సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? భార్య, పిల్లలు ఏం చేస్తారో తెలుసా?
భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ది చాలా సింపుల్ కుటుంబం. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా?

CJI జస్టిస్ సూర్య కాంత్ ప్రమాణస్వీకారం
CJI Justice Surya Kant : జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు (నవంబర్ 24, సోమవారం) భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా ప్రత్యేకంగా జరిగింది. మొదటిసారిగా బ్రెజిల్, కెన్యా, మలేషియా, మారిషస్, భూటాన్, శ్రీలంక, నేపాల్ దేశాల సీజేఐలు తమ ప్రతినిధి బృందాలతో హాజరయ్యారు.
సీజేఐ బీఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఆయన ఫిబ్రవరి 9, 2027 వరకు అంటే 14 నెలల పాటు ఉంటారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ జస్టిస్ సూర్యకాంత్ కుటుంబం గురించి చర్చ జరుగుతోంది. ఆయన భార్య, కుమార్తెలు ఏం చేస్తారో తెలుసుకుందాం...
సీజేఐ సూర్యకాంత్ భార్య, కుమార్తెలు ఏం చేస్తారు?
జస్టిస్ సూర్యకాంత్ భార్య సవితా సూర్యకాంత్ విద్యా రంగానికి చెందినవారు. ఆమె ఓ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు ముగ్ద, కనుప్రియ. ఇద్దరూ ఇంకా చదువుకుంటున్నారు… పబ్లిక్ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు.
సీజేఐ సూర్యకాంత్ కుటుంబం
జస్టిస్ సూర్యకాంత్ స్వస్థలం హర్యానాలోని హిసార్ జిల్లా పెట్వాడ్ గ్రామం. జస్టిస్ సూర్యకాంత్ సోదరులు రిషికాంత్, శివకాంత్, దేవకాంత్… వీళ్లంతా వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. సిజెఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భార్యాబిడ్డలతో పాటు సోదరులు, వారి కుటుంబసభ్యులు మొత్తం హాజరయ్యారు.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తండ్రి ఎవరు?
ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి హర్యానా వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్. ఆయన ఫిబ్రవరి 10, 1962న హిసార్‌లోని పెట్వాడ్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక ఉపాధ్యాయుడు. జస్టిస్ సూర్యకాంత్ ప్రాథమిక విద్య స్వస్థలంలోనే సాగింది.
1984లో రోహ్ తక్ లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది, హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ కోసం చండీగఢ్ వెళ్లారు. 38 ఏళ్ల వయసులోనే హర్యానా అడ్వకేట్ జనరల్ అయ్యారు. 2004లో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ కెరీర్
14 ఏళ్లు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత, అక్టోబర్ 2018లో జస్టిస్ సూర్యకాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు, ఇప్పుడు దేశ ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత బాధ్యతలు స్వీకరించారు.

