Hulk Hogan: WWE లెజెండ్ హల్క్ హోగన్ మృతి
Hulk Hogan: రెజ్లింగ్ స్టార్, WWE కింగ్ హల్క్ హోగన్ గుండెపోటుతో మృతి చెందారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ హల్క్ హోగన్ కన్నుమూత
అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ (టెర్రీ జీన్ బోలియా) గురువారం (జూలై 24) ఫ్లోరిడాలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. రెస్క్యూ సిబ్బంది వెంటనే క్లియర్వాటర్ (ఫ్లోరిడా) లోని ఆయన ఇంటికి చేరి, హోగన్‌ను స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడే మృతి చెందినట్టు స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి.
హల్క్ హోగన్ మృతిపై WWE అధికారిక ప్రకటన
WWE తన సోషల్ మీడియా వేదికగా హల్క్ హోగన్ మరణాన్ని ధ్రువీకరించింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. హల్క్ హోగన్ మరణంతో ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రపంచం ఒక మహా స్టార్‌ను కోల్పోయింది.
రెజ్లింగ్‌లో 'హల్కమానియా'
1953, ఆగస్టు 11న జార్జియా రాష్ట్రంలోని ఆగస్టాలో జన్మించిన హల్క్ హోగన్.. 1980వ దశకంలో WWF (ఇప్పుడు WWE) ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఆయన ప్రత్యేక మీసాలు, భారీ శరీరం, ఆకట్టుకునే తీరు. డబ్ల్యూడబ్ల్యూఈ లో అద్భుతమైన ప్రదర్శనలతో పిల్లలు, పెద్దల హృదయాలను గెలిచారు. “Train, say your prayers, eat your vitamins, and believe in yourself” అనే నినాదంతో లక్షలాది అభిమానులను గెలుచుకున్నారు.
డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో నిలిచిపోయే హల్క్ హోగన్
1984లో ఐరెన్ షేక్ ను మాదిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఓడించి తన మొదటి WWF ఛాంపియన్‌షిప్ గెలిచారు. ఇదే 'హల్కమానియా' అనే సంచలన ప్రారంభానికి నాంది పలికింది. రెజ్లింగ్ మానియా మొదటి ఎనిమిదిలో అద్భుత ప్రదర్శనలు చేశాడు. WrestleMania III లో 93,173 మందికిపైగా వీక్షకుల ముందు ఆండ్రే ది జెయింట్‌ను బాడీ స్లామ్ చేసిన క్షణాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
WCW లో హల్క్ హోగన్
1994లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ను వదిలి వర్డ్ ఛాంపియన్ రెజ్లింగ్ లో చేరడం హల్క్ హోగన్ కెరీర్‌లో మరో కీలక మలుపు తిరిగింది. మొదట కథానాయకుడిగా ఉన్న హోగన్, 1996లో ప్రత్యర్థిగా మారి స్కాట్ హాల్, కెవిన్ నాష్ లతో కలిసి న్యూ వరల్డ్ ఆర్డర్ (nWo) ను ప్రారంభించారు. ఈ క్యారెక్టర్ చేంజ్‌కి ప్రేక్షకుల స్పందన విశేషంగా ఉండటంతో డబ్ల్యూసీడబ్ల్యూ తక్కువ కాలంలో డబ్ల్యూడబ్ల్యూఈ కంటే ఎక్కువ రేటింగ్స్ సాధించింది.
హాలీవుడ్, టీవీ, రాజకీయాల్లో హల్క్ హోగన్ మానియా
ప్రొఫెషనల్ రెజ్లింగ్‌తో పాటు హల్క్ హోగన్ సినిమాలు, టీవీ షోలు, రియాలిటీ షోల్లో కూడా పాపులర్ అయ్యారు. 1982లో రాకీ 3, థండర్ లిప్స్ పాత్రలో కనిపించారు. తర్వాత No Holds Barred, Suburban Commando, Mr. Nanny వంటి సినిమాల్లో నటించారు. VH1 రియాలిటీ షో తో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
2024లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో హోగన్ ఆకస్మికంగా వచ్చి వేదికను కదిలించారు. ఇది ఆయన చివరిసారిగా బహిరంగంగా కనిపించిన సంఘటనల్లో ఒకటి. 2005లో WWE హాల్ ఆఫ్ ఫేం లో చేరిన హోగన్, 2015లో ఒక రహస్యంగా రికార్డ్ అయిన వీడియోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంతో తొలగించారు. ఆ తర్వాత విచారణలు పూర్తితో రెండవసారి హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేరారు.

