- Home
- Life
- Relationship
- Fictosexuality: కల్పిత పాత్రలపై లైంగిక ఆకర్షణ.. యువతలో పెరుగుతోన్న ఫిక్టోసెక్కువాలిటీ
Fictosexuality: కల్పిత పాత్రలపై లైంగిక ఆకర్షణ.. యువతలో పెరుగుతోన్న ఫిక్టోసెక్కువాలిటీ
Fictosexuality: మగవారికి ఆడవారిపై, ఆడవారికి మగవారిపై ఆకర్షణ కలగడం సాధారణం. అయితే కల్పిత పాత్రలపై ఇలాంటి ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇప్పుడీ ట్రెండ్ ఎక్కువవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫిక్టోసెక్సువాలిటీ అంటే ఏంటి?
ఫిక్టోసెక్సువాలిటీ అనేది ఒక రకమైన లైంగిక భావజాలం. ఇందులో వ్యక్తి నిజమైన మనుషులకన్నా కల్పిత పాత్రలపై భావోద్వేగం, ప్రేమ, ఆకర్షణ చూపిస్తారు. పుస్తకాలు, సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోలు, వీడియో గేమ్స్ లోని పాత్రలు వీరికి దగ్గరగా అనిపిస్తాయి. థెరపిస్ట్ రిబెక్కా మైనర్ చెప్పిన ప్రకారం, ఫిక్టోసెక్సువల్ వ్యక్తులు అనుభూతి చెందే బంధం ఊహాజనితం కాదు. అది నిజమైన భావంతో కూడిన అనుబంధం.
కల్పిత పాత్రలపై ఇంత బలమైన ఆకర్షణ ఎందుకు?
డార్సీ లాంటి గంభీర స్వభావం, చాండ్లర్ బింగ్ లాంటి హాస్యం చాలామందిని ఆకట్టుకుంటాయి. కొందరు అలాంటి వ్యక్తి నిజ జీవితంలో దొరకాలని కోరుకుంటారు. ఇంకొందరు మాత్రం ఆ కల్పిత పాత్రలతోనే భావోద్వేగ బంధం ఏర్పరచుకుంటారు. ఆ పాత్రలు వారిని అర్థం చేసుకుంటున్నట్లు, భద్రత ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రేమలో గాయాలు లేకపోవడం కూడా ఒక కారణం.
ఫిక్టోసెక్సువల్ అంటే తప్పనిసరిగా ఏసెక్సువల్ అవ్వాలా?
అవసరం లేదు. ప్రతి వ్యక్తి లైంగిక ఆకర్షణను వేరేలా అనుభవిస్తారు. ఫిక్టోసెక్సువల్ వ్యక్తి స్ట్రైట్, గే, పాన్ సెక్సువల్, ఓమ్ని సెక్సువల్ గా కూడా గుర్తించుకోవచ్చు. కొంతమంది ఏసెక్సువల్ వర్గంలోకి వస్తారు. ఇంకొందరు రారు. చివరికి ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తి తాను నమ్మే గుర్తింపుతో సంతోషంగా ఉండడం.
ఫిక్టోసెక్సువాలిటీ ఎందుకు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది?
2025 నాటికి ఏఐ టెక్నాలజీ పెద్ద మార్పు తీసుకొచ్చింది. చాలామంది ఏఐ చాట్‌బాట్లతో ప్రేమ సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. భర్తను వదిలి ఏఐ బాయ్‌ఫ్రెండ్ తో జీవించడం, భాగస్వామి మరణం తరువాత ఏఐలో ప్రేమను వెతకడం, ఏఐ బాట్‌తో పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు వార్తల్లో నిలిచాయి. ఫిక్టోసెక్సువల్ వ్యక్తులకు ఏఐ భాగస్వాములు నమ్మకం, భద్రత ఇస్తారు. మోసం, వదిలిపెట్టడం లాంటి భయం ఉండదు.
ఫిక్టోసెక్సువాలిటీ లో ఆకర్షణ ఏంటి?
జపాన్ వ్యక్తి అకిహికో కొండో 2018లో హోలోగ్రామ్ పాప్ స్టార్ మికుతో వివాహం చేసుకున్నాడు. దానికి అతడు 15 వేల డాలర్లు ఖర్చు చేశాడు. అతని మాటల్లో చెప్పాలంటే, మికు ఎప్పటికీ అతని దగ్గరే ఉంటుంది. ద్రోహం చేయదు. అనారోగ్యం బారిన పడదు. చనిపోదు. పరిశోధకురాలు అగ్నెస్ గియార్డ్ ప్రకారం, తిరస్కరణ అనేది ఉండకపోవడమే ఈ ఆకర్షణకు ప్రధాన కారణం. అంతేకాదు, కొందరు ఈ వర్చువల్ బంధాల ద్వారా లింగ నియమాలు, పెళ్లి భావనలు, సామాజిక పరిమితులను ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో పెద్ద లాభం ఏంటంటే సంబంధం పూర్తి నియంత్రణ వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. సమయం, వేగం, హద్దులు అన్నీ తానే నిర్ణయించుకోవచ్చు.

