IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు
IMD Weather Update : హిమాలయా ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు, హిమపాతం ఉంటుంది.. వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

మళ్లీ వర్షాలు షురూ..
Weather Update : ప్రస్తుతం కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేవలం వర్షాకాలంలోనే కాదు శీతాకాలంలోనూ వానలు పడ్డాయి... వేసవికాలం ఆరంభంలోనూ కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చలికాలం ముగిసి ఎండాకాలం ఆరంభం కానుంది... ఈ సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇవి మెళ్లిగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హిమాలయ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది.. దీని ప్రభావంతోనే ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ లలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ఇలా ఉత్తరాది రాష్ట్రాలను వానలు పలకరించనున్నాయి... దీంతో చలి తీవ్రత తగ్గి ఆహ్లాదకర వాతావరణం నెలకొంటోంది.
డిల్లీలో వర్షాలు
దేశ రాజధాని డిల్లీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వర్షాల కారణంగా వాయుకాలుష్యంతో సతమతం అవుతున్న డిల్లీ వాసులకు కాస్త ఊరట లభించనుంది. గాలిలో తేమ పెరగడంతో కాలుష్యం తగ్గనుంది. అయితే ఈ తేలికపాటి వర్షాలు జనవరి 26న కూడా కొనసాగే అవకాశాలున్నాయట... ఇదే జరిగితే రిపబ్లిక్ డే వేడుకలకు ఆటంకం కలుగుతుంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఆహ్లాదకర వాతావరణం
ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో పొడి వాతావరణం తగ్గి తడి వాతావరణం కొనసాగుతోంది. కొన్నిరాష్ట్రాల్లో వర్షాలు, మరికొన్ని రాష్ట్రాల్లో హిమపాతం నమోదవుతోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, డిల్లీలో అక్కడక్కడ మంచు కురుస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించాలని భావించేవారికి... మరీముఖ్యంగా హిల్ స్టేషన్స్ ని సందర్శించాలనుకుంటే ఇది మంచి సమయం. ఈ నెల చివరివరకు ఇదే పరిస్ధితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
తెలంగాణ వాతావరణం..
తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి... దీంతో చలితీవ్రత బాగా తగ్గుతోంది. ప్రస్తుతం ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీలు... మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్ లో చలిగాలులు కొనసాగుతున్నాయి... ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్ఫ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా చలి కొనసాగుతోంది... దీనికి తోడు దట్టమైన పొగమంచు కురుస్తోంది. మరికొద్ది రోజులు ఏపీలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.

