weather: విశాఖపట్నంలో ఎండలు, ఉక్కపోతతో పాటు అకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Weather: విశాఖపట్నంలో వారం రోజులుగా తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నగర ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.
ఆనందపురం మండలంలో జూన్ 7 ఉదయం నుంచి జూన్ 8 ఉదయం వరకు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే సమయంలో అత్యధికంగా 37.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఈ మండలంలో నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడినప్పటికీ, ఉదయం ఉష్ణోగ్రతలు 35°C నుంచి 38°C మధ్య నమోదయ్యాయి. తేమ స్థాయి (రిలేటివ్ హ్యూమిడిటీ) 70%కుపైగా ఉండడంతో ఉక్కపోత మరింతగా పెరిగింది.
వాల్తేరు ప్రాంతంలో జూన్ 8 ఆదివారం రోజున అత్యధిక ఉష్ణోగ్రత 34.2°C కాగా, తేమ స్థాయి 86%గా నమోదైంది. విశాఖపట్నం విమానాశ్రయంలో 35.6°C ఉష్ణోగ్రత నమోదవగా, తేమ స్థాయి 67%గా ఉంది.
రుతుపవనాలు వచ్చినా తగ్గని తేమ
ఈ వాతావరణ మార్పులు మే చివరివారంలో ప్రారంభమైన నైరుతి రుతుపవనాల గాలుల కారణంగా మొదలయ్యాయి. మాన్సూన్ ప్రవేశించినప్పటికీ తేమ తగ్గలేదు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అధిక చెమట, నీరసం సమస్యలతో బాధపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రకారం.. జూన్ 9 సోమవారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కపోత తీవ్రంగా ఉండే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 41°C నుంచి 42°C వరకు చేరే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా 32°C నుంచి 36°C మధ్యనే ఉన్నా, తేమ స్థాయిలు అధికంగా ఉండటంతో ప్రజలు 40°C నుంచి 45°C మధ్య హీట్ ఇండెక్స్‌ను అనుభవిస్తున్నారు.
వైజాగ్ ప్రజలపై హీట్ ఇండెక్స్ దెబ్బ
హీట్ ఇండెక్స్ అంటే ఏమిటి అనే ప్రశ్నకు ఆంధ్రా యూనివర్శిటీ ఎమిరిటస్ ప్రొఫెసర్ ఓ.ఎస్.ఆర్.యు. భానుకుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. “ఒక చోట వేడి 30°Cగా ఉన్నా, తేమ స్థాయి అధికంగా ఉంటే ప్రజలు దాన్ని 40°Cలా అనుభవిస్తారు. దీనినే హీట్ ఇండెక్స్ అంటారు. సౌకర్యంగా ఉండాలంటే తేమ స్థాయి 40-45% కంటే తక్కువగా ఉండాలి. మాన్సూన్ వచ్చిన తర్వాత కూడా తేమ స్థాయిలు అధికంగా ఉండే అవకాశముంది” అని ఆయన తెలిపారు.
అధిక తేమ రెండు ప్రభావాలను కలిగిస్తుందనీ, అవి వర్షాలు పడటం, అధిక చెమట పట్టడమని తెలిపారు. తేమను నాలుగు పరామితుల ద్వారా కొలవవచ్చనీ, వాటిలో రిలేటివ్ హ్యూమిడిటీ ప్రధానమని ఆయన పేర్కొన్నారు. ఆర్హెచ్ స్థాయి అధికంగా ఉంటే, వాతావరణం తడిగా మారి సాయంత్రం సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంటుంది అని ఆయన వివరించారు.