పిల్లలు చెప్పిన మాట వినడం లేదా? ఈ 5 పనులు చేస్తే కచ్చితంగా మారుతారు!
చాలామంది పేరెంట్స్.. పిల్లలు చెప్పిన మాట వినడం లేదని బాధపడుతుంటారు. పిల్లలు మాట వినకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ పేరెంట్స్ కొన్ని పనులు చేయడం ద్వారా పిల్లల్లో కచ్చితమైన మార్పును చూడవచ్చు. ఏం చేస్తే పిల్లలు చెప్పిన మాట వింటారో ఇక్కడ చూద్దాం.

పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఏం చేయాలి?
పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఎదురుచెప్పడం వంటివి తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే విషయాలు. కానీ పిల్లలు మాట వినడం లేదంటే.. వారు చెడ్డవారనో, మొండివారనో కాదు. అది వారి వయస్సు, మన ప్రవర్తన, సంభాషణ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. పిల్లల మనసును అర్థం చేసుకొని, సరైన రీతిలో వ్యవహరిస్తే వారు మన మాటలు గౌరవంగా వింటారు. పిల్లలు మాట వినాలంటే పేరెంట్స్ చేయాల్సిన ఐదు ముఖ్యమైన పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రశాంతంగా మాట్లాడటం
పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడటం చాలా అవసరం. మనం కోపంగా, పెద్దగా కేకలు వేస్తూ మాట్లాడితే పిల్లలు భయపడి మౌనంగా ఉంటారు. అదే మనం మృదువుగా, ప్రేమతో మాట్లాడితే వారు మన మాటకు స్పందిస్తారు. ఉదాహరణకు స్కూల్ నుంచి రాగానే హోం వర్క్ మొదలు పెట్టు అని గట్టిగా చెప్తే.. పిల్లలు దాన్ని ఆదేశంగా తీసుకుంటారు. అలా కాకుండా త్వరగా హోం వర్క్ ఫినిష్ చేస్తే మనం కలిసి ఆడుకోవచ్చు. టీవి చూడొచ్చు వంటివి ఏదైనా చెప్తే పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది.
పిల్లల మాట వినడం
పేరెంట్స్ పిల్లలకు ఆదేశాలు మాత్రమే ఇవ్వకుండా.. వాళ్లు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు పిల్లలు తమ భావాలను చెప్పాలనుకుంటారు కానీ.. పెద్దవాళ్లు బిజీగా ఉండి పట్టించుకోరు. అలా తరచూ జరుగుతుంటే వారు మన మాటలు కూడా పట్టించుకోవడం మానేస్తారు. పిల్లలు ఏం చెప్పినా కొద్ది నిమిషాలు వినడం, అర్థం చేసుకోవడం, వారి భావాలను గౌరవించడం వల్ల వారిలో మనపై నమ్మకం పెరుగుతుంది. అదే మన మాట వినేలా చేస్తుంది.
పాజిటివ్ రివార్డ్
పిల్లలు మన మాట విని మంచి పనులు చేస్తే వారిని అభినందించాలి. చిన్న గిఫ్ట్, ప్రశంస లేదా హత్తుకోవడం కూడా పెద్ద బహుమతి అవుతుంది. ఇది కేవలం రివార్డ్ కోసం కాదు.. పేరెంట్స్ మాట వినడం వల్ల మంచి జరుగుతుందనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది.
పేరెంట్స్ ప్రవర్తన
పిల్లలు మన మాట కంటే మన ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తారు. అనుకరిస్తారు కూడా. మనం కోపంగా మాట్లాడితే వాళ్లు కూడా అలాగే స్పందిస్తారు. మనం గౌరవంగా మాట్లాడితే వాళ్లు కూడా అదే శైలిలో ప్రవర్తిస్తారు. మనం పిల్లలకు “మొబైల్ వాడొద్దు” అని చెప్పి.. మనం ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉంటే వాళ్లు దాన్ని సీరియస్‌గా తీసుకోరు. పిల్లలు పేరెంట్స్ ని చూసే చాలా విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.
సమయం గడపడం
చాలామంది తల్లిదండ్రులు బిజీగా ఉండి పిల్లలతో సరైన సమయం గడపరు. దానివల్ల వారి మాట మనం ఎందుకు వినాలనే భావన పిల్లల్లో పెరిగిపోతుంది. కాబట్టి ప్రతిరోజూ కొంత సమయాన్ని పిల్లలతో గడపాలి. వారితో మాట్లాడటం, ఆటల్లో పాల్గొనడం వంటి వాటివల్ల వారిలో మన పట్ల ప్రేమ పెరుగుతుంది. బంధం బలపడుతుంది. ఆ బంధమే మాట వినేలా చేస్తుంది.