటు క్రింది సర్టిఫికేట్లను జత చేయాల్సి ఉంటుంది..
• డిగ్రీ సర్టిఫికేట్: ఒరిజినల్ ప్రొవిజనల్, కాన్వొకేషన్ లేదా మార్కుల మేమో. దీనిపై గెజిటెడ్ అధికారి లేదా నోటరీ అటెస్టేషన్ తప్పనిసరి.
• అడ్రస్ ప్రూఫ్: ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్.
• ఫోటో: ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
మీరు చాలా సులభంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఓటు కోసం అప్లై చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసే విధానం:
1. తెలంగాణ ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in ఓపెన్ చేయండి.
2. అక్కడ కనిపించే "Council Constituency" / "Form-18" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. మీ పేరు, అడ్రస్, గ్రాడ్యుయేషన్ వివరాలు సరిగ్గా ఫిల్ చేయండి.
4. గెజిటెడ్ సైన్ చేసిన మీ డిగ్రీ కాపీ, ఆధార్, ఫోటోలను స్క్యాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
5. సబ్మిట్ కొట్టిన తర్వాత వచ్చే Acknowledgement ID ని సేవ్ చేసుకోండి.
ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసే విధానం:
తహసీల్దార్ (MRO), ఆర్డీవో (RDO) లేదా ERO/AERO ఆఫీసుల నుంచి ఫారమ్-18 తీసుకుని వివరాలు నింపి, జిరాక్స్ కాపీలు జతచేసి నేరుగా సబ్మిట్ చేయవచ్చు.
లాస్ట్ డేట్ ఎప్పుడు.. ఇంపార్టెంట్ డేట్స్ ఇవే
ఎన్నికల సంఘం ప్రకటించిన అధికారిక టైమ్‌లైన్ ప్రకారం పనులు పూర్తి చేసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
- నోటిఫికేషన్ విడుదల - సెప్టెంబర్ 28, 2026
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - నవంబర్ 6, 2026
- అర్హత గణన తేదీ - నవంబర్ 1, 2026
- ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ - నవంబర్ 25, 2026
- అభ్యంతరాల స్వీకరణ - నవంబర్ 25 – డిసెంబర్ 10, 2026
- తుది ఓటర్ల జాబితా విడుదల - డిసెంబర్ 30, 2026
చివరి తేదీ నవంబర్ 6 వరకు ఆగకుండా వీలైనంత త్వరగా గ్రాడ్యుయేట్లందరూ అప్లై చేసుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

