Koneru Humpy: ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025.. కోనేరు హంపీ ఎందుకు ఓడిపోయారు?
Koneru Humpy: టైబ్రేక్‌లో కోనేరు హంపీని ఓడించి దివ్య దేశ్‌ముఖ్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే, తెలుగు ప్లేయర్ కోనేరు హంపీ ఓటమికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ లో ఇద్దరు భారత ప్లేయర్లు
జార్జియాలోని బటుమి నగరంలో జరిగిన ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్ కు చెందిన ఇద్దరు ప్లేయర్లు తలపడ్డారు. అయితే ఈ పోరులో తెలుగు ప్లేయర్, 38 ఏళ్ల కోనేరు హంపీ 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ చేతిలో టైబ్రేక్‌లో ఓడిపోయారు. ఫైనల్ క్లాసికల్ గేమ్స్ రెండు డ్రా కావడంతో మ్యాచ్ రాపిడ్ టైబ్రేక్‌కి వెళ్లింది. అదే స్థానంలో హంపీ పోరాటంలో వెనుకబడి పోయారు.
కోనేరు హంపీ ఎందుకు ఓడిపోయారు?
రెండవ రాపిడ్ గేమ్ ప్రారంభం నుంచే హంపీ టైమ్ ఒత్తిడిలోకి వెళ్లారు. ఆమె చేతిలో కేవలం 7 నిమిషాలు మాత్రమే మిగిలి ఉండగా, దివ్య దగ్గర 14 నిమిషాల సమయం ఉండటంతో హంపీ నిర్ణయాల్లో స్పష్టత కోల్పోయారు. ఈ ఒత్తిడేలోనే హంపీ ఈజీగానే తప్పులు చేసింది.
ఆర్‌ఎక్స్‌ఎఫ్4.. గేమ్ మారింది ఇక్కడే
54వ మూవ్ వద్ద హంపీ చేసిన Rxf4 అనే రూక్ మార్పిడి ఆమె గేమ్‌కు మలుపు తెచ్చింది. దివ్య ఈ తప్పును వెంటనే ఉపయోగించుకొని ఏ-ఫైల్ పాన్‌ను ప్రోగ్రెస్ చేసి గేమ్‌ను మార్చేశారు. ఈ ఒక్క తప్పిదం ఆమె గేమ్‌ను పూర్తిగా చేజారేలా చేసింది. హంపీ అనుభవం ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్‌లో ఎండ్‌గేమ్ ప్రణాళిక లోపించింది.
మార్పుల మధ్య గందరగోళంలో హంపీ
రాపిడ్ టైబ్రేక్ రెండో గేమ్‌లో బిషప్, క్వీన్, రూక్ మార్పులు చోటుచేసుకున్నా.. హంపీ వాటిని ఎఫెక్టివ్‌గా వాడలేకపోయారు. ముఖ్యంగా క్వీన్ మార్పుల విషయంలో తడబడ్డారు. ఇది దివ్యకు గేమ్ పేస్‌ను తన చుట్టూ ఆడించుకునే అవకాశం ఇచ్చింది. దివ్య స్పీడ్‌కు తగ్గట్టుగా హంపీ స్పందించలేకపోయారు.
టైమింగ్ సమస్యలు కోనేరు హంపీని ఓడించాయి
38 ఏళ్ల కోనేరు హంపీ వందలాది అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం ఉంది. కానీ, ఆత్మస్థైర్యం, ఓర్పు, ప్లానింగ్ పరంగా దివ్య మెరుగ్గా నిలిచింది. హంపీ గేమ్ తర్వాత "నాకు టైమింగ్ సమస్యలు ఎదురయ్యాయి" అని ఒప్పుకోవడమే దీనికి నిదర్శనం. దివ్య మాత్రం ప్రతి చిన్న అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకుంది.
చెస్ విశ్లేషకుడు ఆర్జే నారాయణ్ మాట్లాడుతూ.. హంపీ టైమ్ మేనేజ్‌మెంట్ లో విఫలమయ్యారు. రెపిడ్ ఫార్మాట్‌లో ఆమెలో స్పష్టత కనిపించలేదన్నారు. ఇదే ఆమె ఓటమికి కారణంగా ఉందని తెలిపారు. భారత మాజీ ప్లేయర్ మితాలీ మిశ్రా మాట్లాడుతూ దివ్య చాలా కూల్‌గా ఆడింది. లభించిన ప్రతి అవకాశం వదలకుండా ఉపయోగించుకుని గేమ్ ను తనవైపు పూర్తిగా లాగేసుకున్నారు.
కాగా, ఈ విజయంతో దివ్య దేశ్‌ముఖ్ భారతదేశానికి నాల్గవ మహిళా గ్రాండ్ మాస్టర్ గా స్థానం సంపాదించారు. అంతకుముందు, కోనేరు హంపీ, ద్రోణవల్లి హరికా, ఆర్ వైశాలిలు గ్రాండ్ మాస్టర్ హోదాలు పొందారు. 19 ఏళ్ల వయసులో దివ్య ఈ విజయంతో చరిత్ర సృష్టించారు.