Overnight Trips: భారతీయులు ఎక్కువగా ప్రయాణించేది వీటి కోసమే.. 48% ట్రిప్పులు వాటికే
Overnight Trips: ట్రావెలింగ్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది హాలిడే, టూరిజం. కానీ ఇండియన్స్ విషయానికి వస్తే కాస్త భిన్నంగా ఉంది. దేశంలో ఓవర్‌నైట్ ట్రిప్పుల్లో తీర్థయాత్రలే చేస్తున్నట్లు కేంద్రం విడుదల చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయం బయటపడింది.

కేంద్ర గణాంకాల ప్రకారం...
ట్రావెలింగ్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది హాలిడే, టూరిజం. కానీ ఇండియన్స్ విషయానికి వస్తే అది కాస్త భిన్నంగా ఉంది. దేశంలో నైట్ టూరిజం చేసే ప్రయాణాల్లో దాదాపు తీర్థయాత్రలు, మత పరమైన యాత్రలే చేస్తున్నట్లు కేంద్రం విడుదల చేసిన సర్వేలో తేలింది.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన డొమెస్టిక్ టూరిజం ఎక్స్‌పెండిచర్ సర్వే (DTES) ప్రకారం.. దేశంలో జరిగే ఓవర్‌నైట్ ట్రిప్పుల్లో 48 శాతం తీర్థయాత్రలు, మతపరమైన ప్రయాణాలే. అంటే.. నైట్ స్టేయింగ్ చేసే ప్రతి రెండు దేశీయ ప్రయాణాల్లో దాదాపు ఒకటి దేవుడి దర్శనం, పుణ్యక్షేత్రాల సందర్శన లేదా ఇతర మతపరమైన యాత్రలే కోసమే జరుగుతున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.
పల్లెల్లో వైద్యం కోసం.. నగరాల్లో సరదా కోసం
ఈ సర్వేను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) 2025 జూలై నుంచి 2026 జూన్ వరకు నిర్వహించింది. ప్రజలు ఎందుకు ప్రయాణిస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతకాలం ఉంటున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎలా ప్రయాణిస్తున్నారు? ఎక్కడ బస చేస్తున్నారు? వంటి విషయాలను సర్వేలో చేర్చారు.
తీర్థయాత్రలు, మతపరమైన ప్రయాణాలు రెండు ప్రాంతాల్లోనూ మొదటి స్థానంలో ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, ఆరోగ్య అవసరాల కోసం చేసే ప్రయాణాలు 38.4 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం సెలవులు, వినోదం, విహారయాత్రలకు సంబంధించిన ప్రయాణాలు 36.4 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచాయి. ఇక ‘ఓవర్‌నైట్ ట్రిప్’ అంటే.. ట్రిప్పుకు వెళ్లి కనీసం ఒక రాత్రి అక్కడ బస చేసి, 180 రోజుల్లోపు తిరిగి ఇంటికి చేరే ప్రయాణం.
ఎక్కువ రోజులు ఉండటం లేదు
దేశీయ ప్రయాణాలు ఎక్కువ రోజులు కొనసాగడం లేదని కూడా సర్వే చెబుతోంది. దాదాపు 80 శాతం మంది ఐదు రోజులు లేదా అంతకంటే తక్కువ కాలమే తమ ప్రయాణాల్లో బస చేస్తున్నారు. ప్రయాణానికి ఎలాంటి రవాణాను ఎంచుకుంటున్నారనే విషయంలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొత్తం విజిటర్ ట్రిప్పుల్లో 32 శాతం బస్సు ప్రయాణాలే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం రైళ్లని వినియోగిస్తున్నారు. అక్కడ 35 శాతం విజిటర్ ట్రిప్పులు రైళ్ల ద్వారానే జరుగుతున్నాయి.
హోటళ్లా? లేక ఇతర వసతులా?
బస విషయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వారు ఎక్కువగా హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లను ఎంచుకుంటున్నారు. మొత్తం విజిటర్ ట్రిప్పుల్లో వీటి వాటా 36 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇతర రకాల వసతుల వినియోగం ఎక్కువగా ఉంది. వీటి వాటా 28 శాతం. ఇందులో సొంతంగా ఉన్న మరో ఇల్లు, ఉద్యోగ సంస్థలు ఏర్పాటు చేసే తాత్కాలిక వసతి, మతపరమైన లేదా మిషనరీ సంస్థలు ఉచితంగా అందించే వసతి వంటివి ఉన్నాయి.
యూపీకి ఎక్కువ మంది ప్రయాణికులు
రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ ముందుంది. రాష్ట్రంలోనే జరిగే ప్రయాణాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చే ప్రయాణికులను కలిపి చూస్తే మొత్తం విజిటర్ ట్రిప్పుల్లో యూపీ వాటా 15.7 శాతంగా ఉంది. తమిళనాడు 13.4 శాతంతో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ 8 శాతంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. అన్ని ప్రయాణాలకు ఒకే స్థాయిలో ఖర్చు కావడం లేదు. ముఖ్యంగా వైద్యం కోసం చేసే ప్రయాణాలకే ఎక్కువ డబ్బు ఖర్చవుతోంది.
2.46 లక్షల కుటుంబాలు ఇచ్చిన డేటా
ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా 2,46,113 కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. ఇందులో 1,42,603 గ్రామీణ కుటుంబాలు, 1,03,510 పట్టణ కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కలను చూస్తే భారతీయుల ప్రయాణాల్లో తీర్థయాత్రలకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది. టూరిజం, హాలిడే ట్రిప్పులు ఉన్నప్పటికీ.. ఓవర్ నైట్ ట్రిప్పుతో జరిగే దేశీయ ప్రయాణాల్లో 48 శాతం మతపరమైన ప్రయాణాలే ఉండటం ఈ సర్వేలో తేలింది.

