సామాన్యులకు బిగ్ రిలీఫ్.. టమాట ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
Tomato Prices: టమాట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో ధర ఏకంగా రూ. 80కి చేరింది. దీంతో మార్కెట్లో టమాటను చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే టమాట ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భారీగా పెరిగిన టమాట ధర
టమాటా ధరలు దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెరిగి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సాధారణంగా అందుబాటులో ఉన్న టమాట, ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కన్స్యూమర్ అఫైర్స్ శాఖ తాజా గణాంకాల ప్రకారం, నవంబర్ 26 నాటికి టమాట రిటైల్ ధర కిలోకు సగటుగా రూ. 52.87. ఒక నెల క్రితం ఇది రూ. 37 ఉండగా, కేవలం 30 రోజుల్లోనే 43 శాతం పెరిగినట్టు కనిపిస్తోంది.
దక్షిణం – ఉత్తరం ధరల్లో భారీ తేడా
ఉత్పత్తి ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా రేట్లు కొంత స్థిరంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కిలో టమాటా సుమారు రూ. 31, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 38. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి భిన్నంగా ఉంది. అండమాన్–నికోబార్‌లో రూ. 96, మిజోరాంలో రూ. 92, ఢిల్లీలో రూ. 80, మణిపూర్‌లో రూ. 78, సిక్కింలో రూ. 71గా ఉంది.
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ మరింత ఎక్కువ
డిమాండ్ పెరగడంతో ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లలో ధరలు మరింత ఎక్కువయ్యాయి. ఢిల్లీలో బ్లింకిట్‌లో టమాటా కిలో రూ. 110, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రూ. 96, జెప్టోలో రూ. 92కి వెళ్లాయి. ప్రజలపై పడుతున్న ఈ అదనపు భారం తగ్గించేందుకు NCCF కొన్ని ప్రాంతాల్లో రాయితీ ధరలకు టమాటాలు అందించడం ప్రారంభించింది.
ఢిల్లీలో రాయితీ టమాటాలు
దేశ రాజధానిలో ధరలు అదుపుతప్పడంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రవేశించింది. NCCF ద్వారా "జనతా బ్రాండ్" పేరుతో కిలోను రూ. 52కి టమాటాలను అమ్మాలని నిర్ణయించారు. డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ఈ చర్య చేపట్టబడింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గత నెలలో వచ్చిన మొంథా తుపాను. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి టమాటా ఉత్పత్తి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పంటకు భారీ నష్టం జరగడంతో మార్కెట్‌లో సరఫరా తీవ్రంగా తగ్గింది. ఢిల్లీలో అనేక మార్కెట్లలో ధరలు రూ. 80 దాటడానికి ఇది కారణమైంది.
త్వరలో ఇతర రాష్ట్రాలకూ..
హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో సరఫరా తగ్గడంతో టోకు, రిటైల్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. దీనికి పరిష్కారంగా ఢిల్లితో ప్రారంభించిన రాయితీ అమ్మకాలను త్వరలో మరిన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో కొరత ఎక్కువగా ఉండే ఆగస్టు–అక్టోబర్ సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కానీ ఈసారి నవంబర్‌లోనే తక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

