తెలిసో, తెలియకో.. కూతురుతో కన్నీరు పెట్టించొద్దు.. ఇంటికి అరిష్టం!
Parents-daughter relationships: కూతురు పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిని దుర్గా దేవి ప్రతిరూపంగా భావించి కొలుస్తారు. దేవీ నవరాత్రుల సమయంలో అమ్మాయిలకు కన్యా పూజలు చేస్తారు. పెళ్లి సమయంలో అమ్మాయిని కన్యాదానం చేసి పాదాలను కడగడం తెలిసిందే. హిందూ ధర్మంలో కూతురుకు అంత ప్రాముఖ్యం ఉంది. కానీ తెలిసో, తెలియకో తల్లిదండ్రులు అమ్మాయిల మనసు బాధ పెడుతుంటారు. ఏడిపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తనకే కాదు.. ఆ ఇంటికే అరిష్టం. ఇంటి కూతురు ఏడిస్తే లక్ష్మిదేవికి ఆగ్రహం వస్తుందంటారు జ్యతిష పండితులు.

కుమార్తెను ఏడిపిస్తే ఇంటికి ఎంత నష్టమో.. కొన్ని పనులు చేయిస్తే అంత అశుభం కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కంట కన్నీరు వచ్చేలా చేయకూడదు. అదేపనిగా కోపగించుకోవడం, చిన్నచిన్న తప్పులకే దండించడం చేయొద్దు. వారికి ఇష్టం లేకుండా మురికి పాత్రలు కడిగించడం చేయొద్దు. ఇష్టం లేని పనులు చేయించవద్దు. ఇంకా తనతో ఏమి చేయించకూడదు అంటే..
అప్పు తీర్చేయాలి
తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూతురుకు అప్పు ఉండకూడదు. తన దగ్గర చేబదులుగా, అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలి. ముఖ్యంగా పెళ్లైన కుమార్తె దగ్గర చేబదులు లేదా అప్పుగా తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. ఆ అప్పు భారం ఎంతలా పెరిగిపోతుంటే ఇంటికి అరిష్టాలు అంతగా పెరిగిపోతుంటాయి.
అవమానించవద్దు
కూతురును ఇతరులతో పోల్చుతూ అవమానించడం, బాధ పెట్టడం అస్సలు చేయొద్దు. తను ఏవైనా తప్పుడు పనులు చేస్తే మందలించి సరైన దారిలో పెట్టాలే తప్ప అందరి ముందు ఆమె తప్పులు ఎత్తి చూపుతూ అవమానించవద్దు. ముఖ్యంగా పెళ్లైన కుమార్తెను ఇతరుల్లాగే గౌరవించాలి. వాళ్ల వైపు బంధువుల ముందు ఏవైనా మాటలు అంటే చులకన అవుతారు. ఆ మాటలు తల్లిదండ్రులకు దోషాలు తెచ్చిపెడతాయి.
ఏడుస్తూ వెళ్లొద్దు
కన్నకూతురు బయటికి వెళ్లినప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఏడుస్తూ బయటికి వెళ్లొద్దు. అది పెళ్లయిన తర్వాత అప్పగింతల సమయం అయినా సరే. తను తల్లిదండ్రుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్లే సమయంలో కన్నీటితో వెళ్లిందంటే ఆ ఇంట్లో నుంచి లక్ష్మిదేవి వెళ్లిపోతుంది. ఇంట్లో ఉన్న కూతురు సాయంత్రం పూట బాధ పడితే ఆ ఇంటిని చికాకులు, బాధలు చుట్టుముడతాయి. రాత్రిపూట వారిని తిడితే ఆ ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. అశాంతి తిష్ట వేస్తుంది.
గమనిక: ఈ నమ్మకాలు, సూచనలు, కథనంలో చెప్పిన సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే.