Telangana Rains : జూన్ కథ కంచికి చేరినట్లే... ఆశలన్నీ జూలైపైనే
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు జూన్ లో వర్షాలపై ఆశలు వదిలేసుకున్నట్లే… ఈ నెల కథ కంచికి చేరినట్లే. ఇక జూలైలో కురిసే వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు.

జూన్ లో వర్షాల సంగతి అంతే...
Telugu States Weather Updates :తెలుగు రాష్ట్రాల ప్రజలు నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు... అయినా వర్షాల జాడలేదు. మే నెలలో ముఖం చాటేసిన వానలు జూన్ ముగుస్తున్నా జోరందుకోవడం లేదు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, బంగాళాఖాతలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఏర్పడ్డాయని వాతావరణ శాఖ చెబుతోంది… ఇలా వాతావరణం అనుకూలంగా ఉన్నా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు మాత్రం కురవడంలేదు.
నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి ముందుగానే ప్రవేశించాయి... దీంతో జూన్ ఆరంభంలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం మే చివర్లో ప్రారంభమయ్యింది. మే ఎండింగ్ లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో తొలకరి జల్లులు బాగానే కురిసాయి. దీంతో ఈ ఏడాది వర్షాకాలమంతా ఇలాగే ఉంటుందని అందరూ భావించారు. కానీ చూస్తుండగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎండలు మండిపోవాల్సిన సమయంలో జోరువానలు కురవగా... అసలు వర్షాకాలంలో మాత్రం వానలే లేవు. జూన్ నెలంతా లోటు వర్షపాతమే... ఇంకా చెప్పాలంటే కొన్నిప్రాంతాల్లో అసలు వర్షపు చుక్కే లేదు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలే లేవాయే...
ఇప్పుడు కూడా గత నాలుగైదు రోజులుగా వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. కానీ ఆదిలాబాద్ వంటి ఒకటిరెండు జిల్లాలు మినహా ఎక్కడ భారీ వర్షాలు కురిసింది లేదు. చాలా ప్రాంతాలు చిరుజల్లులు సరిపెడుతున్నాయి. తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి. మరో రెండ్రోజుల్లో జూన్ ముగుస్తుంది... అంటే ఈ నెలలో ఇక వర్షాల కథ కంచికే అని స్పష్టంగా అర్థమవుతోంది.
జూన్ 28 తెలంగాణ వాతావరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎప్పుడు బలపడిందో, ఎప్పుడు బలహీన పడిందో అర్థంకావడం లేదు. రుతుపవనాలు చురుగ్గా మారాయని, అల్పపీడనం బలపడిందని గత రెండుమూడు రోజులుగా వాతావరణ శాఖ చెబుతూవచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో భారీ వర్షాల జాడలేదు. తెలంగాణలో ఆదిలాబాద్ మినహా తెలంగాణలోని ఏ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసింది లేదు.
అయితే అల్పపీడనం బలంగా ఉన్న సమయంలోనే వర్షాలు లేవు... ఇప్పుడు ఇది బలహీన పడిందట. కాబట్టి భారీ వర్షాలను ఆశించడం అత్యాశే అవుతుంది. ఇక నెలలో మిగిలిన మూడ్రోజులు కూడా తెలంగాణలో వర్షాలు లేనట్లే అన్నమాట... అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశాలు మాత్రమే ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
ఈ తెలంగాణ జిల్లాల్లో చిరుజల్లులే
ఇవాళ(శనివారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడా సాధారణ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో చిరుజల్లులకు అవకాశం ఉందని వెల్లడించారు.
హైదరాబాద్ విషయానికి వస్తే రోజంతా మేఘాలు కమ్మేసి ఉంటాయని... మధ్యాహ్నం కాస్త ఉక్కపోతగా ఉన్నా సాయంత్రం చల్లబడి వాతావరణం ఆహ్లాదరకంగా మారుతుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తుంపర్లతో కూడిన చిరుజల్లులు పడతాయని తెలిపారు. ఈ నెలలో ఇక ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
జూన్ 29 ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తెలంగాణలో మాదిరి వాతావరణ పరిస్థితులే ఉండనున్నాయట. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు మన పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అతిభారీ వర్షాలతో నదులు, వాగులువంకలు ఉప్పొంగి వరద పరిస్థితులు నెలకొన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.
నేడు(శనివారం) ఏపీలో కూడా చెదురుమదురు జల్లులు మినహా భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయట. ఇవాళే కాదు ఈ నెలలో మిగిలిన రెండ్రోజులు ఇలాగే ఉంటుందని.... వర్షాలు జోరందుకునే అవకాశాలు లేవని వాతావరణ శాఖ చెబుతోంది.