టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లాదేశ్ ఔట్... ఆ స్థానంలో ఆడే దేశం ఇదేనా..?
ICC Men's T20 World Cup : భారత్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ ను బహిష్కరిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ టీం ప్రకటించింది. ఈ క్రమంలో ఆ స్థానంలో ఏ దేశం ఆడుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఐసిసి టీ20 వరల్డ్ కప్ ను బహిష్కరించిన బంగ్లా
ICC Men's T20 World Cup : స్వదేశంలో జరిగే ఐసిసి మెగా టోర్నీ టీ20 వరల్డ్ కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల ప్రభావం ఈ వరల్డ్ కప్ పై పడింది. భారత్ లో జరిగే ఈ ఐసిసి టోర్నీని బహిష్కరిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.
టీ20 వరల్డ్ కప్ పై బంగ్లాదేశ్ ప్రకటన
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమ ఆటగాళ్లే భారతదేశంలో పర్యటించడం సేఫ్ కాదని బంగ్లాందేశ్ క్రికెట్ బోర్డు, ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పాకిస్థాన్ మాదిరిగానే తమ జట్టు ఆడే మ్యాచులన్ని శ్రీలంకకు తరలించాలని ఐసిసిని కోరింది బంగ్లా బోర్డు. కానీ ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ ఇండియాలోనే మ్యాచులు ఆడాలని ఐసిసి తేల్చిచెప్పింది. దీంతో చేసేదేమీలేక ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీనే బహిష్కరిస్తున్నట్లు బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ ప్రకటించారు.
బంగ్లాదేశ్ స్థానంలో ఆడే జట్టు ఇదేనా..?
ఐసిసి టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో మరో దేశానికి అవకాశం దక్కనుంది. అయితే ఏ దేశం ఐసిసి టోర్నీలోకి ఎంట్రీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. క్రీడా నిపుణుల అంచనా ప్రకారం స్కాట్లాండ్ కు అవకాశం దక్కవచ్చని అంటున్నారు.
అయితే ఇప్పటివరకు భారత్ లో ఆడబోమని మాత్రమే బంగ్లాదేశ్ తెలిపింది... ఇందుకు ఐసిసి అంగీకరించకపోవడంతో టోర్నీనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లా బోర్డుకు తమ నిర్ణయంపై చర్చించి పునరాలోచించేందుకు అవకాశం ఇస్తారా..? లేక మరేదైనా దేశాన్ని ఆడించేందుకు చర్యలు తీసుకుంటారా..? అన్నది తేలాల్సి ఉంది. ఐసిసి బంగ్లాను పక్కనబెడితే మాత్రం స్కాట్లాండ్ కు అవకాశం వస్తుంది.
ఐసిసి టీ20 వరల్డ్ కప్ ఆడే జట్లు ఇవే...
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో మొత్తం 20 జట్లు ఆడతాయి. మొత్తం నాలుగు గ్రూప్స్ గా ఈ టీమ్స్ ని విభజించారు.
టీమ్ A :
ఇండియా
నమీబియా
నెదర్లాండ్
పాకిస్థాన్
యూఎస్ఏ
టీమ్ B :
ఆస్ట్రేలియా
ఐర్లాండ్
ఒమన్
శ్రీలంక
జింబాబ్వే
టీమ్ C :
ఇందులోనే బంగ్లాదేశ్ ఉంది. ఇప్పుడు దీని స్థానంలో ఏ జట్టు ఆడుతుందో ఐసిసి త్వరలోనే నిర్ణయించనుంది.
ఇంగ్లాండ్
ఇటలీ
నేపాల్
వెస్టిండిస్
టీమ్ D :
ఆప్ఘానిస్తాన్
కెనడా
న్యూజిల్యాండ్
సౌతాఫ్రికా
యూఏఈ
ముస్తాఫిజుర్ తొలగింపుతో మొదలైన వివాదం...
భారత్-బంగ్లాదేశ్ మధ్య చాలాకాలంగా దౌత్యపరమైన వివాదం సాగుతోంది. కానీ క్రీడాపరంగా అంతా సాఫీగా సాగిపోయింది. అయితే ఇటీవల బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ వ్యవహారంతో దుమారం రేపింది. తాజాగా జరిగిన ఐపిఎల్ వేలంలో ముస్తాఫిజుర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ అతడి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడించకూడదని బిసిసిఐ నిర్ణయించింది... బోర్డు ఆదేశాలతో కెకెఆర్ అతడిని వదులుకుంది. అప్పటినుండి ఇండియా, బంగ్లాదేశ్ మధ్య క్రీడాపరమైన వివాదం రాజుకుంది... ఇది తాజాగా ఐసిసి టీ20 వరల్డ్ కప్ ను బహిష్కరించే స్థాయికి చేరింది.

