14 ఏళ్లకే 3 సెంచరీలు.. SMATలో వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర
Vaibhav Suryavanshi : 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో అతి పిన్న వయసులో సెంచరీతో చరిత్ర సృష్టించాడు. బీహార్ తరఫున 108 పరుగులు (నాటౌట్) తో మెరిసి రికార్డులు తిరగరాశాడు.

సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ.. సయ్యద్ ముస్తాక్ అలీలో రికార్డు !
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్ లో యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ దంచికొట్టాడు. అద్భుతమైన సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. కేవలం 14 ఏళ్ల 250 రోజుల వయసున్న వైభవ్ సూర్యవంశీ.. మహారాష్ట్ర బౌలర్లను దంచికొడుతూ అద్భుత సెంచరీ బాదాడు. బీహార్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యంగ్ సెన్సేషన్.. కేవలం 61 బంతుల్లో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో అతడు SMAT చరిత్రలో అతి పిన్న వయస్కుడైన సెంచరీ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ముందు ఈ రికార్డు 18 ఏళ్ల 118 రోజుల వయసులో మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉండగా, వైభవ్ దాన్ని నాలుగేళ్ల ముందే బద్దలు కొట్టడం అతని అసాధారణ ప్రతిభకు నిదర్శనం.
61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులతో సెంచరీ కొట్టిన వైభవ్
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు పెద్దగా సహకరించని మ్యాచ్‌గా కనిపించినా, వైభవ్ మాత్రం తన అద్భుతమైన బ్యాటింత్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఓపికగా బంతిని అంచనా వేస్తూ ఆడిన వైభవ్.. యాభై తర్వాత వేగాన్ని పెంచి వరుస బౌండరీలతో మహారాష్ట్ర బౌలింగ్ లైనప్‌ను దంచికొట్టాడు. 61 బంతుల్లో 108 రన్స్ (నాటౌట్) ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. 177.05 స్ట్రైక్‌రేట్ తో తన ఆటను కొనసాగించాడు.
బిహార్ జట్టు మొత్తం 176 పరుగులు చేయగా, వాటిలో సగం కంటే ఎక్కువ పరుగులు ఒక్క వైభవ్ నుంచే రావడం గమనార్హం.
15 ఏళ్లు నిండకముందే మూడు టీ20 సెంచరీలతో వైభవ్ అరుదైన ఘనత
ఇది వైభవ్‌కి SMATలో తొలి సెంచరీ మాత్రమే. అయితే అతని టీ20 ఫార్మాట్ రికార్డులు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతమైన సెంచరీ బాదాడు. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో 42 బంతుల్లో 144 పరుగులతో మెరిశాడు. 15 ఏళ్లు పూర్తి కాకముందే మూడు టీ20 సెంచరీలతో తనదైన ముద్ర వేశాడు.
ఇంత చిన్న వయసులోనే అతని గట్టి టెంపరమెంట్, షాట్ సెలక్షన్, మ్యాచ్ అవగాహనను క్రికెట్ నిపుణులు ప్రశంసిస్తున్నారు.
వైభవ్ తుఫాన్ సరిపోలేదు
బిహార్ 176/3 స్కోరు చేసినప్పటికీ, మహారాష్ట్ర మాత్రం లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో చేధించింది. మహారాష్ట్ర ఇన్నింగ్స్ లో పృథ్వీ షా 66 (30) పరుగులు, నీరజ్ జోషి 30 పరుగులు, రంజిత్ 27 పరుగులతో మ్యాచ్ ను గెలిపించారు. వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. బౌలింగ్ లో మంచి ప్రదర్శన రాకపోవడంతో బీహార్ పరాజయం పాలైంది. కానీ, మ్యాచ్‌లో వైభవ్ సెంచరీనే హైలెట్ గా నిలిచింది.

