Shaheen Afridi : బీబీఎల్ అరంగేట్రంలో పాక్ బౌలర్‌కు ఘోర అవమానం.. మధ్యలోనే పంపించేశారు !
Shaheen Afridi : బిగ్ బాష్ లీగ్ అరంగేట్రంలోనే పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రమాదకరమైన బౌలింగ్ కారణంగా అంపైర్లు అతన్ని మధ్యలోనే బౌలింగ్ వేయకుండా నిషేధించారు.

షాహీన్ అఫ్రిదీకి ఘోర అవమానం: బీబీఎల్ అరంగేట్రంలోనే బౌలింగ్ నిషేధం.. అసలేం జరిగిందంటే?
పాకిస్థాన్ స్టార్ పేసర్, మాజీ టీ20 కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదికి ఆస్ట్రేలియా గడ్డపై చేదు అనుభవం ఎదురైంది. బిగ్ బాష్ లీగ్ (BBL) 2025-26 సీజన్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరపున అరంగేట్రం చేసిన షాహీన్, తన తొలి మ్యాచ్‌లోనే ఘోర అవమానాన్ని చవిచూడాల్సి వచ్చింది. సోమవారం గీలాంగ్ లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రమాదకరమైన బౌలింగ్ కారణంగా అంపైర్లు అతన్ని బౌలింగ్ వేయకుండా నిషేధించారు.
భారీ అంచనాల మధ్య సుమారు రూ. 2.39 కోట్లకు (4,20,000 ఆస్ట్రేలియన్ డాలర్లు) బ్రిస్బేన్ హీట్ జట్టుకు ఎంపికైన షాహీన్, మైదానంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కేవలం 2.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఈ పాక్ పేసర్, ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీయకపోగా, రెండు ప్రమాదకరమైన బీమర్లు వేసి మ్యాచ్ మధ్యలోనే బౌలింగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
బీమర్ల కలకలం.. అంపైర్ల సీరియస్ యాక్షన్
బ్రిస్బేన్ హీట్ ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత, మెల్బోర్న్ రెనెగేడ్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో అసలు కథ మొదలైంది. షాహీన్ అఫ్రిదీ వేసిన ఈ ఓవర్‌లో రెండు నడుము ఎత్తుకు మించి వచ్చిన ఫుల్ టాస్ బంతులు సంధించాడు.
మొదట రెనెగేడ్స్ సెంచరీ హీరో టిమ్ సీఫెర్ట్‌కు ఒక బీమర్ వేయగా, ఆ వెంటనే హాఫ్ సెంచరీ సాధించిన ఆలివర్ పీక్‌కు మరో బీమర్ విసిరాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది ప్రమాదకరమైన బౌలింగ్ కావడంతో అంపైర్లు వెంటనే స్పందించారు.
ఆ ఓవర్‌ను పూర్తి చేయకుండానే షాహీన్‌ను బౌలింగ్ అటాక్ నుంచి తొలగించారు. దీంతో బ్రిస్బేన్ హీట్ కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ మిగిలిన బంతులను వేసి ఓవర్‌ను పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ ఓవర్‌లో మొత్తం 22 పరుగులు వచ్చాయి, ఇది జట్టుకు చాలా ఇబ్బందికరంగా మారింది. అంపైర్ల దెబ్బతో అఫ్రిది అవాక్కయ్యాడు.
Wow.
On his BBL debut, Shaheen Afridi has been removed from the attack! #BBL15pic.twitter.com/IhDLsKFfJi— KFC Big Bash League (@BBL) December 15, 2025
ధారాళంగా పరుగుల సమర్పించుకున్న షాహీన్ అఫ్రిది
షాహీన్ అఫ్రిది తన స్పెల్‌ను మంచి డాట్ బాల్స్‌తో ప్రారంభించినప్పటికీ, తర్వాత లయ తప్పాడు. తన మొదటి ఓవర్‌లో 9 పరుగులు ఇచ్చిన షాహీన్, పవర్ సర్జ్ సమయంలో వేసిన 13వ ఓవర్‌లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. చివరగా 18వ ఓవర్‌లో జరిగిన బీమర్ల తో 15 పరుగులు (మూడు నో బాల్స్‌తో కలిపి) ఇచ్చాడు.
మొత్తంగా 2.4 ఓవర్లలో మూడు నో బాల్స్, రెండు వైడ్లతో సహా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. షాహీన్ వంటి స్టార్ బౌలర్ ఇలా ఆడటం అభిమానులను నిరాశపరిచింది.
ఎంసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఎంసీసీ చట్టం 41.7 ప్రకారం, బ్యాటర్ నడుము ఎత్తు కంటే ఎక్కువగా వచ్చే నాన్-పిచింగ్ డెలివరీలను అన్యాయమైనవిగా పరిగణిస్తారు. బౌలర్ ఎండ్ అంపైర్ బ్యాటర్‌కు గాయమయ్యే ప్రమాదం ఉందని భావిస్తే, దాన్ని ప్రమాదకరమైన బౌలింగ్‌గా ప్రకటిస్తారు. ఒకే ఇన్నింగ్స్‌లో బౌలర్ ఇలాంటి ప్రమాదకరమైన బంతులను మళ్లీ మళ్లీ వేస్తే, అంపైర్ అతన్ని ఆ ఇన్నింగ్స్ మొత్తం బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేస్తారు. షాహీన్ విషయంలో అదే జరిగింది.
పాక్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిదీ మాత్రమే కాదు, అతని సహచరుడు మహమ్మద్ రిజ్వాన్ కూడా విఫలమయ్యాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున అరంగేట్రం చేసిన రిజ్వాన్, కేవలం 4 పరుగులు (10 బంతుల్లో) చేసి ప్యాట్రిక్ డూలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
అంతకుముందు రోజు సిడ్నీ సిక్సర్స్ తరపున అరంగేట్రం చేసిన మాజీ కెప్టెన్ బాబర్ ఆజం కూడా పెర్త్ స్కార్చర్స్‌పై కేవలం 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బీబీఎల్ 2025-26 సీజన్ పాకిస్థాన్ క్రికెటర్లకు ఏమాత్రం కలిసిరావడం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
షాహీన్ వైఫల్యం.. మ్యాచ్ ఫలితం ఏంటి?
షాహీన్ అఫ్రిది వైఫల్యంతో మెల్బోర్న్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 56 బంతుల్లో 102 పరుగులు చేసి ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేయగా, ఆలివర్ పీక్ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. షాహీన్ అఫ్రిదీ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 239 మ్యాచ్‌లలో 334 వికెట్లు తీసినా, ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు.

