- Home
- Andhra Pradesh
- మరోసారి మొంథాలాంటి తుపాను, ఈసారి దిత్వా పేరుతో అరాచకం.. వచ్చే 4 రోజులు అత్యంత భారీ వర్షాలు
మరోసారి మొంథాలాంటి తుపాను, ఈసారి దిత్వా పేరుతో అరాచకం.. వచ్చే 4 రోజులు అత్యంత భారీ వర్షాలు
Rain Alert: మొంథా తుపాను తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇప్పుడు మరోసారి ఇలాంటి ఓ తుపాను ముంచుకొస్తుంది. దిత్వాగా నామకరణం చేసిన ఈ తుపానుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో నాలుగు రోజులు వర్షాలు
అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక తీర ప్రాంతంలో ‘దిత్వా’ తుఫాన్ కొనసాగుతుండటంతో నేటి నుంచి వచ్చే నాలుగు రోజుల వరకూ పలుచోట్ల జల్లులు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. తుపాను దిశ, తీవ్రతను పరిశీలించినప్పుడు సమీప జిల్లాల్లో గాలి వేగం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏ రోజు ఎక్కడ వర్షం పడనుందంటే.?
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.
ఈ రోజు (శుక్రవారం): నెల్లూరు, తిరుపతి పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శనివారం: తిరుపతి, అనన్తపురం, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం: వైఎస్సార్ కడప, పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడవచ్చు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వాన కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సోమవారం: గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు ప్రమాద సూచికలు ప్రకటించారు. నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కొనసాగే అవకాశం ఉంది.
వర్షాలతో పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైతుల్లో ఆందోళన
దిత్వా తుఫాన్ రైతుల్లో ఆందోళను పెంచుతోంది. శనివారం నుంచి సోమవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలియడంతో.. కోతల్లో ఉన్న పంట దృష్ట్యా రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, గోదావరి ప్రదేశాల్లో భారీగా వరి కోత, నూర్పు పనులు జరుగుతున్నాయి. చాలా మంది రైతులు ధాన్యాన్ని రోడ్ల పక్కన, పొలాల్లో, ఆరుబయట ఆరబెట్టారు. ఈ సమయంలో వర్షం కురిస్తే ధాన్యం తడిసిపోయి నాణ్యత తగ్గిపోతుందని రైతులు భయపడుతున్నారు.
టార్పాలిన్, గన్నీ బ్యాగుల కొరత
వర్షం ముందుగానే హెచ్చరికలు వచ్చినప్పటికీ పాడు ప్రాంతాల్లో టార్పాలిన్ పంపిణీ సరిగా జరగలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పలువురు రైతులు గన్నీ బ్యాగులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. మొంథా తుఫాన్ సమయంలో కోస్తా ప్రాంతాల్లో భారీగా నష్టం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త తుపాను దూసుకువస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పౌరసరఫరాల శాఖ హామీ
ఈ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఉన్నా ఇప్పటివరకు 8.22 లక్షల టన్నులే కొనుగోలు అయ్యాయి. దీనిని అవకాశంగా చూసిన మిల్లర్లు సిండికేట్ ఏర్పరుచుకుని దళారుల ద్వారా రైతులకు తక్కువ ధరలు చూపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ ప్రకటనలో, ఈ-క్రాప్‌లో నమోదు ఉన్న ప్రతి రైతు నుంచి మద్ధతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ధరకు ధాన్యం ఇవ్వవద్దని రైతులకు సూచించారు.

