- Home
- Business
- ITR Filing 2025: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు.. పెనాల్టీ, బెనిఫిట్స్ ఇవే
ITR Filing 2025: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు.. పెనాల్టీ, బెనిఫిట్స్ ఇవే
ITR Filing 2025: 2024-25 ఐటీఆర్ ఫైలింగ్ గడువును ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఆలస్యం చేస్తే భారీ జరిమానా తప్పదు. బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.

ఐటీఆర్ ఫైలింగ్ గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు
2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2025-26) చెందిన ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలుకు గడువును పెంచారు. కేంద్ర ప్రత్యక్ష పన్నులు మండలి (CBDT) సెప్టెంబర్ 15, 2025 వరకు ఐటీఆర్ గడుపును పొడిగిస్తూ అధికారికంగా ప్రకటించింది.
ఇది సాధారణంగా ఆడిట్ అవసరం లేని వేతనజీవులు, ఉద్యోగులు, స్వతంత్ర వృత్తిదారులు వంటి వ్యక్తులకు వర్తిస్తుంది. మునుపటి గడువు జూలై 31, 2025గా ఉండగా, తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనంగా కలిగిస్తుంది. ఇది పత్రాలను సేకరించి ఖచ్చితంగా దాఖలు చేయడానికి వారికి తగినంత ఎక్కువ సమయం ఇస్తుంది.
ఐటీఆర్ గడువు మించితే జరిమానాలు తప్పవు
కొత్తగా పొడిగించిన గడువులోగా ఐటీఆర్ (ITR) దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 తర్వాత ఐటీఆర్ సమర్పించినవారిలో ఏడాది ఆదాయం రూ.5 లక్షలకుపైగా ఉంటే రూ.5,000 జరిమానా విధించనున్నారు.
అలాగే, రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం రూ. 1,000 జరిమానా విధిస్తారు. ఆలస్యం అయిన లేదా సవరణలతో కూడిన రిటర్న్‌లను డిసెంబర్ 31, 2025 వరకు దాఖలు చేసుకోవచ్చు. అవసరమైతే మార్చి 31, 2030 వరకు రివైజ్డ్ రిటర్న్ కూడా సమర్పించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జూలై 31లోపు పన్ను చెల్లింపులు పూర్తి చేయాలి
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించినా, సొంతంగా లెక్కించిన పన్ను బాకీ మొత్తాన్ని జూలై 31, 2025లోగా చెల్లించడం తప్పనిసరి. లేట్ చెల్లింపుపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234A ప్రకారం వడ్డీ విధిస్తారు.
కాబట్టి, అదనపు ఖర్చులను నివారించాలంటే, పన్ను బాకీలను సమయానికి చెల్లించాలి. గడువు పొడిగింపు కేవలం ఐటీఆర్ సమర్పించడానికి మాత్రమే వర్తిస్తుంది. పన్ను చెల్లింపులకు కాదని అధికారులు స్పష్టం చేశారు.
ఐటీఆర్ కొత్త ఫారాల విడుదలలో ఆలస్యం
కొత్త ఆదాయపు పన్ను ఫారమ్‌ల విడుదలలో జాప్యం, అధికారిక పోర్టల్‌లో ఇ-ఫైలింగ్ ఎంపికల లభ్యత వంటి విషయాల ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడిదారులకు ముఖ్యమైన ఫారం 26AS, AIS (Annual Information Statement) లో ఉన్న టీడీఎస్ (TDS) వివరాలు ఆలస్యం కావడం వల్ల పన్ను వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం కష్టమైంది.
ITR-1, ITR-4లకు సంబంధించిన కొత్త డిజిటల్ అప్లికేషన్ లేటుగా విడుదల కావడం కూడా ఇబ్బందిని కలిగించింది. ఈ సాంకేతిక సమస్యలు పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపడంతో CBDT ఈ తాజా పొడిగింపును ప్రకటించింది.
వడ్డీతో రీఫండ్ పొందే అవకాశం.. ఐటీఆర్ పొడిగింపుతో అదనపు ప్రయోజనం
సెక్షన్ 244A ప్రకారం, పన్ను తిరిగి పొందే వారికి గరిష్ఠంగా 33 శాతం వరకూ వడ్డీ లభించే అవకాశం ఉంది. ఇది ఏప్రిల్ 1 నుంచి లెక్కించనున్నారు. అయితే ఈ వడ్డీ ఆదాయంగా పరిగణిస్తారు. అంటే ఐటీఆర్ (ITR) లో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది.
అలాగే, సీబీడీటీ (CBDT) తాజాగా Excel ఆధారిత ఆఫ్లైన్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఇది పన్ను చెల్లింపుదారులు JSON ఫార్మాట్‌లో ఐటీఆర్ రూపొందించి, ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు అప్‌లోడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది ITR-1, ITR-4 కోసం వర్తిస్తుంది. ఇది సాధారణ వేతనజీవులకు ఉపయుక్తంగా ఉంటుంది.
మొత్తంగా సీబీడీటీ తీసుకున్న తాజా నిర్ణయం పన్ను చెల్లింపుదారులకు మరింత సౌలభ్యం కలిగించడంతోపాటు సమయానికి పన్ను ఫైలింగ్ ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జాగ్రత్తగా ఫైలింగ్ చేయడం ద్వారా జరిమానాలు, వడ్డీలు తప్పించుకోవచ్చు. అలాగే, వడ్డీతో రీఫండ్ పొందే అవకాశం కూడా లభించనుంది.