446 పరుగులు, 19 సిక్సర్లు.. SMAT లో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ విధ్వంసం
Mushtaq Ali Trophy : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో పంజాబ్ vs బరోడా మధ్య జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన కమ్‌బ్యాక్ తో అదరగొట్టాడు. అభిషేక్ శర్మ మరోసారి షేక్ చేశాడు. ఇద్దరూ పరుగుల వరద పారించారు.

గాయం తర్వాత హార్దిక్ పాండ్యా మెరుపులు
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టి సత్తా చాటాడు. మంగళవారం జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025 టోర్నమెంట్‌లో దుమ్మురేపే ప్రదర్శన ఇచ్చాడు. బరోడా జట్టు తరఫున ఆడిన హార్దిక్, పంజాబ్ జట్టుపై మెరుపు ఇన్నింగ్స్‌తో విజయం అందించాడు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బ్యాట్స్‌మెన్ల ధాటికి బౌలర్లకు చుక్కలు
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌లు చెలరేగిపోయారు. పరుగులు వరద పారింది. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 19 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించ లేదు.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనితో పాటు అన్‌మోల్‌ప్రీత్ సింగ్ కూడా 32 బంతుల్లో 69 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పంజాబ్ జట్టు బరోడా ముందు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
లక్ష్య ఛేదనలో బరోడా మెరుపు ఆరంభం
223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు విష్ణు సోలంకి, శాశ్వత్ రావత్ కేవలం 5 ఓవర్లలోనే 66 పరుగుల తుపాను భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిన తర్వాత సీనియర్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రంగంలోకి దిగాడు. నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్, జట్టు విజయాన్ని భుజాన వేసుకున్నాడు.
పాండ్యా దెబ్బకు అభిషేక్ శర్మపై ఇన్నింగ్స్ కనిపించలేదు
పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యా తన మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. శివాలిక్ శర్మతో కలిసి హార్దిక్ 62 బంతుల్లో 109 పరుగుల మ్యాచ్-విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పాండ్యా 42 బంతుల్లో 183.33 స్ట్రైక్ రేట్‌తో 77 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. హార్దిక్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ తరఫున అభిషేక్ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కన్నా.. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసింది. తన ఈ నాక్ తో బరోడాకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్ తొలి బంతికే బరోడా లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హార్దిక్ పాండ్యా
భారత జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2025 లో గాయపడ్డాడు. ఆ గాయం నుంచి కోలుకున్న తర్వాత అతను గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. SMAT టోర్నీలో పంజాబ్‌పై బ్యాట్‌తో అజేయంగా 77 పరుగుల నాక్ ఆడాడు. అలాగే, బౌలింగ్ లో కూడా రాణించి ఒక వికెట్ కూడా తీశాడు.
తన కమ్‌బ్యాక్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు గాను హార్దిక్ పాండ్యా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో తను త్వరలోనే భారత జట్టుకు ఆడటానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నానని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.

