బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఢాకా ట్రిబ్యునల్… ఆమెకు మరణశిక్ష విధించింది. జూలై 2024 తిరుగుబాటు సమయంలో విద్యార్థి నిరసనకారులపై జరిగిన హింసాత్మక అణిచివేతకు ఆమే బాధ్యురాలిగా ఈ తీర్పులో పేర్కొంది.

బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఢాకా ట్రిబ్యునల్ సోమవారం (నవంబర్ 17) దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. జూలై 2024లో జరిగిన తిరుగుబాటు సమయంలో క్రూరమైన అణిచివేతకు ఆమెనే బాధ్యురాలిగా పేర్కొంది. ఈ తిరుగుబాటే చివరికి ఆమెను పదవి నుంచి దిగిపోయేలా చేసింది… ఇప్పుడు మరణశిక్షకు కారణమయ్యింది. 

జస్టిస్ ఎండీ గోలం మోర్తుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT), తమ 453 పేజీల తీర్పును గంటల తరబడి చదివి వినిపించింది. పదిహేనేళ్లకు పైగా బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించిన 78 ఏళ్ల నాయకురాలిపై వచ్చిన అత్యంత తీవ్రమైన చట్టపరమైన అభియోగంగా ఈ పత్రం నిలిచిపోయింది.

453 పేజీలలో కోర్టు తీర్పు..

ఢాకా ట్రిబ్యునల్ తీర్పు ఇలా ఉంది. బంగ్లాదేశ్ లో ఇటీవల నెల రోజుల పాటు జరిగిన అశాంతిలో సుమారు 1,400 మంది మరణించారు... 24,000 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది జవాబుదారీతనం, సంస్కరణలు కోరిన విద్యార్థులే. ఈ మరణాలు అనుకోకుండా జరిగినవి కావని, పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల ఫలితమేనని న్యాయమూర్తులు అభివర్ణించారు.

జనాన్ని చెదరగొట్టడానికి హసీనా ప్రభుత్వం తుపాకులు, తూటాలు, చివరికి హెలికాప్టర్ ఆపరేషన్లను కూడా ఉపయోగించిందని వారు ఆరోపించారు. ఈ పద్ధతులు ప్రజాందోళనల అణిచివేత కంటే యుద్ధ సమయంలో అణచివేతను గుర్తుకు తెచ్చాయని అన్నారు. నిరసనకారులపై హెలికాప్టర్ల వాడకానికి హసీనా ఆమోదం తెలిపినట్లుగా ఆమెకు, దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ఒక న్యాయమూర్తి ఉదహరించారు.

'దేశ ద్రోహులు': ఈ మాటలే అగ్గి రాజేశాయా? 

ఈ తీర్పు హసీనా బహిరంగ వ్యాఖ్యలపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టింది. నిరసనలు ఉధృతంగా ఉన్నప్పుడు ఆమె చేసిన 'రజాకార్' వ్యాఖ్య ఉద్రిక్తతలను మరింత పెంచిందని తీర్పులో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు అసమ్మతివాదులు కేవలం విమర్శకులు కాదు "దేశ ద్రోహులు" అనే సంకేతాన్ని పంపాయని న్యాయమూర్తులు అన్నారు. ఇది క్షేత్రస్థాయిలో భద్రతా దళాలు ఉపయోగించిన దూకుడు వ్యూహాలను చట్టబద్ధం చేసిందని వారు వాదించారు. జూలై 14న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థి నిరసనకారులను కించపరిచేలా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఆ తర్వాత జరిగిన హింసకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.

ఒకరు పరారీ, మరొకరు అజ్ఞాతం, ఇంకొకరు అప్రూవర్

ఛార్జ్ షీట్‌లో హసీనా పేరు మాత్రమే లేదు. మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌పై కూడా ఈ అణిచివేతకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పరారీలో ఉన్నట్లు ప్రకటించబడిన హసీనా, కమల్‌లపై వారి హాజరు లేకుండానే విచారణ జరిగింది. మామున్ మొదట విచారణను ఎదుర్కొన్నా, తర్వాత అప్రూవర్‌గా మారి సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం అణిచివేత సమయంలో పైనుంచి వచ్చిన ఆదేశాల గురించి క్లారిటీ ఇచ్చిందని కోర్టు చెప్పింది. చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తాజుల్ ఇస్లాం, ఈ హింసకు హసీనానే "మాస్టర్‌మైండ్, ప్రధాన సూత్రధారి" అని అభివర్ణించారు.

భయం, నష్టం గురించి మాట్లాడిన సాక్షులు

28 పనిదినాలకు పైగా ట్రిబ్యునల్ 54 మంది సాక్షులను విచారించింది. వారిలో తుపాకీ కాల్పుల నుంచి తప్పించుకున్న విద్యార్థులు, పిల్లలను కోల్పోయిన కుటుంబాలు, వరుసగా గాయపడిన వారికి చికిత్స చేసిన వైద్యులు, అణిచివేత సమయంలో తాము ఎదుర్కొన్న ఒత్తిడిని వివరించిన అధికారులు కూడా ఉన్నారు. చాలా మందికి, ఈ తీర్పు వారి బాధకు లభించిన మొదటి అధికారిక గుర్తింపు.

సందిగ్ధంలో దేశం

ఆగస్టు 5, 2024న తన ప్రభుత్వం కూలిపోవడానికి కొన్ని గంటల ముందు హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. అప్పటి నుంచి ఆమె భారతదేశంలో నివసిస్తున్నారు. కమల్ కూడా అక్కడే ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తున్నారు. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఆమెను అప్పగించాలని అధికారికంగా కోరింది, కానీ న్యూఢిల్లీ ఇంకా స్పందించలేదు.

ఇదిలా ఉండగా ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని ఆమె మద్దతుదారులు పట్టుబడుతున్నారు. అయితే ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. తమ తీర్పు సాక్ష్యాలు, వాంగ్మూలాలు, దాఖలైన హింస తీవ్రతపై ఆధారపడి ఉందని చెప్పింది.

భద్రత కట్టుదిట్టం, ఢాకాలో ఉద్రిక్తత

తీర్పు వెలువడినప్పుడు ఢాకాలో అశాంతి నెలకొనే అవకాశాలున్నాయని నగర పోలీస్ కమిషనర షేక్ ఎండీ సజ్జత్ అలీ పేర్కొన్నారు. అందుకే హింస, దహనం, లేదా పోలీసులపై దాడులకు పాల్పడే వారిపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు.