RCB : ఆర్సీబీ మాస్ బ్యాటింగ్.. యూపీ బౌలర్లకు చుక్కలే ! గ్రేస్ హారిస్ సునామీ ఇన్నింగ్స్
RCB : డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రేస్ హారిస్ (85) మెరుపు ఇన్నింగ్స్‌తో యూపీ వారియర్స్‌పై 9 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టు ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది.

RCB vs UPW: సిక్సర్ల వర్షం కురిపించిన గ్రేస్ హారిస్.. 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) ఐదవ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ దుమ్మురేపే ప్రదర్శనతో విజయం సాధించింది.
బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఆర్సీబీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 9 వికెట్ల తేడాతో యూపీని చిత్తు చేసింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ గ్రేస్ హారిస్ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
Dominant! ❤️@RCBTweets go 🔝 of the #TATAWPL 2026 points table with a clinical 9⃣-wicket victory 👏
Scorecard ▶️ https://t.co/U1cgf01ys0#KhelEmotionKa | #RCBvUPWpic.twitter.com/kjOFG7pjiJ— Women's Premier League (WPL) (@wplt20) January 12, 2026
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మంధాన
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్ ఆరంభం నుంచే యూపీ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా ఇంగ్లీష్ పేసర్ లారెన్ బెల్ తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టింది.
దీంతో యూపీ వారియర్స్ జట్టు పేకమేడలా కూలిపోయింది. కేవలం 50 పరుగుల స్కోరుకే యూపీ తన సగం మంది బ్యాటర్లను కోల్పోయింది. హర్లీన్ డియోల్ (11), మెగ్ లానింగ్ (14), ఫోబీ లిచ్‌ఫీల్డ్ (20) వంటి కీలక వికెట్లు త్వరగానే పడిపోయాయి. ఆర్సీబీ బౌలర్ల ధాటికి యూపీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
పాటిల్, డి క్లార్క్ మ్యాజిక్ స్పెల్
యూపీ ఇన్నింగ్స్‌ను దెబ్బతీయడంలో ఆర్సీబీ బౌలర్లు డి క్లార్క్, శ్రేయాంక పాటిల్ కీలక పాత్ర పోషించారు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి డి క్లార్క్ యూపీ నడ్డి విరిచింది. ఎనిమిదవ ఓవర్‌లో ఆమె మెగ్ లానింగ్, ఫోబీ లిచ్‌ఫీల్డ్‌లను అవుట్ చేసింది.
ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన శ్రేయాంక పాటిల్ కూడా ఒకే ఓవర్‌లో కిరణ్ నవగిరే, శ్వేతా సెహ్రావత్‌లను అవుట్ చేసి యూపీని మరింత కష్టాల్లోకి నెట్టింది. లారెన్ బెల్ 1 వికెట్ తీయగా, డి క్లార్క్, శ్రేయాంక చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఆదుకున్న దీప్తి శర్మ, డాటిన్
50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న యూపీని దీప్తి శర్మ, డియేండ్రా డాటిన్ ఆదుకున్నారు. వీరిద్దరూ సంయమనంతో ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరి మధ్య 93 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొంది.
దీప్తి శర్మ 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 45 పరుగులు చేయగా, డాటిన్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. వీరి పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో యూపీ వారియర్స్ 5 వికెట్ల నష్టానికి 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది.
గ్రేస్ హారిస్ విధ్వంసం.. పరుగుల వరద
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా గ్రేస్ హారిస్ మైదానంలో పరుగుల వరద పారించింది. యూపీ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. హారిస్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 85 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది.
మరో ఎండ్‌లో కెప్టెన్ స్మృతి మంధాన కూడా చక్కటి సహకారం అందించింది. మంధాన 32 బంతుల్లో 9 ఫోర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. పవర్‌ప్లేలోనే ఈ జోడి 78 పరుగులు జోడించింది. హారిస్ 85 పరుగుల వద్ద అవుటైనప్పటికీ, అప్పటికే ఆర్సీబీ విజయం ఖాయమైంది.
A blistering knock from Grace Harris makes her tonight's Player of the Match 😎
Scorecard ▶️ https://t.co/U1cgf01ys0#TATAWPL | #KhelEmotionKa | #RCBvUPWpic.twitter.com/Bdvs3xb6pQ— Women's Premier League (WPL) (@wplt20) January 12, 2026
పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఆర్సీబీ
ఆర్సీబీ కేవలం 12.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 145 పరుగులు చేసి విజయాన్ని అందుకొంది. హారిస్ అవుటైన తర్వాత వచ్చిన రిచా ఘోష్ (4) నాటౌట్‌గా నిలిచింది. ఈ విజయంతో డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు యూపీ వారియర్స్ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.
