- Home
- Andhra Pradesh
- IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
IMD Fog Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గింది… కానీ దట్టమైన పొగమంచు కురుస్తోంది. కొన్ని జిల్లాల్లో అయితే మంచు తుపాను స్థాయిలో పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు రాత్రుళ్లు, ఉదయం వేళలో ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నాారు.

పొగమంచుతో తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం
IMD Weather Update : ప్రస్తుతం అధికపీడనం కొనసాగుతోందని... దీని ప్రభావంతో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు ఉత్తరాది నుండి చలిగాలులు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి... దట్టమైన పొగమంచు కురుస్తోందని తెలిపింది. మరికొద్దిరోజులు ఈ చలిగాలులు, పొగమంచు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఏపీలో దట్టమైన పొగమంచు
పొగమంచు కారణంగా హైవేలపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది... విజిబిలిటీ 300 మీటర్లకు పడిపోయింది. సంక్రాంతి పండగ తర్వాత తిరుగుప్రయాణాలు ఇంకా కొనసాగుతుండటంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఉదయం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక పొగమంచు కారణంగా ఉదయంవేళలో పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ తెలంగాణ జిల్లాల్లో పొగమంచు
తెలంగాణలో కూడా ప్రస్తుతం దట్టమైన పొగమంచు కురుస్తోంది... ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, హన్మకొండ, జనగాం, సూర్యాపేట జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని ప్రాంతాలకు పొగమంచు వ్యాపించే అవకాశాలున్నాయని... కొద్దిరోజులు ఇదే వాతావరణ పరిస్ధితి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణలో తగ్గిన చలి
ఇక తెలంగాణలో చలి బాగా తగ్గింది. గతంలో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదైన ఆదిలాబాద్ 13.7, మెదక్ లో 13.8 డిగ్రీలే ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలు. ఇక రామగుండంలో 15.6, హన్మకొండలో 16, మహబూబ్ నగర్ లో 17, నల్గొండలో 17.4, నిజామాబాద్ లో 17.2, భద్రాచలంలో 18.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ లోనే 33.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ విషయానికి వస్తే సగటు అత్యల్ప ఉష్ణోగ్రత 17.5 గా ఉంది. ప్రాంతాలవారిగా చూసుకుంటే రాజేంద్ర నగర్ లో అత్యల్పంగా 13.5, హయత్ నగర్ లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హకీంపేటలో 15.2, పటాన్ చెరులో 15, దుండిగల్ లో 16.4, బేగంపేటలో 17.5 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. అత్యధికంగా బేగంపేటలో 31.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

