- Home
- Sports
- Abhishek Sharma : గంటలో 45 సిక్సర్లు.. T20 ప్రపంచ కప్ ముందు అభిషేక్ శర్మ విధ్వంసం.. ఇదెక్కడి మాస్ రా మావ !
Abhishek Sharma : గంటలో 45 సిక్సర్లు.. T20 ప్రపంచ కప్ ముందు అభిషేక్ శర్మ విధ్వంసం.. ఇదెక్కడి మాస్ రా మావ !
Abhishek Sharma : టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విజయ్ హజారే ట్రోఫీ ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ 60 నిమిషాల్లో 45 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. టి20 ప్రపంచ కప్‌కు ముందు బౌలర్లకు గట్టి హెచ్చరిక పంపాడు.

వరల్డ్ కప్ ముందు అభిషేక్ శర్మ వార్నింగ్.. భయపడిపోయిన బౌలర్లు
టీమిండియా యువ సంచలనం, డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ విన్యాసాలతో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. గ్రౌండ్ లోకి దిగితే చాలు, బౌలర్ ఎవరన్నది చూడకుండా బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకునే ఈ పంజాబ్ ఆటగాడు, తాజాగా నెట్ ప్రాక్టీస్‌లో బీభత్సం సృష్టించాడు.
విజయ్ హజారే ట్రోఫీకి సన్నాహాల్లో భాగంగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా 45 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. జైపూర్‌లోని అనంతం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం క్రికెట్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
వరల్డ్ కప్ 2026 లక్ష్యంగా..
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 కోసం టీమిండియా సన్నాహాలు ఇప్పుడే మొదలయ్యాయి. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తరఫున కీలక అస్త్రంగా మారే అవకాశం ఉన్న అభిషేక్ శర్మ, తన ఫామ్‌ను నిరూపించుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్, కేవలం న్యూజిలాండ్ సిరీస్ కోసమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్లకు గట్టి హెచ్చరిక పంపాడు.
తన ఇన్‌టెంట్ కేవలం సింగిల్స్, డబుల్స్ తీయడం కాదని, బంతిని స్టాండ్స్‌లోకి పంపడమేనని ఈ ప్రాక్టీస్ సెషన్ ద్వారా స్పష్టం చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌కు ముందు జరిగిన ఈ ప్రాక్టీస్‌లో అభిషేక్ పూర్తిగా దూకుడు మీద కనిపించాడు. బౌలర్లు దయ చూపమని వేడుకుంటున్నట్లుగా ఉన్నా, అభిషేక్ మాత్రం కనికరం లేకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు.
స్పిన్నర్లపై విరుచుకుపడిన అభిషేక్
ఆదివారం జరిగిన పంజాబ్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేయడానికి నెట్స్‌లోకి వచ్చాడు. రాగానే తన సహచరుడు గౌరవ్ చౌదరిని ఫీల్డ్ ఎక్కడ పెట్టారు?" అని అడిగాడు. దానికి గౌరవ్, మిడ్ ఆఫ్ సింగిల్స్ ఆపడానికి ఉంచాం అని సమాధానం ఇచ్చాడు. ఈ ఒక్క మాటతో అభిషేక్ తన గేమ్ ప్లాన్ మార్చుకున్నాడు.
దాదాపు గంట సేపు సాగిన ఈ సెషన్‌లో అతడు ఏకంగా 45 సిక్సర్లు బాదాడు. ఇది సాధారణ ప్రాక్టీస్ లాగా కాకుండా ఒక ప్రత్యేకమైన డ్రిల్ లాగా సాగింది. ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్ చేస్తూ సాగిన ఈ సెషన్‌లో, ఆఫ్ స్పిన్నర్లు, లెగ్ స్పిన్నర్లు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లను అభిషేక్ ఎదుర్కొన్నాడు. పిచ్ గ్రిప్, టర్న్‌కు అనుకూలిస్తున్నప్పటికీ, అభిషేక్ మాత్రం బంతి లెంగ్త్‌ను పసిగట్టి భారీ షాట్లు ఆడాడు.
టెక్నికల్ సర్దుబాట్లు, నెట్ ఏర్పాటులో మార్పులు
అభిషేక్ శర్మ సామర్థ్యాన్ని మరింత పరీక్షించడానికి నెట్ సెటప్‌లో కోచ్ కొన్ని మార్పులు చేశారు. తప్పు సమయంలో ఆడే షాట్లకు పెనాల్టీ విధించేలా షార్ట్ ఎక్స్ట్రా కవర్ వద్ద ఒక ఫీల్డింగ్ నెట్‌ను ఏర్పాటు చేశారు. బంతి ఆగి రావడం లేదా లేట్‌గా రావడం వల్ల బ్యాట్ ఫేస్ క్లోజ్ అయి, క్యాచ్ వెళ్లే ప్రమాదం ఉన్న చోట ఈ రెడ్ నెట్ పెట్టారు.
అభిషేక్ ఒకసారి ఈ ఉచ్చులో పడ్డాడు. కానీ వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నాడు. స్కోర్‌బోర్డును ముందుకు తీసుకెళ్లడానికి క్రాస్ షాట్స్ కాకుండా స్ట్రెయిట్ షాట్స్ ఆడటం మొదలుపెట్టాడు. ఇలా తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకుంటూనే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.
కోచ్ సందీప్ శర్మ సరదా వ్యాఖ్యలు
అభిషేక్ పదే పదే ఇన్‌సైడ్ అవుట్ షాట్లు ఆడుతుండటం చూసి, పంజాబ్ జట్టు ప్రధాన కోచ్ సందీప్ శర్మ ఆశ్చర్యపోయారు. పంజాబీలో సరదాగా, నువ్వు నీ సెంచరీని కేవలం ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్లు కొట్టే పూర్తి చేయాలనుకుంటున్నావా? అని జోక్ చేశారు.
అంతేకాకుండా, అభిషేక్ శర్మ తన ఆల్ రౌండర్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు బౌలింగ్‌పై కూడా దృష్టి సారించాడు. బ్యాటింగ్ విధ్వంసం తర్వాత, సుమారు 40 నిమిషాల పాటు నెట్స్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇది జట్టులో అతని విలువను మరింత పెంచే అవకాశం ఉంది.
వన్డే జట్టులో చోటు కోసం అభిషేక్ శర్మ..
టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న అభిషేక్, ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌పై కన్నేశాడు. ఇంకా వన్డే అరంగేట్రం చేయని అభిషేక్, విజయ్ హజారే ట్రోఫీని ఒక ఛాన్స్ గా మార్చుకోవాలనుకుంటున్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి దిగ్గజాలు ఓపెనింగ్ స్థానాల్లో పాతుకుపోయిన వేళ, యశస్వి జైస్వాల్ కూడా పోటీలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికాపై జైస్వాల్ సెంచరీతో తన స్థానాన్ని బలపరచుకున్న నేపథ్యంలో, అభిషేక్ శర్మకు ఉన్న అవకాశాలు తక్కువే. అయితే, ఈ డొమెస్టిక్ టోర్నీలో భారీ స్కోర్లు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని అతడు భావిస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్, వరల్డ్ కప్ జట్టులో ఇప్పటికే చోటు దక్కించుకున్నప్పటికీ, వన్డే జట్టు ప్రకటన ఇంకా రాలేదు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో తన ప్రదర్శన ద్వారా వన్డే జట్టులోనూ చోటు సంపాదించాలనే పట్టుదలతో అభిషేక్ శర్మ కనిపిస్తున్నాడు.

