T20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ దిగజారారు. ఇదే సమయంలో టాప్ 3లోకి ఇద్దరు భారతీయ ఆటగాళ్ళు దూసుకెళ్లారు.
T20 Rankings : భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ T20 ర్యాంకింగ్స్‌లో టాప్ 5 నుంచి దిగజారాడు. అయితే టాప్ 3లో మాత్రం ఇద్దరు భారతీయ ఆటగాళ్ళు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉండగా, అతని తర్వాత అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్ లో తిలక్ ఒక స్థానం మెరుగుపరుచుకుని టాప్ 3 లో చేరాడు.
ఆసక్తికర విషయం ఏమిటంటే టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ 3 లో నిలిచిన ప్లేయర్స్ అంతా హైదరాబాద్ తో సంబంధమున్నవారే. టాప్ 1,2 ర్యాంకర్స్ హెడ్, అభిషేక్ ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడితే 3వ ర్యాంకర్ తిలక్ వర్మ హైదరాబాద్ కు చెందినవాడు.
ఇక విదేశీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. వారి తర్వాత ఆరో స్థానంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. పాతుమ్ నిస్సంక, టీమ్ సీఫెర్ట్, కుశాల్ పెరెరా, రీస్ హెండ్రిక్స్ ఏడు నుంచి పదో స్థానం వరకు ఉన్నారు. కేరళ ఆటగాడు సంజు శాంసన్ ఏకంగా 36వ స్థానంలో ఉన్నాడు. సంజు ఒక స్థానం కోల్పోయాడు.
ఇంగ్లాండ్ - వెస్టిండీస్ సిరీస్ తర్వాత జాబితాను అప్‌డేట్ చేశారు. మూడో T20లో 46 బంతుల్లో 84 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ 48 స్థానాలు ఎగబాకి 16వ స్థానానికి చేరుకున్నాడు. అతని సహచరుడు హ్యారీ బ్రూక్ కూడా సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 38వ స్థానానికి చేరుకున్నాడు.
వెస్టిండీస్ తరపున కెప్టెన్ షాయ్ హోప్ 14 స్థానాలు మెరుగుపరుచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు. చివరి మ్యాచ్‌లో 45 బంతుల్లో అజేయంగా 79 పరుగులు చేసిన రోవ్‌మాన్ పావెల్ కూడా టాప్ 20లో చోటు సంపాదించాడు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా 252 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్ మూడు స్థానాలు కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు.
బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ గణనీయమైన పురోగతి సాధించాడు. సిరీస్‌లో ఐదు వికెట్లు తీసిన అతను రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత ఆటగాడు వరుణ్ చక్రవర్తి, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగలను ఆదిల్ వెనక్కి నెట్టాడు. న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీ అగ్రస్థానంలో ఉన్నాడు. విండీస్‌కు చెందిన అకీల్ హుస్సేన్ ఐదో స్థానానికి పడిపోయాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా ఆరో స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్లలో రవి బిష్ణోయ్ ఆరో స్థానంలో, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పదో స్థానంలో ఉన్నారు. మహీష్ తీక్షణ, రషీద్ ఖాన్ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. రషీద్ సహచరుడు బ్రైడన్ కార్స్ కూడా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఎదిగాడు. చివరి రెండు మ్యాచ్‌లలో రెండు వికెట్లు తీసిన కార్స్ 16 స్థానాలు ఎగబాకి 52వ స్థానానికి చేరుకున్నాడు.
