భోగి 2023: భగ భగ భోగి.... ఈ రోజున పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు..?
భోగి పండుగ ఈ సంవత్సరం జనవరి 14 తేదీ రోజు జరుపుకుంటున్నాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై చలి ఎక్కువగా పెరుగుతుంది.
భోగి పండుగను తెలుగురాష్ట్రాలలో జరుపుకునే పండగలలో ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రాప్రాంతం వారు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ ఈ సంవత్సరం జనవరి 14 తేదీ రోజు జరుపుకుంటున్నాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై చలి ఎక్కువగా పెరుగుతుంది.
bhogi festival
ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకుంటారు. ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. సంక్రాంతి పండుగ వచ్చింది.. సంబురాలు తీసుకొచ్చింది. అవును.. తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఆంధ్రా, రాయలసీమ ప్రజలు సంక్రాంతిని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రం మూడు రోజుల పండగ జరుపుకుంటారు.
పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు...?
భోగి రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగు పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.
భోగి పండ్ల వెనక ఆంతర్యం ఏమిటంటే రేగు పళ్లను అర్కఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటమే.. రేగు పళ్ళలో ఆయుర్వేదిక లక్షణాలు ఉన్నాయి.. ఇవి నీళ్ళతో కలిపి స్నానం చేయడం వలన ఆ జలం ఔషధ గుణాలు సంతరించుకుని శీతాకాలం వ్యాపించే కొన్ని చర్మ వ్యాధులు నయం కావడానికి తోడ్పడతాయి.. అందుకే భోగి నాడు భోగి పళ్ళు పోస్తారు.
రేగు పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.
భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకరరాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చును.
భోగి పండ్లను 12 ఏళ్లలోపు పిల్లలకు పోస్తారు. భోగిపండ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు , చెరుకు గడ ముక్కలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ఇలా పిల్లలకి తలమీద నుంచి భోగిపండ్లు పోసి వారికి దిష్టి తీస్తారు. ఇలా పోసిన తర్వాత కింద పడ్డ భోగి పండ్లను ఎవరు తినకూడదు. దిష్టి తీసిన భోగి పండ్లను ఎవరూ తొక్కని ప్రదేశములో పడివేస్తారు.
ఈ భోగి రోజు భోగి మంటల ద్వారా మనలో ఉన్న చెడును, బద్దకాన్ని భోగిమంటల్లో వేసి.. ఇవాళ్టి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని కోరుకుంటారు. అదే.. ఈ భోగి పండుగ విశిష్టత. దాంతో పాటు.. భోగి రోజున ఇంట్లోని పిల్లల తల మీద రేగు పండ్లు పోసి వాళ్లలోని చెడును తొలగిస్తారు.శాస్త్రీయ కారణం మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార, సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం సరికాదు. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.