Parenting: పిల్లల పెంపకంలో కామన్ గా పేరెంట్స్ చేసే తప్పు ఇదే
Parenting: పిల్లలు తప్పు చేసినప్పుడు అరవడం, కొట్టడం సరైన మార్గమా? ఈ విధానాలు నిజంగా పిల్లల ప్రవర్తనను మార్చుతాయా? లేక వారి మనసుపై చెడు ప్రభావం చూపుతాయా? నిపుణులు హెచ్చరిస్తున్న కొన్ని కీలక విషయాలు తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి.

పిల్లల్ని శిక్షించడం వల్ల నిజంగా మార్పు వస్తుందా?
పిల్లలు మంచిగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. మాట వినాలి, అల్లరి చేయకూడదు, బాధ్యతగా ఉండాలని ఆశిస్తారు. కానీ పిల్లలు తప్పు చేసినప్పుడు చాలామంది వెంటనే కోప్పడతారు. తిట్టడం, అరవడం, చిరాకు పడటం, కొట్టడం వంటివి చేస్తారు. ఆ సమయంలో పిల్లలు భయపడి కామ్ అయిపోతారు. కానీ ఇలా పదే పదే తిట్టడం, కొట్టడం వల్ల పిల్లల్లో తల్లిదండ్రులపై ఉన్న గౌరవం తగ్గి, లోపల ద్వేషం పెరుగుతుంది. ఏం చేసినా తిడతారన్న భయం వల్ల పిల్లలు ఇంట్లో చెప్పడం మానేస్తారు. ఎదిగే కొద్దీ తల్లిదండ్రులపై కోపం పెంచుకుంటారు. ఈ విధానం పిల్లలకే కాదు, తల్లిదండ్రులకు కూడా నష్టమే.
అరవడం వల్ల పిల్లలపై వచ్చే ప్రభావం
ప్రతి చిన్న విషయానికీ పిల్లలపై అరవకూడదు. తప్పు చేస్తే ప్రేమగా, అర్థమయ్యేలా చెప్పాలి. పది మందిముందు తిట్టకుండా, ఇంటికి పిలిచి నచ్చచెప్పాలి. పక్కింటి పిల్లలతో పోల్చి తిట్టడం పెద్ద తప్పు. పిల్లలపై అరవడం వల్ల వాళ్లు భయపడతారు. ఏం చేసినా అమ్మా నాన్న కోపపడతారు.. అనే భావన వాళ్లలో ఏర్పడుతుంది. అప్పుడు తమ సమస్యలు చెప్పడం మానేస్తారు. ప్రశ్నలు అడగరు. నెమ్మదిగా తల్లిదండ్రులతో దూరం పెరుగుతుంది.
కట్టడి చేస్తే ఏమవుతుంది?
ఇప్పటి పిల్లలకు టీవీ, ఫోన్ అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు చూస్తే పెద్దగా సమస్య లేదు. కానీ ఎక్కువైతే దూరం చేయాలి. అంతేగానీ గట్టిగా శాసించకూడదు. ఎక్కువగా కట్టడి చేస్తే పిల్లలు తమను బలవంతంగా కట్టడిచేస్తున్నారని భావిస్తారు. అప్పుడు మాట వినడం కాదు, ఎదురు తిరగడం మొదలుపెడతారు.
కొట్టడం మరీ ప్రమాదకరం
తప్పు చేశారని పిల్లలను కొట్టకూడదు. కొడితే ఆ తప్పు ఆ క్షణంలో ఆగిపోవచ్చు. కానీ భయం మాత్రం పెరుగుతుంది. తప్పు ఎందుకు తప్పో పిల్లలకు అర్థం కాదు. శిక్ష వల్ల పిల్లల్లో భయం, కోపం, ఆందోళన పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
మాటలతో గాయపరచడం కూడా శిక్షే
నువ్వు పనికిరావు, నీ వల్ల ఏం కాదు, నువ్వు సొమరివి..వంటి మాటలు పిల్లల మనసులో గాయాల్లా మిగిలిపోతాయి. వాళ్లు తమపై నమ్మకం కోల్పోతారు. కొంతమంది పిల్లలు ప్రయత్నించడమే మానేస్తారు. మరికొందరు తమ బాధను లోపలే దాచుకుంటారు. రోజూ ఒకటే మాటలు చెప్పడం వల్ల పిల్లలు వినడం కూడా మానేస్తారు.
పరిశోధనలు ఏమంటున్నాయి?
పిల్లలపై కఠినంగా వ్యవహరించడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అరవడం, కొట్టడం, తిట్టడం వంటి విధానాలు పిల్లల భవిష్యత్తుకు మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి పిల్లల్ని ఎలా మార్చాలి?
పిల్లలను శిక్షతో కాదు, అర్థం చేసుకుని చెప్పాలి. తప్పు చేసినా ప్రేమ తగ్గదని వాళ్లకు తెలియజేయాలి. తప్పు వల్ల వచ్చే నష్టాన్ని అర్థమయ్యేలా వివరించాలి. పిల్లల పెంపకంలో శిక్ష కంటే సహనం ముఖ్యం. ఏది మంచిదో, ఏది చెడ్డదో ఓపికగా చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

