- Home
- Sports
- Sophie Shine : రోహిత్ శర్మ నిద్ర చెడగొట్టిన ఆ అమ్మాయి ఈమేనా? ధావన్ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!
Sophie Shine : రోహిత్ శర్మ నిద్ర చెడగొట్టిన ఆ అమ్మాయి ఈమేనా? ధావన్ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!
Who is Sophie Shine : టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఐరిష్ యువతి సోఫీ షైన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. సోషల్ మీడియాలో గబ్బర్ ఫొటోలు షేర్ చేశారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం. మరి సోఫీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

Who is Sophie Shine : శిఖర్ ధావన్ రెండో పెళ్లికి రెడీ... ఎవరీ సోఫీ షైన్? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే !
టీమిండియా మాజీ ఓపెనర్, గబ్బర్ శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. సోఫీ షైన్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సోమవారం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఉంగరాలు మార్చుకున్న ఫొటోను షేర్ చేశారు.
మొదటి భార్య ఆయేషా ముఖర్జీతో విడాకుల తర్వాత, ధావన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎంగేజ్‌మెంట్ ప్రకటనతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ సోఫీ షైన్? వీరి ప్రేమ కథ ఎలా మొదలైంది? పెళ్లి ఎప్పుడు? అనే పూర్తి వివరాలు ఆసక్తిని పెంచాయి.
సోఫీ షైన్ ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన ఒక ఉన్నత స్థాయి ప్రొఫెషనల్. ప్రస్తుతం ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబిలో నివసిస్తున్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఆమెకు మంచి అనుభవం ఉంది. ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సోఫీ ప్రస్తుతం ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ 'నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్'లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్ - ప్రోడక్ట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
వృత్తిపరంగా ఆమె ఫైనాన్షియల్ ఉత్పత్తులు, క్లయింట్ సొల్యూషన్స్, స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తుంటారు. సోఫీ విద్యాభ్యాసం అంతా ఐర్లాండ్‌లోనే సాగింది. ఆమె కాజిల్ రాయ్ కాలేజీలో తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత లిమరిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్లు.
దుబాయ్‌లో చిగురించిన శిఖర్ ధావన్, సోఫీ షైన్ ప్రేమ
రిపోర్టుల ప్రకారం, సోఫీ షైన్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. శిఖర్ ధావన్, సోఫీ మొదటిసారి అక్కడే కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారి, ఆ తర్వాత అది ప్రేమకు దారితీసింది. గత ఏడాది మే 1న, సోఫీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధావన్‌తో ఉన్న ఒక ఫొటోను షేర్ చేసి, My love అంటూ హార్ట్ ఎమోజీని జత చేశారు. దీంతో వీరిద్దరి రిలేషన్షిప్ గురించి అధికారికంగా క్లారిటీ వచ్చింది.
అప్పటి నుంచి సోఫీ తరచుగా ధావన్ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. ధావన్ పోస్ట్ చేసే ఫన్నీ రీల్స్, వీడియోలలో ఆమె సందడి చేయడం కనిపిస్తూనే ఉంది. అంతేకాకుండా, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ధావన్ ఆడుతున్నప్పుడు, ఆమె స్టేడియానికి వచ్చి టీమ్‌ను సపోర్ట్ చేస్తూ కనిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా ఆమె ధావన్ వెంట ఉన్నారు.
శిఖర్ ధావన్, సోఫీ షైన్ నిశ్చితార్థం, పెళ్లి వివరాలు
జనవరి 12న తన నిశ్చితార్థాన్ని ప్రకటిస్తూ శిఖర్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "చిరునవ్వుల నుంచి కలల దాకా.. మా ప్రేమకు, ఈ కొత్త ప్రయాణానికి మీ ఆశీస్సులు కావాలి. మేము ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం" అని ధావన్ రాసుకొచ్చారు.
మీడియా కథనాల ప్రకారం, శిఖర్ ధావన్, సోఫీ షైన్ వివాహం ఫిబ్రవరి రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ వేడుక ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి క్రికెట్, బాలీవుడ్ తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే పెళ్లి తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
రోహిత్ భాయ్.. ఆ ఇంగ్లీష్ అమ్మాయి !
శిఖర్ ధావన్ తన ఆత్మకథ 'ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్'లో తన పాత ప్రేమకథల గురించి కూడా ప్రస్తావించారు. ఇండియా-ఏ తరఫున ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు, తాను ఒక ఇంగ్లీష్ అమ్మాయితో ప్రేమలో పడ్డానని తెలిపారు.
"ఆమె చాలా అందంగా ఉండేది. నేను మళ్ళీ ప్రేమలో పడ్డాను అనిపించింది. ఆమెను కలవడానికి నేను ఆమెను రహస్యంగా నా హోటల్ గదికి తీసుకువచ్చేవాడిని. అప్పుడు నేను రోహిత్ శర్మతో రూమ్ షేర్ చేసుకునేవాడిని. నా వల్ల నిద్రపోలేకపోతున్నానని రోహిత్ హిందీలో సరదాగా కంప్లైంట్ చేసేవాడు" అని ధావన్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. అయితే, ఇప్పుడు ఐరిష్ అమ్మాయి సోఫీ షైన్‌తో ధావన్ ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు.
