Love: జీవితంలో ఎన్నిసార్లు ప్రేమలో పడతామో తెలుసా?
Love: ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన అనుభూతి. ప్రేమలో పడని వ్యక్తులు ఎవరూ ఉండరు. ముఖ్యంగా 'తొలి ప్రేమ'ను జీవితాంతం మర్చిపోలేరు. అయితే ఒక మనిషి తన జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారు.?

సగటున రెండుసార్లు ప్రేమలో పడతారంట..
ప్రేమ మనసుకు సంబంధించింది. ఎప్పుడు, ఏ క్షణం ప్రేమలో పడతారనేది ఎవ్వరూ చెప్పలేరు. పలానా టైంలోనే ప్రేమ పుడుతుందనడానికి ఆధారాల్లేవు. నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుందంటారు. కానీ కాదు. అమెరికాలోని The Kinsey Institute పరిశోధకులు ఈ విషయంపై ఒక పెద్ద సర్వే నిర్వహించారు.ఈ అధ్యయనంలో 18 నుంచి 99 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 10,036 మంది ఒంటరి వ్యక్తులను తీసుకుకున్నారు. వారిని మీ జీవితంలో ఎన్ని సార్లు నిజంగా ప్రేమలో పడ్డారనే ప్రశ్న అడిగారు.
ఈ సర్వేలో వచ్చిన ఫలితాల ప్రకారం, సాధారణంగా ఒక వ్యక్తి తన జీవితంలో సగటున రెండు సార్లు మాత్రమే తీవ్రంగా ప్రేమలో పడతాడని తేలింది. 14 శాతం మంది ఎప్పుడూ ప్రేమలో పడలేదని చెప్పారు. 28 శాతం మంది ఒకసారి మాత్రమే అని చెప్పారు. 30 శాతం మంది రెండు సార్లు అని చెప్పగా... 17 శాతం మంది 3 సార్లు, ఇంకా 11 శాతం మంది 4 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ప్రేమలో పడ్డామని తెలిపారు.
లోతైన ప్రేమ
ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని సార్లు నిజమైన అనుభవిస్తాడో చెప్పే టిపికల్ రీసెర్జ్ ఇదేనని శాస్త్రవేత్త డాక్టర్ అమండా గెసెల్మాన్ తెలిపారు. సాధారణంగా మనం ప్రేమ గురించి తరచూ మాట్లాడుతుంటాం కానీ నిజమైన, లోతైన ప్రేమ మాత్రం చాలా మందికి కొద్దిసార్లే జరుగుతుందని ఆమె వివరించారు.
ఈ అధ్యయనంలో బయటపడ్డ మరో ఆసక్తికర విషయం
ప్రేమ అనుభూతి... లింగం, వయస్సు లేదా వ్యక్తిగత అభిరుచులతో పెద్దగా మారదని తేలింది. అంటే పురుషులు, మహిళలు లేదా వేర్వేరు లైంగిక అభిరుచులు ఉన్నవారు, అందరూ ప్రేమను దాదాపు ఒకే విధంగా అనుభవిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
నమ్మకమే నిజమైన ప్రేమకు పునాది
నిజమైన ప్రేమ ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు. కాలక్రమేణా బాధ్యతలు పెరుగుతాయి, జీవితం మారుతుంది. అప్పుడు ప్రేమ తగ్గిపోవచ్చు. కానీ దీని స్థానంలో నమ్మకం, స్నేహం, పరస్పర గౌరవం మీద ఆధారపడి కల్మషం లేని ప్రేమ ఏర్పడుతుంది. అనుబంధాలను కలకాలం నిలబెట్టేది ఇదేనని చెబుతున్నారు.
ఈ సోషల్ మీడియా కాలంలో ప్రేమకు అర్థాలు మార్చేశారు
ప్రస్తుతం సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ప్రభావం పెరుగుతున్న ఈ కాలంలో ప్రేమకు రకరకాల అర్థాలు జోడిస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియా చూపించే సంబంధాలు... నిజ జీవితంతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటాయి.
మొత్తానికి పరిశోధకులు చెబుతున్నది ఏమిటంటే మన జీవితంలో కల్మషంలేని ప్రేమ సాధారణంగా రెండు సార్లే పుడుతుంది. అయితే ప్రేమ ఎన్ని సార్లు వస్తుందన్నదానికంటే, వచ్చిన ప్రేమను ఎంతకాలం నిలబెట్టుకుంటామన్నదే ముఖ్యం.
