2026 జనవరి ఫస్ట్ వీక్ ఈ 10 టెంపుల్స్ కి వెళ్లారో.. అంతే సంగతి..?
మీరు ఇప్పటికే కొత్త సంవత్సరం 2026 ఆరంభంలో దైవ దర్శనం ప్లాన్ చేస్తుంటే, మళ్ళీ ఓసారి ఆలోచించుకోవాలి. దేశంలోని ఈ 10 దేవాలయాలకు ఫ్యామిలీతో వెళితే మాత్రం అంతే సంగతి…

ఈ దేవాలయాల్లో న్యూ ఇయర్ రద్దీ...
ప్రతి ఒక్కరూ తమ కొత్త సంవత్సరం దైవ దర్శనంతో మొదలవ్వాలని కోరుకుంటారు. అప్పుడే ఏడాదంతా బాగుంటుందని నమ్ముతారు. మీ ప్లాన్ కూడా ఇదే అయితే కాస్త ఆగండి. మీరు వెళ్లాలనుకుంటున్న పుణ్యక్షేత్రం గురించి ముందుగా కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే దేశంలోని 10 పెద్ద ఆలయాల్లో భక్తుల రద్దీ పోటెత్తుతోంది. కొన్ని ఆలయాలకు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. కొత్త సంవత్సరం సందర్భంగా దేశంలోని 10 పెద్ద ఆలయాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం...
1. ఉజ్జయిని ఆలయం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళి ఆలయానికి కొత్త ఏడాదిలో 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. దీనివల్ల డిసెంబర్ 27 నుంచి జనవరి 5 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. గతేడాది 8 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందని ఆలయ కమిటీ భావిస్తోంది.
2. కాశీ ఆలయం
ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో కాశీ విశ్వనాథ్ ఒకటి. ఈ మహాదేవుని నగరంలో కొత్త సంవత్సరం ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడ భక్తుల పొడవైన క్యూలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కొత్త ఏడాదిలో 4 నుంచి 5 లక్షల మంది భక్తులు రావొచ్చని అంచనా. అందుకే ఈ సమయంలో ఇక్కడికి వెళ్లడం మీకు ఇబ్బంది కలిగించవచ్చు.
3. అయోధ్య రామాలయం
కొత్త సంవత్సరం సందర్భంగా అయోధ్యలో హోటళ్లు, ధర్మశాలలు ఇప్పటికే బుక్ అయ్యాయి. డిసెంబర్ 31, జనవరి 1న సుమారు 2 లక్షల మంది భక్తులు రావొచ్చని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. వారమంతా కలిపి 8 నుంచి 10 లక్షల మంది రావొచ్చట. రాముడిని సులభంగా దర్శించుకోవాలంటే కొన్ని రోజుల తర్వాత అయోధ్యకు వెళ్లడం మంచిది.
4. మధురలో భక్తుల రద్దీ
మధుర-బృందావన్‌లో భక్తుల రద్దీ ఇప్పటికే పెరిగింది. దీనివల్ల జనవరి 5 వరకు ఇక్కడికి రావొద్దని స్థానిక యంత్రాంగం భక్తులను కోరింది. ఒక పుణ్యక్షేత్రానికి రావొద్దని యంత్రాంగం విజ్ఞప్తి చేయడం ఇదే తొలిసారి. ఇక్కడ అన్ని హోటళ్లు, ధర్మశాలలు ముందే బుక్ అయ్యాయి.
5. పూరి జగన్నాథ ఆలయం
ఒడిశాలోని జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇది హిందువుల 4 ధామాలలో ఒకటి. కొత్త ఏడాదిలో ఇక్కడ కూడా భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది. దీంతో స్థానిక యంత్రాంగం 60 ప్లాటూన్ల బలగాలను మోహరించాలని నిర్ణయించింది. శ్రీమందిర ప్రాంగణం నుంచి సముద్ర తీరం వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
6. ఖాటు శ్యామ్ ఆలయం
రాజస్థాన్‌లోని సికర్‌లో ఉన్న ఖాటుశ్యామ్ ఆలయంలో ఇప్పటి నుంచే భక్తుల పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. భారీ రద్దీ కారణంగా జనవరి 5 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. భక్తులందరూ సాధారణ క్యూలోనే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ 30 లక్షలకు పైగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
7. ఓంకారేశ్వర ఆలయం
మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి కొత్త ఏడాదికి ముందే భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం పొడవైన క్యూలు ఉన్నాయి. ఇండోర్ మార్గంలోని మోర్టక్కా వంతెన వరకు వాహనాల క్యూలతో పదేపదే ట్రాఫిక్ జామ్ అవుతోంది. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ వారం రోజుల పాటు ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేశారు.
8. షిరిడి
కొత్త సంవత్సరం సందర్భంగా మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. దీనివల్ల డిసెంబర్ 31న రాత్రి కూడా ఆలయం దర్శనాల కోసం తెరిచి ఉంటుందని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇక్కడ సాయిబాబా దర్శనం కోసం బంగారు కిటికీని ఏర్పాటు చేశారు.
9. తిరుమల తిరుపతి ఆలయం
కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయ దర్శనం ప్లాన్ చేస్తుంటే, మీరు మళ్ళీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న చెల్లుబాటు అయ్యే టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. ఇప్పటికే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వారా దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ రద్దీ జనవరి ఫస్ట్ వీక్ వరకు కొనసాగనుంది.
10. వైష్ణో దేవి ఆలయం
కొత్త సంవత్సరం సందర్భంగా వైష్ణో దేవి ఆలయ దర్శనానికి నిబంధనలు మరింత కఠినతరం చేశారు. దర్శనం కోసం మీ దగ్గర రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డ్ తప్పనిసరి. ఈ కార్డ్ జారీ అయిన 10 గంటల్లోపు యాత్ర ప్రారంభించి, 24 గంటల్లో తిరిగి రావాలి. దీనివల్ల మీరు ఇక్కడ ఎక్కువ సమయం గడపలేరు.

