పిల్లలు సరిగ్గా తినట్లేదా? ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు.. చక్కగా తింటారు
చాలామంది పేరెంట్స్ ఎక్కువగా చేసే కంప్లెయింట్ ఏంటంటే మా పిల్లలు సరిగ్గా తినరూ అని. నిజానికి పిల్లలు తినకపోవడమనేది వారి వయసు, మైండ్‌సెట్, పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. మరి పిల్లలు ఇష్టంగా ఫుడ్ తినాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

పిల్లలు సరిగ్గా తినాలంటే పాటించాల్సిన చిట్కాలు
పిల్లలు సరిగ్గా తినకపోవడం లేదా కొన్ని పదార్థాలను మాత్రమే ఇష్టపడటం తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లల ఆహారపు అలవాట్ల వెనుక మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని కారణాలు ఉంటాయి. చిన్న చిన్న మార్పులు చేయడం, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పిల్లలకు తినడం మీద ఆసక్తి పెంచవచ్చు.
రంగులు, ఆకారాలకు ప్రాధాన్యం
పిల్లలు బోరింగ్‌గా కనిపించే ఫుడ్‌ను ఎప్పుడూ తినరు. వారికి ఆకర్షణీయంగా కనిపించాలంటే ఆహారాన్ని ప్లేటులో రంగుల వారీగా పేర్చండి. లేదా రకరకాల ఆకారాల్లో కట్ చేసి ఇవ్వండి. దోసెలను స్మైలీ షేప్‌లో చేయండి. సాండ్విచ్‌లను కార్టూన్ ఆకారంలో కట్ చేయండి. లేదా ఫ్రూట్ సలాడ్‌ను రంగురంగుల బౌల్‌లో పెట్టి ఇవ్వండి. దానివల్ల ఫుడ్ పై పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది.
బలవంతంగా తినిపించకూడదు
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు తినకపోతే బలవంతంగా తినిపించే ప్రయత్నం చేస్తారు. కానీ అది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. పిల్లలకు ఆహారం పట్ల విరక్తి కలుగుతుంది. కాబట్టి “తిను” అని ఆదేశించడానికి బదులు “రా, మనం ఇద్దరం కలిసి తిందాం” అని చెప్పండి. వారితో మీరు కూడా కూర్చొని తినండి. మీరు ఆనందంగా తింటే వారు కూడా తినడం మొదలుపెడతారు.
వంట చేయడంలో..
పిల్లలకు తినడం మీద ఆసక్తి పెరగాలంటే, వారిని వంట ప్రక్రియలో ఇన్వాల్వ్ చేయాలి. కూరగాయలు కడగడం, వంట సామాగ్రి అందించడం, లేదా ప్లేట్లు సర్దడం లాంటి చిన్న చిన్న పనులు చేయనివ్వాలి. ఈ ఫుడ్ నేనే తయారు చేశాను అనే ఫీలింగ్ వారిలో వస్తే.. దాన్ని కచ్చితంగా తింటారు. ఇది తినడమే కాకుండా, బాధ్యత కూడా నేర్పే చక్కని మార్గం.
ఫుడ్ టైమ్‌ను ఫ్యామిలీ టైమ్‌గా మార్చండి
ఈ కాలం పిల్లలతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే టీవీ, మొబైల్ లేకుండా తినరు. స్క్రీన్ ముందు తినడం వల్ల వారు ఆహారం మీద దృష్టి పెట్టరు. దానివల్ల ఎక్కువగా తింటారు. లేదా తినడం మానేస్తారు. కాబట్టి ఫుడ్ టైమ్‌ను ఫ్యామిలీ టైమ్‌గా మార్చండి. కుటుంబమంతా కలిసి కూర్చొని తినండి. హ్యాపీగా మాట్లాడుకోండి. దానివల్ల కడుపు నిండడమే కాదు.. బంధాలు కూడా బలపడుతాయి.
చిన్న మోతాదులో తరచుగా ఇవ్వండి
చిన్నారుల కడుపు చాలా చిన్నగా ఉంటుంది. పెద్ద ప్లేట్‌లో ఎక్కువ ఆహారం పెడితే వారు తినరు. తినడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి చిన్న చిన్న మోతాదుల్లో 5-6 సార్లు ఇవ్వండి. అలాగే కొత్త ఆహారాన్ని పరిచయం చేసేటప్పుడు పాత ఇష్టమైన వంటకాలతో కలిపి ఇవ్వండి. దానివల్ల వారు ఇష్టంగా తింటారు.