Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం
Viral News: ఒకప్పుడు విదేశాల్లో విడాకులు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు భారత్‌లో కూడా ఇది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే పెరుగుతోన్న విడాకుల నేపథ్యంలో బెంగళూరుకు చెందిన పండితులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆలయానికి సమస్యగా విడాకుల కేసులు
బెంగళూరులోని హలసూరు ప్రాంతం చోళ కాలానికి చెందిన సోమేశ్వర ఆలయం. ఎన్నో ఏళ్లుగా హిందూ పెళ్లిళ్లకు పవిత్ర స్థలంగా పేరుగాంచింది. ఇక్కడ రోజూ అనేక జంటలు శివుడి సాక్షిగా వివాహం చేసుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో విడాకుల కేసులు పెరుగడంతో పరిస్థితి మారిపోయింది. జంటల మధ్య మొదలైన తగాదాలు కోర్టు విచారణకు ఆలయ పండితులను సాక్షులుగా పిలవటం వరకు వెళ్లాయి. రెండు సంవత్సరాల్లో 50 కంటే ఎక్కువ కేసుల్లో ఆలయ పండితులు హాజరయ్యారు. ఇది పెద్ద సమస్యగా మారింది.
ఆలయ ప్రతిష్ఠపై ప్రభావం
పలువురు యువ జంటలు ఇళ్లనుంచి పారిపోయి.. తప్పుడు పత్రాలు చూపించి ఆలయంలో పెళ్లి చేసుకునే ఘటనలు పెరిగాయి. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆలయానికి వచ్చి పండితులతో వాదించడం, పోలీసులకు ఫిర్యాదం చేస్తున్నారు. దీంతో ఆలయం ప్రతిష్ఠ దెబ్బతింది. “సరైన పరిశీలన లేకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు” అని ఆరోపణలు ఎక్కువయ్యాయి.
శతాబ్దాల పెళ్లి సంప్రదాయానికి సవాల్
చోళ కాలంలో నిర్మించిన ఈ ఆలయం బెంగళూరులో వివాహాలకి అతి ముఖ్యమైన స్థలం. గోపురం కింద జరిగే వైదిక పెళ్లి ఎంతో ప్రత్యేకం. అయితే విడాకుల కేసులు పెరగడం వల్ల ఈ సంప్రదాయం సమస్యలో పడింది. ఆలయ అధికారులు: “పండితులకు వచ్చే చట్టపరమైన ఇబ్బందులు తగ్గించేందుకు పెళ్లిళ్లు తాత్కాలికంగా నిలిపివేశాం” అని స్పష్టంచేశారు.
మళ్లీ పెళ్లిళ్లు జరుగుతాయా?
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది శాశ్వత నిర్ణయం కాదు. పరిస్థితి సాధారణమైతే కొత్త నిబంధనలతో తిరిగి పెళ్లిళ్లు ప్రారంభించే అవకాశం ఉంది. దక్షిణ భారతంలో ఆలయాల్లో పెళ్లి చేసుకోవటం శుభంగా భావిస్తారు. అందుకే కుటుంబాలు భారీ హాళ్ల కంటే ఆలయాలనే ఇష్టపడుతుంటాయి. కానీ చట్టపరమైన సమస్యలు పెరగడంతో ఆలయం కొంతకాలం విరామం తీసుకోవాల్సి వచ్చింది.
పెరుగుతున్న విడాకులు దేనికి సంకేతం.?
ఇది ఒక ఆలయం నిర్ణయం మాత్రమే కాదు. సమాజంలో మారుతున్న ఆలోచనలు, సంబంధాల్లో అస్థిరత, ఇంటి నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకోవటం వంటి ఘటనలు పెరగటం వంటివన్నీ ధార్మిక సంస్థల పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. బెంగళూరు సోమేశ్వర ఆలయం ఈ మార్పులకు పెద్ద ఉదాహరణగా నిలిచింది.

