- Home
- Life
- Pregnancy & Parenting
- పేరెంట్స్, పిల్లల్ని ప్రతిరోజు కచ్చితంగా అడగాల్సిన 3 ప్రశ్నలు ఏంటో తెలుసా?
పేరెంట్స్, పిల్లల్ని ప్రతిరోజు కచ్చితంగా అడగాల్సిన 3 ప్రశ్నలు ఏంటో తెలుసా?
పిల్లల పెంపకం చాలా బాధ్యతతో కూడుకున్న పని. వారి ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడే వారికి మంచి భవిష్యత్ ఉంటుంది. ప్రతిరోజూ పేరెంట్స్ పిల్లల్ని దగ్గర కూర్చొబెట్టుకొని కొన్ని ప్రశ్నలు అడగడం వల్ల వారిలో ఉత్సాహం, ఆసక్తి పెరగడంతో పాటు కొన్ని భయాలు తొలగిపోతాయి.

Parenting Tips
పిల్లలు చురుకుగా, ఉత్సాహంగా ఉండాలని.. చక్కగా చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ప్రతిరోజు రాత్రి పిల్లల్ని, తల్లిదండ్రులు దగ్గర కూర్చొబెట్టుకొని 3 ముఖ్యమైన ప్రశ్నలు అడగడం ద్వారా వారి మనసు, ఆలోచనా విధానం, వ్యక్తిత్వ వికాసంపై మంచి ప్రభావం పడుతుంది. ఆ ప్రశ్నలు పిల్లల రోజును మాత్రమే కాక వారి భవిష్యత్తును కూడా రూపొందించే శక్తి కలిగి ఉంటాయి. ఇవి పిల్లల్లో ఆత్మపరిశీలన, ఆసక్తి, బాధ్యతాభావం, ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యం వంటి ముఖ్యమైన విలువలను పెంచుతాయి. మరి పిల్లల్ని, పేరెంట్స్ కచ్చితంగా అడగాల్సిన ఆ ప్రశ్నలేంటో చూద్దామా..
ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?
పిల్లలను ప్రతిరోజు “ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?” అని అడగడం వల్ల వారిపై సానుకూల ప్రభావం పడుతుంది. ఈ ప్రశ్న పిల్లల్లో ఆసక్తిని పెంచి, పరిశీలన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేస్తుంది. వారు రోజు మొత్తం నేర్చుకున్న విషయాలను గుర్తుచేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది. తాము నేర్చుకున్న విషయాన్ని.. అంచనా వేసే అలవాటు ఏర్పడుతుంది.
తల్లిదండ్రులు వారు నేర్చుకున్న విషయాల పట్ల ఆసక్తి చూపుతున్నారని పిల్లలు భావిస్తారు. దానివల్ల పిల్లలు, పేరెంట్స్ మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. అంతేకాదు రోజూ ఏదో ఒక్క విషయం కొత్తగా నేర్చుకోవాలి అనే ప్రేరణ పిల్లల్లో కలుగుతుంది. ఇలా నిరంతరం అడగటం వల్ల పిల్లల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం క్రమంగా పెరుగుతాయి.
ఈ రోజు నీకు ఏ విషయం కష్టంగా అనిపించింది?
పిల్లలను ప్రతిరోజు “ఈ రోజు నీకు ఏ విషయం కష్టంగా అనిపించింది?” అని అడగడం ద్వారా వారిలో ఆత్మపరిశీలన, నిజాయతీ, భావాలను వ్యక్తపరిచే ధైర్యం పెరుగుతుంది. పిల్లలు తమకు కష్టమైన విషయాలను చెప్పడం ద్వారా మానసిక భారం తగ్గి భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుంది. తల్లిదండ్రులు తమ కష్టాలను వినడానికి సిద్ధంగా ఉన్నారని పిల్లలు తెలుసుకోవడం వల్ల వారిలో భద్రతాభావం, నమ్మకం పెరుగుతుంది. అనుబంధం బలపడుతుంది. అంతేకాదు ఈ ప్రశ్న పిల్లలకు తప్పులు లేదా కష్టాలు సహజమని.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని అర్థమవుతుంది.
రేపు నువ్వు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నావు?
పిల్లలను ప్రతిరోజు “రేపు నువ్వు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నావు? ఏం నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నావు?” అని అడగడం వల్ల వారిలో భవిష్యత్ పట్ల సానుకూల దృష్టి, ప్రణాళికా శక్తి, నేర్చుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఈ ప్రశ్న పిల్లలను ఆలోచించేలా చేసి, వారి రోజును వారే స్వయంగా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. రేపు నేర్చుకోవాలనుకునే విషయాన్ని గుర్తించడం వల్ల వారికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆసక్తులను అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. దానివల్ల పిల్లల అభిరుచులకు అనుగుణంగా మద్ధతు, మార్గదర్శకత్వం అందించవచ్చు.
జీవితంలో విజయం సాధించడానికి..
తల్లిదండ్రులు ప్రతిరోజు సాయంత్రం పిల్లల కోసం కాస్త సమయం కేటాయించి.. వారిని ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని ఈ మూడు ప్రశ్నలు అడగడం ద్వారా వారిలో ఆత్మపరిశీలన, ఆసక్తి, ధైర్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, స్వతంత్ర ఆలోచన వంటి ముఖ్యమైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. పేరెంట్స్ చేసే ఈ చిన్న ప్రయత్నం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి, భావోద్వేగ స్థిరత్వం, భవిష్యత్తుపై దృష్టి, వ్యక్తిత్వ వికాసం పెరిగి, వారు చదువులోనే కాక, జీవితంలోనూ విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది.

