Gold: భూమి తవ్వుతున్నప్పుడు బంగారం దొరికితే అది ఎవరి సొంతమవుతుంది? చట్టంలో ట్విస్ట్
పాత ఇంటిలో నిధి దొరికింది, పొలం తవ్వుతున్నప్పుడు బంగారం బయటపడింది. ఇలాంటి వాటి గురించి ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. అయితే ఇలా దొరికిన బంగారంపై ఎవరికి హక్కులు ఉంటాయి.? అసలు చట్టం ఏం చెబుతోంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Gold
'పలానా వాళ్ల ఇంట్లో నిధి ఉందంటా. పాత ఇంటిని కూల్చుతున్న సమయంలో బంగారం బయటపడిందంటా, దీంతో రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారంటా'.. ఇలాంటివి మనం జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కథలు ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి. ఇందులో నిజమెంత ఉంటుందో కానీ వినడానికి మాత్రం చాలా బాగుంటాయి.
Gold Mine
అయితే భూమిలో నిధి లేదా బంగారం దొరికితే అది దొరికిక వ్యక్తికి చెల్లదని మీకు తెలుసా.? అది మీ ఇంట్లో అయినా సరే ఆ బంగారంపై మీకు ఎలాంటి హక్కులు ఉండవు. నిజానికి భారతదేశంలో నిధి కోసం తవ్వడం చట్టవిరుద్ధం. దీనికి సంబంధించి 1960లో ఒక చట్టం చేశారు. దీని ప్రకారం భారత పురావస్తు శాఖ తవ్వకంపై పూర్తి హక్కును కలిగి ఉంటుంది. భూమి తవ్వుతున్నప్పుడు బంగారం దొరికితే, ఆ భూమి యజమాని ఎవరు అనే దానితో సంబంధం లేకుండా అది ప్రభుత్వానికి చెందుతుంది.
భూమి తవ్వుతున్నప్పుడు నిధి లేదా బంగారం దొరికితే.. 1971లో రూపొందించిన ట్రెజర్ యాక్ట్ కింద చర్య తీసుకుంటారు. ఈ చట్టం ప్రకారం నిధిని కనుగొన్న వ్యక్తి దాని గురించి పోలీసులకు లేదా అధికారులకు తెలియజేయాలి. ఆ తర్వాత అధికారులు దానిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. ఒకవేళ ఆ వస్తువుకు ఏదైనా పురావస్తు ప్రాముఖ్యత కలిగి ఉంటే, దానిని అధ్యయనం కోసం పురావస్తు శాఖకు పంపుతారు.
అయితే భూమిలో లభ్యమైన బంగారం లేదా ఏదైనా వస్తువు తనదేనని కోర్టులో నిరూపించుకోగలిగితే ఆ వ్యక్తికి బంగారం చెందుతుంది. ఒకవేళ తవ్వకాల్లో బంగారం దొరికిన విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేయకపోతే.. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అరెస్టు చేయవచ్చు. మీపై కేసు కూడా నమోదవుతుంది. దీని ప్రకారం.. 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.