Parenting Tips: పిల్లలకు ఏ వయసు నుంచి నెయ్యి పెట్టొచ్చు..?
Parenting Tips: ఆరు నెలల తర్వాత నుంచి పిల్లలకు సాలిడ్స్ ఇవ్వడం మొదలుపెడతారు అని చాలా మందికి తెలుసు. కానీ, ఏ వయసు నుంచి పిల్లలకు నెయ్యి ఇవ్వచ్చో తెలుసా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Baby Feeding
పిల్లలు ఆరోగ్యకరంగా పెరగాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలకు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావించే వివిధ రకాల ఆహారాలను తినిపిస్తారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు హెల్దీగా పెరగాలని వారు తీసుకునే ఆహారంలో నెయ్యి కలుపుతూ ఉంటారు. కానీ, మరీ చిన్న పిల్లలకు నెయ్యి ఇవ్వడం మంచిదేనా? అసలు ఏ వయసు నుంచి పిల్లలకు నెయ్యి ఇవ్వడం మొదలుపెట్టాలి? దీని గురించి పిల్లల వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం....
ఆరు నెలల వయసు నుంచి...
నిపుణుల ప్రకారం... పిల్లలకు నెయ్యిని ఆరు నెలల వయసు తర్వాత నుంచి ఇవ్వడం మొదలుపెట్టవచ్చు. డైరెక్ట్ గా ఇవ్వకపోయినా, వారికి అందించే ఆహారంలో ఈ నెయ్యిని జోడించి అందించవచ్చు. అయితే... అది కూడా లిమిట్ గానే అందించాలి. మరీ ఎక్కువగా పెట్టకూడదు.
ఎంత నెయ్యి ఇవ్వాలి..?
నిపుణుల ప్రకారం.. రోజువారీ పిల్లలకు పావు నుంచి అర టీ స్పూన్ వరకు నెయ్యిని పిల్లలకు ఇవ్వచ్చు. ఆ నెయ్యిని కూడా పిల్లలకు నేరుగా ఇవ్వకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరు దానిని పప్పు, కిచిడి లేదా గుజ్జు చేసిన కూరగాయలతో కలిపి ఇవ్వొచ్చు. మీరు 9 నుంచి 12 నెలల వయసు గల పిల్లలకు 1 టీ స్పూన్ నెయ్యి ఇవ్వొచ్చు. మీరు 1-2 సంవత్సరాల వయసు గల పిల్లలకు 1-2 టీ స్పూన్ల నెయ్యి ఇవ్వొచ్చు.
నెయ్యి వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు...
నెయ్యి పెరుగుతున్న పిల్లలకు శక్తిని అందిస్తుంది. అంతేకాదు..ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా అందిస్తుంది. ఒక గ్రాము నెయ్యిలో 9 కేలరీలు ఉంటాయి. ఇది పిల్లలు రోజంతా చురుకుగా, ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడుతుంది.
బరువు పెరగడానికి సహాయపడుతుంది.
ఒక పిల్లవాడు బలహీనంగా లేదా తక్కువ బరువుగా ఉంటే, మీరు వారికి నెయ్యి అందించవచ్చు. నెయ్యి అందించడం వల్ల వారి ఆహారంలో కేలరీలు, పోషకాలు పెరుగుతాయి. దీని కారణంగా పిల్లలు ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు. అంతేకాదు నెయ్యి సులభంగా జీర్ణం అవుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా సహాయపడుతుంది.
మెదడు అభివృద్ధి
మెదడులో ఎక్కువ భాగం కొవ్వుతో తయారవుతుంది. నెయ్యిలోని ఒమేగా-3 , ఒమేగా-6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు మెదడు సరైన అభివృద్ధికి చాలా అవసరం. ఇది జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో కూడా సహాయపడుతుంది.

