పిల్లలకు హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలు ఏంటో తెలుసా?
గుండె సమస్యలు ఒకప్పుడు పెద్దవాళ్లలో మాత్రమే చూసేవాళ్లం. కానీ గత కొన్నేళ్లుగా పిల్లల్లో కూడా బాగా పెరిగిపోయాయి. అసలు పిల్లలకు హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

పిల్లలకు హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలు
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలలో కూడా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వారి ఆహార అలవాట్లు, జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం, జన్యు లక్షణాలు వంటి అనేక కారణాల వల్ల గుండె సమస్యలు పెరుగుతున్నాయి. అధిక చక్కెర, వేయించిన ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తరచుగా తీసుకోవడం వల్ల కూడా పిల్లల గుండె రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది.
శారీరక వ్యాయామం లేకపోవడం
పిల్లలు ఎక్కువగా టీవీ, మొబైల్, వీడియో గేమ్స్ లో గడపడం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లల్లో చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బరువు పెరుగుతారు. అధిక బరువు గుండె సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు బయట వాతావరణంలో ఆడుకోవడం, ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు.
జన్యు సమస్యలు
జన్యు పరమైన కారణాలు కూడా చిన్న వయసులో హార్ట్ ఎటాక్ రావడానికి దారితీస్తాయి. కుటుంబ చరిత్రలో గుండె సమస్యలు ఉన్నా.. పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె కండరాల లోపాల వంటివి జన్యు లక్షణాల కారణంగా రావచ్చు. కాబట్టి తల్లిదండ్రులు అలాంటి పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలి.
మానసిక ఒత్తిడి
కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కూడా హార్ట్ ఎటాక్ రిస్క్ ను పెంచుతుంది. చిన్న వయసులోనే ఎక్కువ ఒత్తిడి చేయడం, స్కూల్ ప్రెషర్, పోటీ, మానసిక ఆందోళన గుండె క్షీణతలకు దారితీస్తాయి. స్కూల్ నుంచి రాగానే హోం వర్క్ చేయమని ప్రెషర్ చేయడం, పిల్లలు ఆడుకునే సమయాన్ని ట్యూషన్ ల కోసం కేటాయించడం, బాగా చదవమని ఒత్తిడి చేయడం, ఎక్కువ బరువున్న స్కూల్ బ్యాగ్స్ మోయడం, లంచ్ బాక్స్ లో ఎక్కువగా వేయించిన ఆహారాలు పెట్టడం వంటివి పిల్లలకు గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిపుణుల ప్రకారం పిల్లలకు హార్ట్ ఎటాక్ రాకుండా నిరోధించడానికి తల్లిదండ్రులు పోషకాహారం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, శారీరక వ్యాయామం, మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. పిల్లలకు కూరగాయలు, పండ్లు, తక్కువ ఫ్యాట్, తక్కువ చక్కెర ఉన్న ఆహారాలు, పప్పులు వంటి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. వేయించిన, ప్రాసెస్డ్ ఫుడ్ ను తగ్గించడం మంచిది. ప్రతి రోజు కనీసం 30–45 నిమిషాలు వాకింగ్ లేదా ఆటల కోసం కేటాయించడం ఉత్తమం.

