- Home
- Life
- Spiritual
- Srivari naivedyam: శ్రీవారికి సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా?
Srivari naivedyam: శ్రీవారికి సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా?
TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు. స్వామి వారికి సమర్పించే లడ్డూ ప్రసాదం అందరికీ తెలుసు. స్వామివారికి అనునిత్యం నైవేద్యాలు పెడతారు. కానీ సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకూ ఎన్ని నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా?

45 రకాల నైవేద్యాలు
తిరుమల ఆలయంలో నైవేద్య సమర్పణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం నిర్ణీత సమయాల్లో వివిధ రకాల అన్న ప్రసాదాలు, పిండి వంటలు శ్రీవారికి నివేదిస్తారు. ఉదయం నైవేద్యం, మధ్యాహ్నం రాజభోగం, రాత్రి శయన భోగం సందర్భాల్లో ఈ నైవేద్య కైంకర్యం జరుగుతుంది. ఏకంగా 45 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పిస్తారు.
ప్రాతఃకాల ఆరాధనలో శుద్ధాన్నం, మాతృప్రసాదం
ప్రసాదాలను వరుస క్రమంలో చూసుకుంటే గోక్షీరం, నవనీతం, ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్వామివారికి శుద్ధాన్నం, మాతృప్రసాదం, చక్రపొంగలి, పొంగలి, కదంబం, పులిహోర.
రెండో గంట నైవేద్యంలో క్షీరాన్నం పెడతారు. తర్వాత ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారికి క్షీరాన్నం, వడ, అప్పం, జిలేబీ, మురుకు, పాయసం, వడపప్పు, పానకం..ఇలా రకరకాల ప్రసాదాలు పెడతారు.
సుప్రభాత సేవలో గోక్షీరం, నవనీతం
కల్యాణమహోత్సవాలు, కొన్ని ఇతర ప్రత్యేక సందర్భాల్లో చక్కెర, జీడిపప్పు, యాలకులు కలిపిన ప్రసాదం పెడతారు. పెద్దలడ్డూ, దోశ, కదంబం, అప్పం, క్షీరాన్నం, వడ, దద్యోదనం పెడతారు. సుప్రభాత సేవలో గోక్షీరం, నవనీతం సమర్పిస్తారు. అనంతరం జరిగే కొలువులో నువ్వుల పొడి, బెల్లంపొడి, సొంటి కలిపిన మిశ్రమాన్ని పెడతారు.
అన్నప్రసాదాలు, పణ్యారాలు
ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా అన్నప్రసాదాలు, పణ్యారాలు సమర్పిస్తారు. అన్న ప్రసాదాల్లో శుద్ధాన్నం, పెరుగన్నం, లడ్డూ గర్భాలయంలో పెడతారు. ముద్గాన్నం, తింత్రిణీరసాన్నం, దధ్యోదనం, గుడాన్నం, మిరియాల పొంగల, శాకాన్నం వంటి రకాలు ఉంటాయి. వీటిలో ముద్గాన్నం అంటే నెయ్యి పొంగలి, తింత్రిణీరసాన్నం అంటే పులిహోర, దధ్యోదనం అంటే పెరుగన్నం. గుడాన్నం బెల్లంతో తయారు చేసే అన్నం కాగా, శాకాన్నం కూరగాయలతో తయారు చేసే అన్నం.
బ్రహ్మోత్సవాల్లో రెండింతలు పెడతారు
ఇవే ప్రసాదాలను బ్రహ్మోత్సవాల్లో రెండింతలు ఎక్కువ చేసి పెడతారు. రెండో అర్చన తర్వాత షీరా, పొంగలి, పులిహోర పెడతారు.
ఉంజల్ సేవలో చక్కెర, జీడిపప్పు, యాలకులు, కొబ్బరి పొడి కలిపిన నైవేద్యం పెడతారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో ఇదే నైవేద్యం పెడతారు. రాత్రి సేవలో శుద్ధానం, దద్యోదనం, కదంబం, ములహోర, పొంగలి, దోశే పెడతారు. అర్థరాత్రి నైవేద్యంలో బెల్లం పొంగలి పెడతారు. ఏకాంత సేవలో జీడిపప్పు, ద్రాక్ష, కలకండ, బాదంపప్పు కలిపిన మిశ్రమం పెడతారు. రకరకాల పండ్లు, గో క్షీరం పెడతారు.

