- Home
- Life
- Spiritual
- Van Devi Temple: సాయంత్రమైతే ఈ ఆలయానికి నో ఎంట్రీ.. 400 ఏళ్ల నాటి గుడి కథేంటో తెలుసా?
Van Devi Temple: సాయంత్రమైతే ఈ ఆలయానికి నో ఎంట్రీ.. 400 ఏళ్ల నాటి గుడి కథేంటో తెలుసా?
Van Devi Temple: ఓ ఆలయంలో సూర్యాస్తమయం అక్కడికి భక్తులు ఎవరూ వెళ్లరు. 400 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ సినిమాలో ఈ ఆలయం ప్రస్తావన రావడంతో సోషల్ మీడియాలో గుడి విశేషాలు వెతికే పనిలో పడ్డారు.

దట్టమైన అడవిలో ఆలయం
బీహార్‌లోని ఓ పురాతన ఆలయం ఇప్పుడు బాలీవుడ్ సినిమా 'ది వ్యాన్' కారణంగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాట్నాకు సమీపంలోని బిహ్తా ప్రాంతంలో ఉన్న మా వాన్ దేవి ఆలయం చుట్టూ ఎన్నో ఏళ్లుగా స్థానిక జానపద కథలు, ఆచారాలు, నమ్మకాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఆలయం చుట్టుపక్కల అడవిలోకి వెళ్లకూడదనే సంప్రదాయం ఈ ఆలయంపై ఆసక్తిని పెంచుతోంది. సాయంత్రం హారతి ఇచ్చాక పూజారులు కూడా ఆలయానికి తలుపులు వేసి వెళ్లిపోతారు.
పాట్నాకు 35 కిలోమీటర్ల దూరంలో..
మా వాన్ దేవి ఆలయం బీహార్‌లోని పాట్నా జిల్లాలో బిహ్తా సమీపంలో ఉంది. పాట్నా నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో అమ్హారా, రాఘోపూర్, కంచన్‌పూర్ గ్రామాల పరిసర ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవులతో ఉండేదని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయం దాదాపు 400 ఏళ్ల నాటిదిగా అక్కడి పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఆలయాల్లో దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. కానీ వాన్ దేవి ఆలయంలో అమ్మవారిని సంప్రదాయ విగ్రహం రూపంలో కాకుండా పవిత్ర పిండ్ అంటే పిందే రూపంలో పూజిస్తారు. స్థానిక ఆచారాల ప్రకారం వాన్ దేవిని అడవికి రక్షక దేవతగా భావిస్తారు.
వాన్ దేవి ఆలయం ఎలా ఏర్పడింది?
ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. రాఘోపూర్‌కు చెందిన విద్యానంద్ మిశ్రా అనే వ్యక్తి అమ్మవారి భక్తుడని స్థానిక కథనం. ఆయన తరచూ వింధ్యాచల్‌కు వెళ్లి అమ్మవారిని దర్శించుకునేవారని చెబుతారు.
వయసు పెరిగిన తర్వాత అక్కడికి వెళ్లడం కష్టంగా మారడంతో.. ఒకరోజు అమ్మవారు ఆయనకు కలలో కనిపించి పవిత్ర పిండ్‌లోని ఒక భాగాన్ని తన ప్రాంతానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించమని సూచించారని నమ్మకం. ఆ తర్వాత గ్రామాల పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో ఆ పిండ్‌ను ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారని స్థానిక కథనం చెబుతోంది. కాలక్రమంలో అదే ప్రాంతంలో వాన్ దేవి ఆలయం ఏర్పడిందని చెబుతారు.
సూర్యాస్తమయం తర్వాత అడవిలోకి ఎందుకు వెళ్లరు?
ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం సూర్యాస్తమయం తర్వాత అడవిలోకి వెళ్లకూడదనే సంప్రదాయం ఉంది. స్థానిక జానపద కథల ప్రకారం.. గతంలో ఈ అడవిలో కొన్ని అనూహ్యమైన ఘటనలు జరిగేవని, వాటితో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతారు. దీంతో చీకటి పడిన తర్వాత అడవిలోకి వెళ్లకుండా ప్రజలను ఆపే సంప్రదాయం ఏర్పడిందని కథనాలు ఉన్నాయి.
బాలీవుడ్ సినిమాతో మరోసారి వార్తల్లోకి..
ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన జానపద కథ బాలీవుడ్ వరకు వెళ్లింది. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా నటించిన ‘ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా కథకు వాన్ దేవి ఆలయం చుట్టూ ఉన్న జానపద కథలు నిలిచినట్లు చిత్ర బృందం తెలిపింది.
సినిమా రచయిత అరుణాభ్ కుమార్ ఆలయాన్ని సందర్శించి అక్కడి పూజారులు, గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత ఈ కథపై ఆసక్తి పెరిగిందని వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు స్థానికులకు మాత్రమే తెలిసిన ఈ ఆలయం గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. భారీ నిర్మాణాలు, పెద్ద విగ్రహాలు ఉన్న ప్రసిద్ధ ఆలయాల తరహాలో కాకుండా, అడవి ప్రాంతం మధ్య స్థానిక విశ్వాసాలు, పాత సంప్రదాయాలతో కొనసాగుతున్న చిన్న ఆలయం కావడం వాన్ దేవి ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.

