T20 World Cup 2026: సూపర్ 8లో భారత్, సౌతాఫ్రికాలకు జింబాబ్వే వార్నింగ్ !
Zimbabwe : 2024లో అర్హత సాధించలేకపోయిన జింబాబ్వే, 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించి అజేయంగా సూపర్8కు చేరి భారత్ వంటి జట్లకు సవాల్ విసురుతోంది.

ఫీనిక్స్‌లా లేచిన జింబాబ్వే.. సూపర్ 8లో చెడుగుడు ఆడుకుంటుందా?
ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే జట్టు అద్భుతమైన ఆటతో అదరగొడుతోంది. ఒకప్పుడు ఫ్లవర్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్, అలిస్టర్ క్యాంప్‌బెల్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కళకళలాడిన ఈ జట్టు, గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే, ప్రస్తుత టోర్నీలో సికిందర్ రజా నాయకత్వంలో జింబాబ్వే ఒక ఫీనిక్స్ పక్షిలా పైకి లేచింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్ 8 దశకు చేరుకోవడం ద్వారా భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వంటి జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది.
ఇది కదా కమ్ బ్యాక్ అంటే.. 2024లో జీరో.. 2026లో హీరో.. జింబాబ్వే సంచలన ప్రయాణం
జింబాబ్వే క్రికెట్ చరిత్రలో 2024 ఒక చీకటి అధ్యాయం. ఆ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫైయర్స్‌లో జింబాబ్వే దారుణంగా విఫలమైంది. ఉగాండా వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడంతో, వారు టోర్నీకి అర్హత సాధించలేకపోయారు. ఇది జింబాబ్వే క్రికెట్ అభిమానులకు తీరని వేదన మిగిల్చింది. అయితే, ఆ పరాజయమే వారిలో కసిని పెంచింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత, అదే టోర్నీలో తమ మానసిక స్థైర్యాన్ని నిరూపించుకుంటూ అద్భుతమైన పునరాగమనాన్ని చాటారు.
ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయం
కొలంబోలో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో జింబాబ్వే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడిన జింబాబ్వే, మొదట బ్యాటింగ్ చేసి మందకొడి పిచ్‌పై 169 పరుగులు సాధించింది. యువ ఆటగాడు బ్రయాన్ బెన్నెట్ 64 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచాడు. కెప్టెన్ సికిందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం బౌలింగ్‌లో బ్లెస్సింగ్ ముజరబానీ నిప్పులు చెరిగాడు. ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ వంటి విధ్వంసకర బ్యాటర్లను పెవిలియన్ పంపి ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. ముజరబానీ 4/17 గణాంకాలతో ఆస్ట్రేలియాను 146 పరుగులకే కట్టడి చేశాడు. ఈ 23 పరుగుల విజయం జింబాబ్వేను టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై 100% విజయాల రికార్డు ఉన్న ఏకైక జట్టుగా నిలబెట్టింది.
శ్రీలంక గడ్డపై సింహ గర్జన చేసిన జింబాబ్వే
ఆస్ట్రేలియాపై విజయం కేవలం అదృష్టం కాదని జింబాబ్వే వెంటనే నిరూపించింది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 179 పరుగుల భారీ లక్ష్యాన్ని వారు ఛేదించాల్సి వచ్చింది. బ్రయాన్ బెన్నెట్ మరోసారి 63 పరుగులతో ఆకట్టుకోగా, సికిందర్ రజా కేవలం 26 బంతుల్లో 45 పరుగులు చేసి శ్రీలంక స్పిన్నర్లను చిత్తు చేశాడు. చివరి నిమిషంలో టోనీ మున్యోంగా సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి, ఆరు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో 2026 టోర్నీలో గ్రూప్ దశలో ఓటమి ఎరుగని నాలుగు జట్లలో ఒకటిగా జింబాబ్వే రికార్డు సృష్టించింది.
సూపర్8లో భారత్, ప్రోటీస్‌లకు జింబాబ్వే సవాల్
ఇప్పుడు అందరి చూపు సూపర్-8 దశపైనే ఉంది. భారత్, సౌతాఫ్రికా. వెస్టిండీస్ ఉన్న కఠినమైన గ్రూప్‌లో జింబాబ్వే చేరింది. కాగితంపై ఈ జట్లు బలంగా ఉన్నప్పటికీ, జింబాబ్వే ఫామ్ చూస్తుంటే ఎవరినైనా ఓడించే సత్తా వారికి ఉందని అర్థమవుతోంది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, తమకున్న మొమెంటంతో పెద్ద జట్ల సెమీస్ ఆశలపై నీళ్లు చల్లడానికి జింబాబ్వే సిద్ధంగా ఉందని చెప్పవచ్చు.

